మూడు లక్షలు దాటితే...అంతేనట!
న్యూఢిల్లీ: నల్లధనానికి చెక్ పెట్టే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిఫార్సులకనుగుణంగా నగదు లావాదేవీలపై పరిమితిని విధించనుంది. ఆర్ధిక వ్యవస్థలో నల్లధనం చలామణిని నిరోధించే లక్ష్యంతో రూ. 3 లక్షలు దాటిన నగదు లావాదేవీలను బ్యాన్ చేయనుంది. ముఖ్యంగా బంగారం ఆభరణాలు తదితర క్యాష్ ఆధారిత ట్రాన్సాక్షన్స్ పై కొరడా ఝుళిపించనుంది. నగదు ఒప్పందాలు, నగలు లేదా కార్లను కొనుగోలు ద్వారా జరిగే లెక్కల్లోకి రాని భారీ లావాదేవీలు త్రవ్వితీయనుంది. ఈ సందర్భంగా కొంత పరిమితి మేరకే లావాదేవీలను అనుమతిస్తున్న ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాలను సిట్ ఉదహరించింది. రూ .3 లక్షల పరిమితిని మించిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, చెక్కుల లావాదేవీలను సులభంగా ట్రాక్ చెయ్యవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే సిట్ సిఫారసు చేసిన రూజ15 లక్షలకు పైన కాష్ నిల్వలను నిషేధించే అంశంపై కూడా తీవ్రంగా ఆలోచిస్తోందని సమాచారం. అయితే వాణిజ్య మరియు ఇతన పరిశ్రమల వ్యతిరేకత రూ .15 లక్షల నగదు హోల్డింగ్స్ నిషేధం ప్రతిపాదనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ చర్యతో పన్ను అధికారుల వేధింపులు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పాయి. కార్మిక వేతనాలు చెల్లింపుల కోసం నగదునిల్వలను ఉంచుకున్నట్టు చాలా కంపెనీలు వాదించేవి. అయితే రెండేళ్ల క్రితం లాంచ్ చేసిన ప్రధానమంత్రి ధనయోజన పథకం కింద అందుబాటులోకి వచ్చిన సులభ బ్యాంక ఖాతాల విధానంతో ఈ వాదన బలహీనపడింది.
కాగా నగదు రహిత లావాదేవీలపై దృష్టిపెట్టిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రభుత్వసేవలపై డెబిట్, క్రెడిట్, చార్జీలను రద్దు చేసింది. ప్రభుత్వం ఇప్పటికే ఆస్తుల లావాదేవీల్లో రూ .20,000 కు పైన క్యాష్ అడ్వాన్స్ లపై నిషేధం సహా పలు చర్యలకు ఉపక్రమించింది. బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించే సమయంలో ఇదే విధమైన పరిమితిని విధించిన సంగతి తెలిసిందే.