కటక్ : బలవంతపు వసూళ్లు, మాదక ద్రవ్యాల రవాణా ద్వారా మావోయిస్టులు సంపాదించిన నల్లధనాన్ని పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వెల్లడించింది. మావోయిస్టు నేతలు సమకూర్చుకున్న అక్రమ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సిట్ ఉపాధ్యక్షుడు జస్టిస్(రిటైర్డు) అరిజిత్ పసాయత్ తెలిపారు. ‘మావోయిస్టులు భారీగా నల్లధనాన్ని కూడబెట్టినట్లు మొదటిసారిగా సిట్ గుర్తించింది. మావోయిస్టు నేతలు సొంతఆస్తులు కూడబెట్టుకునేందుకు ఈ డబ్బును దారి మళ్లించినట్లు కూడా గుర్తించాం. ఇది కొత్త కోణం’ అని తెలిపారు.
శనివారం కటక్‌లో ఒడిశా పోలీసు ఉన్నతాధికారులు, డిపార్టుమెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్‌ఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సెబి, ఆదాయ పన్ను శాఖ, సెంట్రల్ ఎకనామిక్ ఇంటలిజెన్స్ బ్యూరోల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డీఆర్‌ఐ, ఈడీ దాడుల్లో ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి కోల్‌కతా, లక్నో, న్యూఢిల్లీకి మావోయిస్టులు సరఫరా చేస్తున్న కోట్లాది రూపాయల విలువైన మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. అక్రమ సొమ్మును మావోయిస్టు కార్యకలాపాల విస్తరణకు వినియోగించినట్లు వెల్లడయింది. మావోయిస్టుల నల్లధనంపై దర్యాప్తు చేస్తున్న వివిధ సంస్థలు విచారణ పురోగతి వివరాలు తమకు వెల్లడించాయి’ అని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment