షాకింగ్: పన్నులు ఎగవేస్తున్న 8-9లక్షల కంపెనీలు
న్యూఢిల్లీ: రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా సంచలన విషయాలను వెల్లడించారు. దాదాపు 8-9 లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు పన్నులు చెల్లించడంలేదని శనివారం ప్రకటించారు. ప్రభుత్వానికి పన్నుచెల్లించకుండా బడా కంపెనీలు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నట్టు తెలిపారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయని లక్షల రిజిస్టర్డ్ కంపెనీలను గుర్తించి నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు.
ఎన్‌ఫెర్స్‌మెంట్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అధియా ఈ విషయాలను వెల్లడించారు. దీనిపై ప్రధానిమంత్రిత్వవర్గ కార్యాలయం పరిశీలిస్తోందని తెలిపారు. పీఎంవో ఆధ్వర్యంలో ఎంసీఏ కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే టాస్క్ ఫోర్స్ ప్రతి 15 రోజులకు ఈ కంపెనీలను మానిటర్ చేస్తోందని చెప్పారు.
మొత్తం 15 లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు ఉండవగా, వాటిల్లో 8నుంచి 9 లక్షల కంపెనీలు తమ వార్షిక ఆదాయాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ) వద్ద దాఖలు చేయడంలేదని పేర్కొన్నారు. మనీలాండరింగ్ వ్యవహరాలతో ఇవి పెద్ద ప్రమాదకరమైనవిగా మారాయని చెప్పారు. వీటిలో కొన్నింటికి నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. రూ.6 వేలకోట్ల బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో చూసినట్లు ట్రేడ్ ఆధారిత నగదు లాండరింగ్ కూడా ఈ రోజుల్లో ప్రముఖంగా ఉందని అధియా చెప్పారు.
కాగా దేశీయ షెల్ కంపెనీలపై భారీ అణిచివేత చర్యల్లో భాగంగా ఫిబ్రవరిలో ప్రభుత్వం "కఠిన చర్య" తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పన్నులు ఎగ్గొడుతున్న ఈ కంపెనీల బ్యాంకు ఖాతాలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.