న్యూఢిల్లీ: బంగారం కొనుగోళ్లపై కొత్త పరిమితి తీసుకొస్తామని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. అధిక విలువగల లావాదేవీల సమాచారాన్ని ఆభరణాల వర్తకులు ప్రభుత్వ విభాగాలకు తెలియజేయాల్సివుంటుందంటూ ఆగస్టు 23న జారీచేసిన ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ కేంద్రం శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా మాట్లాడుతూ... ఆగస్ట్ 23 నాటి నోటిఫికేషన్ ఎంతో అయోమయం, ప్రతికూల సెంటిమెంట్‌కు దారితీసిందని, అందుకే దాన్ని రద్దు చేసినట్టు చెప్పారు.
వాస్తవానికి ఆ నోటిఫికేషన్‌లో ఎంత విలువైన కొనుగోళ్ల గురించి తెలియజేయాలనేది పరిమితి విధించలేదన్నారు. దీంతో ఆభరణాల విక్రయదారులు.... బ్యాంకులు రూ.50,000కు మించిన నగదు డిపాజిట్ల సమాచారాన్ని ఐటీ విభాగానికి తెలియజేసినట్టుగానే... తాము కూడా అంతే విలువైన లావాదేవీల గురించి సమాచారం అందిస్తున్నారని చెప్పారు.
అలాగే, ఆభరణాల విక్రేతలు మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద లావాదేవీల సమాచారం తెలియజేయాలని నోటిఫై చేసినప్పటికీ, అందులో స్పష్టత లేదన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై పరిశ్రమ వర్గాలతో సంప్రదించాక బంగారం, ఇతర విలువైన లోహాలు, రత్నాల కొనుగోళ్ల లావాదేవీల్లో ఎంత విలువైన వాటి గురించి తెలియజేయాలన్నది త్వరలోనే నిర్ణయిస్తామని అధియా తెలిపారు.
రూ.50,000 పరిమితి బంగారానికి కాదు
‘‘ఆభరణాలకు సంబంధించి రూ.50,000 పరిమితి కఠినమైనది. బ్యాంకుల్లో నగదు జమలన్నది వేరు. అక్కడ ప్రతీ లావాదేవీ ఎలక్ట్రానిక్ రూపంలోనే జరుగుతుంది. దాంతో సులభంగా నివేదించడం సాధ్యపడుతుంది. కానీ, ఇక్కడా దాన్ని అమలు చేస్తున్నారు’’ అని అధియా పేర్కొన్నారు.
రూ.2కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఆభరణాల విక్రయదారులు తమ లావాదేవీల సమాచారం తెలియజేయాల్సిన అవసరం ఉంటుందని, రూ.50,000 అన్నది సాధారణ నిబంధనల్లో ఉన్న పరిమితిగా గుర్తు చేశారు. పీఎంఎల్‌ఏ చట్టం కింద బ్యాంకులు, బీమా సంస్థలు ఇలా ఏ సంస్థ అయినా అధిక విలువ కలిగిన లావాదేవీల సమాచారం చెప్పాల్సిందేనన్నారు.
రెండు నెలల్లో జీఎస్టీ రిఫండ్స్
ఎగుమతిదారులకు పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ రిఫండ్స్ నవంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని అధియా తెలిపారు. జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి రాగా, ఆగస్ట్ చివరి వరకు కేంద్రానికి ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ. 67.000 కోట్లు వసూలు అయిందని, ఇందులో ఎగుమతిదారులకు చెల్లించాల్సింది రూ.5,000– 10,000 కోట్లలోపే ఉంటుందని అధియా పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న కాలానికి ఎగుమతిదారులు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఈ వ్యాలెట్ సర్వీస్ మొదలవుతుందని, ఇది ఎగుమతిదారులకు జాతీయ స్థాయిలో క్రెడిట్స్ ఇస్తుందని, దీన్ని జీఎస్టీ చెల్లింపులకు
వినియోగించుకోవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment