18 లక్షల అనుమానాస్పద ఖాతాలపై కొరడా!
న్యూఢిల్లీ: నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకుల్లో భారీ మొత్తంలో అక్రమ డిపాజిట్లు చేసినట్టు తేలింది. డీమానిటైజేషన్ తరువాత పెద్దమొత్తంలో రద్దయిన నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేసినట్టు తేలింది. సుమారు 18 లక్షల అనుమానాస్పద ఖాతాలను ఐటీ గుర్తించిందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా చెప్పారు. ఆపరేషన్ క్లీన్ మనీ పథకంలో ఈవెరిఫికేషన్ ద్వారా ఈ ఖాతాల వివరాలను సేకరించినట్టు మంగళవారు వెల్లడించారు. నవంబరు 9 నుంచి డిసెంబర్ 31, 2016 మధ్య నమోదైన భారీ డిపాజిట్లపై దృష్టిపెట్టిన కేంద్రం డాటా ఎనలిస్టుల సహాయంతో ఈ అక్రమార్కులు భరతం పట్టేందుకు సిద్ధమవుతోంది.
పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీమొత్తంలో నగదును బ్యాంకుల్లో డిపాజిట్ వారికి ఐటీ నోటీసులును పంపనున్నట్టు ఆయన తెలిపారు. టాక్స్ పేమెంట్ ప్రొఫైల్ తో సరిపోలని డిపాజిట్ దారుల ఈ మెయిల్, ఎస్ఎంఎస్ ల ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించనున్నారు. ఈ ప్రశ్నలకు స్పందించకపోయినా లేదా ప్రతిస్పందన అసంతృప్తికరంగా ఉన్నా వెంటనే నోటీసులు జారీ చేస్తామని ఆయన తెలిపారు. మరోవైపు రూ. 2 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వారి సంఖ్య దాదాపు 1 కోటి దాకా ఉన్నట్టు సమాచారం. అలాగే కరెంట్ ఖాతాల్లో 12.5 లక్షలకుపైగా డిపాజిట్లను కూడా ఐటీ స్క్రూట్నీ చేయనుంది.