పాత ఆభరణాలు అమ్మినా జీఎస్‌టీ!
3 శాతం వడ్డింపు
న్యూఢిల్లీ: పాత ఆభరణాలు లేదా బంగారం విక్రయించినా కూడా 3 శాతం మేర వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వర్తిస్తుందని రెవెన్యూ విభాగం కార్యదర్శి హస్‌ముఖ్ అధియా వెల్లడించారు. అయితే, ఒకవేళ పాత ఆభరణాన్ని విక్రయించగా వచ్చిన మొత్తంతో మరో దాన్ని కొనుక్కున్న పక్షంలో.. కొత్త ఆభరణంపై కట్టాల్సిన జీఎస్‌టీకి సదరు పన్నును సర్దుబాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఉదాహరణకు ఆభరణాల విక్రేత.. ఇతరుల దగ్గర్నుంచి పాత ఆభరణాలు కొన్నప్పుడు అది బంగారం కొనడంతో సమానమవుతుంది. దానికి తగ్గట్లుగానే రివర్స్ చార్జీ కింద 3% జీఎస్‌టీ వర్తిస్తుంది. అంటే రూ. లక్ష విలువ చేసే ఆభరణాలు అమ్మితే రూ. 3,000 మొత్తం జీఎస్‌టీ కింద డిడక్ట్ అవుతుంది.
ఒకవేళ పాత ఆభరణాన్ని అమ్మితే వచ్చిన డబ్బుతో కొత్తది కొనుక్కుంటే అమ్మినప్పుడు కట్టిన జీఎస్‌టీ.. కొన్నప్పుడు కట్టాల్సిన జీఎస్‌టీలో సర్దుబాటు అవుతుంది‘ అని జీఎస్‌టీ మాస్టర్ క్లాస్‌లో అధియా వివరించారు. అలాగే పాత ఆభరణాలను మార్పులు, చేర్పుల కోసం వ్యాపారికి ఇచ్చిన పక్షంలో దాన్ని జాబ్ వర్క్ కింద పరిగణించి 5% జీఎస్‌టీ విధించడం జరుగుతుందని తెలిపారు. మరోవైపు కాంపోజిషన్ స్కీము వినియోగించుకోవాలని కోరుకునే వ్యాపారులు.. జూలై 21లోగా జీఎస్‌టీఎన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని చెప్పారు. సుమారు రూ. 75 లక్షల దాకా టర్నోవరు ఉండే చిన్న వ్యాపార సంస్థలు ఈ స్కీముకు అర్హత కలిగి ఉంటాయి. దీన్ని ఎంచుకున్న సంస్థలకు రికార్డుల నిర్వహణ మొదలైన విషయాల్లో కొంత వెసులుబాటు లభిస్తుంది.