రూ.3 లక్షలకు పైన నగదు తీసుకుంటే
ఇక జరిమానా బాదుడు!
100 శాతం జరిమానా విధింపు.. ∙ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: రూ.3 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతే మొత్తం(100శాతం) జరి మానా రూపంలో సమర్పించుకోవాల్సి వస్తుంది. ఈ నిబంధన వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు రెవెన్యూ వ్యవహారాల విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. నల్లధనానికి చెక్‌పెట్టేందుకు రూ.3 లక్షలు, అంతకు మించి నగదు లావాదేవీలను నిషేధించే సెక్షన్‌ను ఐటీ చట్టంలో ప్రతిపాదిస్తూ 2017–18 కేంద్ర బడ్జెట్ సందర్భంగా అరుణ్‌జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై అధియా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ... రూ.3 లక్షలకు మించి నగదు తీసుకుంటే, దానికి సమాన మొత్తంలో తీసుకున్న వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుం దన్నారు. ఉదాహరణకు రూ.4 లక్షల నగదు లావాదేవీ జరిపితే జరిమానా రూ.4 లక్షలు చెల్లించాలని, రూ.50 లక్షల లావాదేవీ అయితే జరిమాన రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా ఒకరు ఖరీదైన వాచీని నగదుపై కొనుగోలు చేస్తే షాపు నిర్వాహకుడే పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధియా తెలిపారు. ఈ నిబంధన భారీ నగదు లావేదేవీల విషయంలో వెనక్కి తగ్గేలా చేస్తుందన్నారు.
డీమోనిటైజేషన్ నల్లధనం నిల్వల్ని లెక్కల్లోకి తీసుకొచ్చేలా చేసిందని, భవిష్యత్తులోనూ నల్లధన చలామణిని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. భారీ నగదు లావాదేవీలన్నింటినీ ప్రభుత్వం పట్టుకుంటుందని, అలాగే నగదు ఆధారిత వినియోగానికి ఉన్న అవకాశాలను కూడా మూసివేస్తుందన్నారు. లెక్కల్లో చూపని ఆదాయాన్ని ప్రజలు పర్యాటక సందర్శనలు, కార్లు, వాచీలు, ఆభరణాల వంటి సంపన్న వస్తువులు కొనుగోలుపై వెచ్చిస్తుంటారని, కొత్త నిబంధనల కింద ఇటువంటి మార్గాలకు చెక్ పెట్టనున్నట్టు పేర్కొన్నారు. రూ.2 లక్షలకు పైబడి నగదు లావాదేవీకి పాన్ నంబర్ పేర్కొనాలన్న పాత నిబంధన ఇకపైనా కొనసాగుతుందన్నారు.