Rs 3 lakh
-
రూ.3 లక్షలకు పైన నగదు తీసుకుంటే
ఇక జరిమానా బాదుడు! 100 శాతం జరిమానా విధింపు.. ∙ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: రూ.3 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతే మొత్తం(100శాతం) జరి మానా రూపంలో సమర్పించుకోవాల్సి వస్తుంది. ఈ నిబంధన వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు రెవెన్యూ వ్యవహారాల విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. నల్లధనానికి చెక్‌పెట్టేందుకు రూ.3 లక్షలు, అంతకు మించి నగదు లావాదేవీలను నిషేధించే సెక్షన్‌ను ఐటీ చట్టంలో ప్రతిపాదిస్తూ 2017–18 కేంద్ర బడ్జెట్ సందర్భంగా అరుణ్‌జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై అధియా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ... రూ.3 లక్షలకు మించి నగదు తీసుకుంటే, దానికి సమాన మొత్తంలో తీసుకున్న వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుం దన్నారు. ఉదాహరణకు రూ.4 లక్షల నగదు లావాదేవీ జరిపితే జరిమానా రూ.4 లక్షలు చెల్లించాలని, రూ.50 లక్షల లావాదేవీ అయితే జరిమాన రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా ఒకరు ఖరీదైన వాచీని నగదుపై కొనుగోలు చేస్తే షాపు నిర్వాహకుడే పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధియా తెలిపారు. ఈ నిబంధన భారీ నగదు లావేదేవీల విషయంలో వెనక్కి తగ్గేలా చేస్తుందన్నారు. డీమోనిటైజేషన్ నల్లధనం నిల్వల్ని లెక్కల్లోకి తీసుకొచ్చేలా చేసిందని, భవిష్యత్తులోనూ నల్లధన చలామణిని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. భారీ నగదు లావాదేవీలన్నింటినీ ప్రభుత్వం పట్టుకుంటుందని, అలాగే నగదు ఆధారిత వినియోగానికి ఉన్న అవకాశాలను కూడా మూసివేస్తుందన్నారు. లెక్కల్లో చూపని ఆదాయాన్ని ప్రజలు పర్యాటక సందర్శనలు, కార్లు, వాచీలు, ఆభరణాల వంటి సంపన్న వస్తువులు కొనుగోలుపై వెచ్చిస్తుంటారని, కొత్త నిబంధనల కింద ఇటువంటి మార్గాలకు చెక్ పెట్టనున్నట్టు పేర్కొన్నారు. రూ.2 లక్షలకు పైబడి నగదు లావాదేవీకి పాన్ నంబర్ పేర్కొనాలన్న పాత నిబంధన ఇకపైనా కొనసాగుతుందన్నారు. -
మూడు లక్షలు దాటితే...అంతేనట!
న్యూఢిల్లీ: నల్లధనానికి చెక్ పెట్టే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిఫార్సులకనుగుణంగా నగదు లావాదేవీలపై పరిమితిని విధించనుంది. ఆర్ధిక వ్యవస్థలో నల్లధనం చలామణిని నిరోధించే లక్ష్యంతో రూ. 3 లక్షలు దాటిన నగదు లావాదేవీలను బ్యాన్ చేయనుంది. ముఖ్యంగా బంగారం ఆభరణాలు తదితర క్యాష్ ఆధారిత ట్రాన్సాక్షన్స్ పై కొరడా ఝుళిపించనుంది. నగదు ఒప్పందాలు, నగలు లేదా కార్లను కొనుగోలు ద్వారా జరిగే లెక్కల్లోకి రాని భారీ లావాదేవీలు త్రవ్వితీయనుంది. ఈ సందర్భంగా కొంత పరిమితి మేరకే లావాదేవీలను అనుమతిస్తున్న ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాలను సిట్ ఉదహరించింది. రూ .3 లక్షల పరిమితిని మించిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, చెక్కుల లావాదేవీలను సులభంగా ట్రాక్ చెయ్యవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సిట్ సిఫారసు చేసిన రూజ15 లక్షలకు పైన కాష్ నిల్వలను నిషేధించే అంశంపై కూడా తీవ్రంగా ఆలోచిస్తోందని సమాచారం. అయితే వాణిజ్య మరియు ఇతన పరిశ్రమల వ్యతిరేకత రూ .15 లక్షల నగదు హోల్డింగ్స్ నిషేధం ప్రతిపాదనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ చర్యతో పన్ను అధికారుల వేధింపులు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పాయి. కార్మిక వేతనాలు చెల్లింపుల కోసం నగదునిల్వలను ఉంచుకున్నట్టు చాలా కంపెనీలు వాదించేవి. అయితే రెండేళ్ల క్రితం లాంచ్ చేసిన ప్రధానమంత్రి ధనయోజన పథకం కింద అందుబాటులోకి వచ్చిన సులభ బ్యాంక ఖాతాల విధానంతో ఈ వాదన బలహీనపడింది. కాగా నగదు రహిత లావాదేవీలపై దృష్టిపెట్టిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రభుత్వసేవలపై డెబిట్, క్రెడిట్, చార్జీలను రద్దు చేసింది. ప్రభుత్వం ఇప్పటికే ఆస్తుల లావాదేవీల్లో రూ .20,000 కు పైన క్యాష్ అడ్వాన్స్ లపై నిషేధం సహా పలు చర్యలకు ఉపక్రమించింది. బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించే సమయంలో ఇదే విధమైన పరిమితిని విధించిన సంగతి తెలిసిందే. -
యాసిడ్ దాడి బాధితులకు రూ.3 లక్షలు
హైదరాబాద్: యాసిడ్ దాడి బాధితులకు రూ.3 లక్షలు.. అత్యాచార బాధితులకు రూ.2 లక్షలు.. నేర ఘటనల్లో ప్రాణ నష్టానికి లక్ష నుంచి రూ.3 లక్షల నుంచి వరకు పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. వివిధ రకాల నేర ఘటనలకు గురైన బాధితులు, పీడితులకు ఈ మేరకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం తెలంగాణ బాధితుల పరిహార పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి ఎ.సంతోష్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటిస్తూ శనివారం ఉత్తర్వులు (జీవో నెం.9) జారీ చేశారు. సీఆర్పీసీలోని 357ఏ సెక్షన్లో సవరణ ద్వారా 2008లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం.. నేర ఘటనల బాధితులకు పరిహారం చెల్లించేందుకు అన్ని రాష్ట్రాలు ఓ పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. దీని అమలు కోసం పరిహార నిధిని ఏర్పాటు చేసి ఏటా బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ సభ్య కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ నిధి నిర్వహణ జరగనుంది. జిల్లా న్యాయ సేవా సంస్థ దరఖాస్తులను పరిశీలించి గరిష్ట పరిమితికి లోబడి బాధితులకు చెల్లించాల్సిన పరిహారం మొత్తాన్ని రెండు నెలల్లో నిర్ణయించనుంది. జిల్లా కలెక్టర్లు బాధితుల ఖాతాలో పరిహారాన్ని జమ చేస్తారు. తప్పుడు కారణాలతో పరిహారం పొందితే 12 శాతం వడ్డీతో తిరిగి వసూలు చేస్తారు. పథకం వర్తింపు ఇలా.. నేరం తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే జరిగి ఉండాలి. నేరం జరిగిన 48 గంటల్లోపు బాధితులు/సంబంధికులు సంబంధిత పోలీసు స్టేషన్/ సీనియర్ పోలీసు అధికారి/ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్/ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదులో జాప్యం జరిగితే అందుకు గల కారణాలను చూపాలి. ఏడాదికి రూ.4.5 లక్షల లోపు ఆదాయం గల కుటుంబాలకే పథకం వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, బోర్డులు, కార్పొరేషన్లు, ప్రభుత్వరంగ సంస్థలు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు. నేరం జరిగిన 12 నెలల తర్వాత పరిహారం కోరడానికి ఆస్కారం ఉండదు. యాసిడ్ దాడి బాధితులకు చెల్లించే రూ.3 లక్షల పరిహారంలో రూ.లక్షను కేసు నమోదైన 15 రోజుల్లో, మిగిలిన రూ. 2లక్షలను ఆ తర్వాత రెండు నెలల్లో చెల్లిస్తారు.