Hasmukh Adhia
-
మే నెల జీఎస్టీ వసూళ్లు ఇవీ..
సాక్షి, న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జీఎస్టీ) వసూళ్లు ఈ నెలలో స్వల్పంగా తగ్గాయి. మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 94,016కోట్లుగా నమోదయ్యాయి. గత నెల ఏప్రిల్‌లో జీఎస్టీవసూళ్లు గరిష్ఠంగా రూ. 1.03లక్షల కోట్లుగా ఉన్నాయి. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు జీఎస్టీ వసూళ్లు రూ. 89,885కోట్లుగా నమోదయ్యాయని ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ ఆధియా ఈ లెక్కలను ట్విటర్లో శుక్రవారం వెల్లడించారు. ఇ-వే బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత వచ్చిన మెరుగైన ప్రదర్శనను ఇది ప్రతిబింబిస్తుందని ఆదియా పేర్కొన్నారు. మొత్తం వసూళ్లు పెరగడమేకాకుండా.. రిటర్న్స్ సంఖ్య కూడా పెరిగిందన్నారు. మే 31 వరకు ఏప్రిల్ నెలలో దాఖలు చేసిన రిటర్న్స్ సంఖ్య 60.47 లక్షలతో పోలిస్తే 62.46కి పెరిగిందన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు ప్రకారం సర్దుబాటు అనంతరం రూ. 15,866 కోట్లు సెంట్రల్ జిఎస్టీ (సిజిఎస్టీ), రాష్ట్ర జీఎస్టీ(ఎస్జీఎస్టీ) రూ.21,691 కోట్లు. రూ. 49,120 కోట్లు ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ (ఐజీఎస్టీ), సెస్ వసూళ్లుగా రూ. 7,339 కోట్లు. మే 31 వరకు ఏప్రిల్ నెల రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 62.47లక్షలు. మార్చి నెల జీఎస్టీ పరిహారం కింద మే 29న రాష్ట్రాలకు రూ. 6696కోట్లు విడుదల చేశారు. దీంతో జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి(జులై, 2017) నుంచి మార్చి, 2018 వరకు రాష్ట్రాలకు అందించిన జీఎస్టీ పరిహారం రూ. 47,844కోట్లుగా ఉంది. The total GST collection for May 2018 is Rs 94,016 crores, which is higher compared to average monthly collection of Rs 89,885 crores of 2017-18. This reflects better compliance after introduction of e-way bills. — Dr Hasmukh Adhia (@adhia03) June 1, 2018 -
కొత్త ఆర్థిక కార్యదర్శి ఎంపిక
సాక్షి, న్యూఢిల్లీ: రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న హస్ముఖ్ అధియాకు కేంద్రం పదోన్నతి కల్పించింది. కేంద్ర ఆర్థిక శాఖ కొత్త కార్యదర్శి గా ఆయనను ఎంపిక చేసింది. ప్రస్తుత కార్యదర్శి శక్తి కాంత్ దాస్ స్థానంలో ఆయన్ను నియమించింది. ఈ మేరకు క్యాబినెట్‌కు చెందిన అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం లభించింది. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న శక్తి కాంత్ దాస్ పదవీ కాలం ముగియడంతో ఈ ఎంపిక అనివార్యమైంది. -
జీఎస్టీ రేట్లలో మార్పులు అవసరం: అధియా
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై భారాన్ని తగ్గించేందుకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా అన్నారు. దేశంలో జీఎస్టీ వ్యవస్థ సర్దుబాటు కావటానికి దాదాపు ఏడాది సమయం పట్టొచ్చన్నారు. ఒకే తరహాకు చెందిన కొన్ని రకాల వస్తువులు వేర్వేరు పన్ను శ్లాబుల్లో ఉన్నాయనీ, వీటన్నింటిపై ఒకే పన్ను రేటును నిర్ణయించడంతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై అధిక భారం పడకుండా చూస్తూ, సామాన్యులకు లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. 23వ జీఎస్టీ మండలి సమావేశం నవంబర్‌లో గువాహటిలో జరగనుంది. -
బంగారం కొనుగోళ్లపై కొత్త పరిమితి!
న్యూఢిల్లీ: బంగారం కొనుగోళ్లపై కొత్త పరిమితి తీసుకొస్తామని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. అధిక విలువగల లావాదేవీల సమాచారాన్ని ఆభరణాల వర్తకులు ప్రభుత్వ విభాగాలకు తెలియజేయాల్సివుంటుందంటూ ఆగస్టు 23న జారీచేసిన ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ కేంద్రం శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా మాట్లాడుతూ... ఆగస్ట్ 23 నాటి నోటిఫికేషన్ ఎంతో అయోమయం, ప్రతికూల సెంటిమెంట్‌కు దారితీసిందని, అందుకే దాన్ని రద్దు చేసినట్టు చెప్పారు. వాస్తవానికి ఆ నోటిఫికేషన్లో ఎంత విలువైన కొనుగోళ్ల గురించి తెలియజేయాలనేది పరిమితి విధించలేదన్నారు. దీంతో ఆభరణాల విక్రయదారులు.... బ్యాంకులు రూ.50,000కు మించిన నగదు డిపాజిట్ల సమాచారాన్ని ఐటీ విభాగానికి తెలియజేసినట్టుగానే... తాము కూడా అంతే విలువైన లావాదేవీల గురించి సమాచారం అందిస్తున్నారని చెప్పారు. అలాగే, ఆభరణాల విక్రేతలు మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద లావాదేవీల సమాచారం తెలియజేయాలని నోటిఫై చేసినప్పటికీ, అందులో స్పష్టత లేదన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై పరిశ్రమ వర్గాలతో సంప్రదించాక బంగారం, ఇతర విలువైన లోహాలు, రత్నాల కొనుగోళ్ల లావాదేవీల్లో ఎంత విలువైన వాటి గురించి తెలియజేయాలన్నది త్వరలోనే నిర్ణయిస్తామని అధియా తెలిపారు. రూ.50,000 పరిమితి బంగారానికి కాదు ‘‘ఆభరణాలకు సంబంధించి రూ.50,000 పరిమితి కఠినమైనది. బ్యాంకుల్లో నగదు జమలన్నది వేరు. అక్కడ ప్రతీ లావాదేవీ ఎలక్ట్రానిక్ రూపంలోనే జరుగుతుంది. దాంతో సులభంగా నివేదించడం సాధ్యపడుతుంది. కానీ, ఇక్కడా దాన్ని అమలు చేస్తున్నారు’’ అని అధియా పేర్కొన్నారు. రూ.2కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఆభరణాల విక్రయదారులు తమ లావాదేవీల సమాచారం తెలియజేయాల్సిన అవసరం ఉంటుందని, రూ.50,000 అన్నది సాధారణ నిబంధనల్లో ఉన్న పరిమితిగా గుర్తు చేశారు. పీఎంఎల్ఏ చట్టం కింద బ్యాంకులు, బీమా సంస్థలు ఇలా ఏ సంస్థ అయినా అధిక విలువ కలిగిన లావాదేవీల సమాచారం చెప్పాల్సిందేనన్నారు. రెండు నెలల్లో జీఎస్టీ రిఫండ్స్ ఎగుమతిదారులకు పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ రిఫండ్స్ నవంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని అధియా తెలిపారు. జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి రాగా, ఆగస్ట్ చివరి వరకు కేంద్రానికి ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ. 67.000 కోట్లు వసూలు అయిందని, ఇందులో ఎగుమతిదారులకు చెల్లించాల్సింది రూ.5,000– 10,000 కోట్లలోపే ఉంటుందని అధియా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న కాలానికి ఎగుమతిదారులు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఈ వ్యాలెట్ సర్వీస్ మొదలవుతుందని, ఇది ఎగుమతిదారులకు జాతీయ స్థాయిలో క్రెడిట్స్ ఇస్తుందని, దీన్ని జీఎస్టీ చెల్లింపులకు వినియోగించుకోవచ్చని తెలిపారు. -
పాత ఆభరణాలు అమ్మినా జీఎస్టీ!
3 శాతం వడ్డింపు న్యూఢిల్లీ: పాత ఆభరణాలు లేదా బంగారం విక్రయించినా కూడా 3 శాతం మేర వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వర్తిస్తుందని రెవెన్యూ విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా వెల్లడించారు. అయితే, ఒకవేళ పాత ఆభరణాన్ని విక్రయించగా వచ్చిన మొత్తంతో మరో దాన్ని కొనుక్కున్న పక్షంలో.. కొత్త ఆభరణంపై కట్టాల్సిన జీఎస్టీకి సదరు పన్నును సర్దుబాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఉదాహరణకు ఆభరణాల విక్రేత.. ఇతరుల దగ్గర్నుంచి పాత ఆభరణాలు కొన్నప్పుడు అది బంగారం కొనడంతో సమానమవుతుంది. దానికి తగ్గట్లుగానే రివర్స్ చార్జీ కింద 3% జీఎస్టీ వర్తిస్తుంది. అంటే రూ. లక్ష విలువ చేసే ఆభరణాలు అమ్మితే రూ. 3,000 మొత్తం జీఎస్టీ కింద డిడక్ట్ అవుతుంది. ఒకవేళ పాత ఆభరణాన్ని అమ్మితే వచ్చిన డబ్బుతో కొత్తది కొనుక్కుంటే అమ్మినప్పుడు కట్టిన జీఎస్టీ.. కొన్నప్పుడు కట్టాల్సిన జీఎస్టీలో సర్దుబాటు అవుతుంది‘ అని జీఎస్టీ మాస్టర్ క్లాస్‌లో అధియా వివరించారు. అలాగే పాత ఆభరణాలను మార్పులు, చేర్పుల కోసం వ్యాపారికి ఇచ్చిన పక్షంలో దాన్ని జాబ్ వర్క్ కింద పరిగణించి 5% జీఎస్టీ విధించడం జరుగుతుందని తెలిపారు. మరోవైపు కాంపోజిషన్ స్కీము వినియోగించుకోవాలని కోరుకునే వ్యాపారులు.. జూలై 21లోగా జీఎస్టీఎన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని చెప్పారు. సుమారు రూ. 75 లక్షల దాకా టర్నోవరు ఉండే చిన్న వ్యాపార సంస్థలు ఈ స్కీముకు అర్హత కలిగి ఉంటాయి. దీన్ని ఎంచుకున్న సంస్థలకు రికార్డుల నిర్వహణ మొదలైన విషయాల్లో కొంత వెసులుబాటు లభిస్తుంది. -
క్రెడిట్‌కార్డు చెల్లింపులపై డబుల్ పన్ను?
కొత్త పన్ను విధానం జీఎస్టీ అమల్లోకి రావడంతో క్రెడిట్ కార్డులు లేదా ఎలక్ట్రానిక్ విధానం జరిపే చెల్లింపులకు రెట్టింపు పన్ను భరించాల్సి వస్తుందనే రూమర్లకు ప్రభుత్వం చెక్ పెట్టింది. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మద్దని సూచించింది. రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా సోషల్ మీడియాలో వచ్చే రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే యుటిలిటీ బిల్లుల పేమెంట్లకు జీఎస్టీ రెండు సార్లు చెల్లించాల్సి వస్తుందనే వార్తలు పూర్తిగా అవాస్తవం అని అధియా ట్వీట్ చేశారు. అథారిటీల వద్ద చెక్ చేసుకోకుండా.. ఇలాంటి మెసేజ్‌లను సోషల్ మీడియాలో రీ-సర్క్యూలేట్ చేయవద్దని చెప్పారు. నేషనల్ పేమెంట్ల కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ హోటా కూడా ఈ డబుల్ పన్నుల రూమర్లపై స్పందించారు. ఆయన కూడా ఈ రూమర్లు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. 18 శాతం జీఎస్టీ మినహా మిగతా ఎలాంటి ఛార్జీలను తాము వేయడం లేదని స్పష్టీకరించారు. అంతకముందున్న సేవాపన్ను 15 శాతం, కొత్తగా వచ్చిన పన్నుల విధానంతో 18 శాతమైన సంగతి తెలిసిందే. కాగ, జీఎస్టీ ప్రభావంతో ఫైనాన్సియల్ సెక్టార్ పన్నులు మూడు శాతం పాయింట్లు పెరగనున్నట్టు కొన్ని బ్యాంకర్లు చెప్పాయి. కాగ, వీటిని ప్రస్తుతం కూడా సర్వీసు పన్ను రూపంలో వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నాయి. అయితే తాము అదనంగా ఎలాంటి లావాదేవీల పన్ను వేయడం లేదని సీనియర్ బ్యాంకర్ చెప్పారు. -
జీఎస్టీ : గందరగోళాలపై క్లారిటీ
ఇంకాకొన్ని గంటల్లో పార్లమెంట్ సెంట్రల్ వేదికగా జీఎస్టీ అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానంపై వస్తున్న గందరగోళాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా క్లారిటీ ఇచ్చారు. టెక్నాలజీకల్ గా, ఆర్థికంగా జీఎస్టీ ఎంతో అద్భుతమైనదని చెప్పారు. ఎలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని అధియా సూచించారు. అయితే జీఎస్టీ కింద నెలకు నాలుగు రిటర్న్స్‌లను రిటైలర్లు దాఖలు చేయాల్సి ఉందని మార్కెట్లో ఊహాగానాలు వస్తున్నాయని, అవన్నీ నిజం కాదని పేర్కొన్నారు. నెలకు కేవలం ఒక్క రిటర్న్ దాఖలు చేస్తే సరిపోతుందని తెలిపారు. మిగతా రెండింటిని కంప్యూటర్ చేస్తుందని చెప్పారు. కంపోజిట్ రిటైలర్లు కూడా ప్రతినెలా రిటర్న్ దాఖలు దాఖలు చేయాల్సినవసరం లేదని, ప్రతి మూడు నెలలకు ఓ సారి దాఖలు చేస్తే కూడా సరిపోతుందని చెప్పారు. అదీ కూడా మొత్తం టర్నోవర్ వివరాలు మాత్రమేనన్నారు. జీఎస్టీ అమలుకు పెద్ద ఐటీ ఇన్ఫ్రా కూడా అవసరం లేదన్నారు. ''బిజినెస్ టూ బిజినెస్(బీ టూ బీ) లావాదేవీలకు కూడా పెద్ద సాఫ్ట్ వేర్ అక్కర్లేదని చెప్పిన అధియా, తాము ఉచితంగా సాఫ్ట్వేర్ కూడా అందించనున్నట్టు వెల్లడించారు. అదనంగా బీ టూ బీ లావాదేవీలకు ఎక్స్ఎల్ ఫార్మాట్‌ను ఇవ్వనున్నట్టు తెలిపారు. దీంతో ప్రతినెలా 10న ఇన్వాయిస్ వివరాలను అప్డేట్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి వీలుంటుందన్నారు. పన్నులను సక్రమంగా చెల్లించే వారికి ఇది ఎంతో లబ్దిదాయకమని చెప్పారు. -
షాకింగ్: పన్నులు ఎగవేస్తున్న 8-9లక్షల కంపెనీలు
న్యూఢిల్లీ: రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా సంచలన విషయాలను వెల్లడించారు. దాదాపు 8-9 లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు పన్నులు చెల్లించడంలేదని శనివారం ప్రకటించారు. ప్రభుత్వానికి పన్నుచెల్లించకుండా బడా కంపెనీలు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నట్టు తెలిపారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయని లక్షల రిజిస్టర్డ్ కంపెనీలను గుర్తించి నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. ఎన్‌ఫెర్స్‌మెంట్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అధియా ఈ విషయాలను వెల్లడించారు. దీనిపై ప్రధానిమంత్రిత్వవర్గ కార్యాలయం పరిశీలిస్తోందని తెలిపారు. పీఎంవో ఆధ్వర్యంలో ఎంసీఏ కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే టాస్క్ ఫోర్స్ ప్రతి 15 రోజులకు ఈ కంపెనీలను మానిటర్ చేస్తోందని చెప్పారు. మొత్తం 15 లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు ఉండవగా, వాటిల్లో 8నుంచి 9 లక్షల కంపెనీలు తమ వార్షిక ఆదాయాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ) వద్ద దాఖలు చేయడంలేదని పేర్కొన్నారు. మనీలాండరింగ్ వ్యవహరాలతో ఇవి పెద్ద ప్రమాదకరమైనవిగా మారాయని చెప్పారు. వీటిలో కొన్నింటికి నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. రూ.6 వేలకోట్ల బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో చూసినట్లు ట్రేడ్ ఆధారిత నగదు లాండరింగ్ కూడా ఈ రోజుల్లో ప్రముఖంగా ఉందని అధియా చెప్పారు. కాగా దేశీయ షెల్ కంపెనీలపై భారీ అణిచివేత చర్యల్లో భాగంగా ఫిబ్రవరిలో ప్రభుత్వం "కఠిన చర్య" తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పన్నులు ఎగ్గొడుతున్న ఈ కంపెనీల బ్యాంకు ఖాతాలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
‘విశ్వసనీయ ఫిర్యాదుల్నే పట్టించుకుంటాం’
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో అక్రమ లాభార్జన నిరోధక నిబంధన విశ్వసనీయ ఫిర్యాదులనే పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. ఈ నిబంధన జీఎస్టీ వల్ల తగ్గిన పన్ను వినియోగదారులకు చేరే విధంగా చేయడం కోసమే ఏర్పాటు చేశామన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నిబంధనపై ఫిర్యాదులకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు రూపొందించుకుంటాయని అన్నారు. ఈ నిబంధన ప్రకారం వినియోగదారులకు ప్రయోజనం అందిందా లేదా అనేది ఎవరు నిర్ణయిస్తారని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘అది వచ్చిన ఫిర్యాదులను బట్టి ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో పోటీ అధికంగా ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ఆలోచించనవసరం లేదు. పోటీ ఇటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకుంటుంది’ అని అన్నారు. -
విద్య, ఆరోగ్యాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: విద్య, ఆరోగ్య సంరక్షణ, తీర్థయాత్రలు తదితర సేవలకు వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నుంచి మినహాయింపు లభించనుంది. ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉన్న సేవలను జీఎస్టీ అమలయ్యే తొలి ఏడాదిలో అలాగే కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్‌కు సిఫార్సు చేస్తామని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. కాగా, జీఎస్టీకి సంబంధించిన 8 రకాల నిబంధలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. జీఎస్టీలోని కంపొజిషన్, వాల్యుయేషన్, ట్రాన్సిషన్, ఐటీసీ, ఇన్వాయిస్, పేమెంట్స్, రీఫండ్, రిజిస్ట్రేషన్ అంశాలపై ఇండస్ట్రీ తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు. -
రూ.3 లక్షలకు పైన నగదు తీసుకుంటే
ఇక జరిమానా బాదుడు! 100 శాతం జరిమానా విధింపు.. ∙ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: రూ.3 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతే మొత్తం(100శాతం) జరి మానా రూపంలో సమర్పించుకోవాల్సి వస్తుంది. ఈ నిబంధన వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు రెవెన్యూ వ్యవహారాల విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. నల్లధనానికి చెక్‌పెట్టేందుకు రూ.3 లక్షలు, అంతకు మించి నగదు లావాదేవీలను నిషేధించే సెక్షన్‌ను ఐటీ చట్టంలో ప్రతిపాదిస్తూ 2017–18 కేంద్ర బడ్జెట్ సందర్భంగా అరుణ్‌జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై అధియా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ... రూ.3 లక్షలకు మించి నగదు తీసుకుంటే, దానికి సమాన మొత్తంలో తీసుకున్న వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుం దన్నారు. ఉదాహరణకు రూ.4 లక్షల నగదు లావాదేవీ జరిపితే జరిమానా రూ.4 లక్షలు చెల్లించాలని, రూ.50 లక్షల లావాదేవీ అయితే జరిమాన రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా ఒకరు ఖరీదైన వాచీని నగదుపై కొనుగోలు చేస్తే షాపు నిర్వాహకుడే పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధియా తెలిపారు. ఈ నిబంధన భారీ నగదు లావేదేవీల విషయంలో వెనక్కి తగ్గేలా చేస్తుందన్నారు. డీమోనిటైజేషన్ నల్లధనం నిల్వల్ని లెక్కల్లోకి తీసుకొచ్చేలా చేసిందని, భవిష్యత్తులోనూ నల్లధన చలామణిని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. భారీ నగదు లావాదేవీలన్నింటినీ ప్రభుత్వం పట్టుకుంటుందని, అలాగే నగదు ఆధారిత వినియోగానికి ఉన్న అవకాశాలను కూడా మూసివేస్తుందన్నారు. లెక్కల్లో చూపని ఆదాయాన్ని ప్రజలు పర్యాటక సందర్శనలు, కార్లు, వాచీలు, ఆభరణాల వంటి సంపన్న వస్తువులు కొనుగోలుపై వెచ్చిస్తుంటారని, కొత్త నిబంధనల కింద ఇటువంటి మార్గాలకు చెక్ పెట్టనున్నట్టు పేర్కొన్నారు. రూ.2 లక్షలకు పైబడి నగదు లావాదేవీకి పాన్ నంబర్ పేర్కొనాలన్న పాత నిబంధన ఇకపైనా కొనసాగుతుందన్నారు. -
18 లక్షల అనుమానాస్పద ఖాతాలపై కొరడా!
న్యూఢిల్లీ: నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకుల్లో భారీ మొత్తంలో అక్రమ డిపాజిట్లు చేసినట్టు తేలింది. డీమానిటైజేషన్ తరువాత పెద్దమొత్తంలో రద్దయిన నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేసినట్టు తేలింది. సుమారు 18 లక్షల అనుమానాస్పద ఖాతాలను ఐటీ గుర్తించిందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా చెప్పారు. ఆపరేషన్ క్లీన్ మనీ పథకంలో ఈవెరిఫికేషన్ ద్వారా ఈ ఖాతాల వివరాలను సేకరించినట్టు మంగళవారు వెల్లడించారు. నవంబరు 9 నుంచి డిసెంబర్ 31, 2016 మధ్య నమోదైన భారీ డిపాజిట్లపై దృష్టిపెట్టిన కేంద్రం డాటా ఎనలిస్టుల సహాయంతో ఈ అక్రమార్కులు భరతం పట్టేందుకు సిద్ధమవుతోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీమొత్తంలో నగదును బ్యాంకుల్లో డిపాజిట్ వారికి ఐటీ నోటీసులును పంపనున్నట్టు ఆయన తెలిపారు. టాక్స్ పేమెంట్ ప్రొఫైల్ తో సరిపోలని డిపాజిట్ దారుల ఈ మెయిల్, ఎస్ఎంఎస్ ల ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించనున్నారు. ఈ ప్రశ్నలకు స్పందించకపోయినా లేదా ప్రతిస్పందన అసంతృప్తికరంగా ఉన్నా వెంటనే నోటీసులు జారీ చేస్తామని ఆయన తెలిపారు. మరోవైపు రూ. 2 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వారి సంఖ్య దాదాపు 1 కోటి దాకా ఉన్నట్టు సమాచారం. అలాగే కరెంట్ ఖాతాల్లో 12.5 లక్షలకుపైగా డిపాజిట్లను కూడా ఐటీ స్క్రూట్నీ చేయనుంది. -
జీఎస్టీని డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లించొచ్చు
ఇండోర్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను వ్యక్తులు, సంస్థలు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో చెల్లించొచ్చని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. ఏ బ్యాంకు నుంచి అయినా సరే పన్ను చెల్లించవచ్చని ఆదివారమిక్కడ జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌లో వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను ఆన్ లైన్ ద్వారా నిర్వహించాలని యోచిస్తోంది.