హైదరాబాద్: యాసిడ్ దాడి బాధితులకు రూ.3 లక్షలు.. అత్యాచార బాధితులకు రూ.2 లక్షలు.. నేర ఘటనల్లో ప్రాణ నష్టానికి లక్ష నుంచి రూ.3 లక్షల నుంచి వరకు పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. వివిధ రకాల నేర ఘటనలకు గురైన బాధితులు, పీడితులకు ఈ మేరకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం తెలంగాణ బాధితుల పరిహార పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి ఎ.సంతోష్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటిస్తూ శనివారం ఉత్తర్వులు (జీవో నెం.9) జారీ చేశారు. సీఆర్‌పీసీలోని 357ఏ సెక్షన్‌లో సవరణ ద్వారా 2008లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం.. నేర ఘటనల బాధితులకు పరిహారం చెల్లించేందుకు అన్ని రాష్ట్రాలు ఓ పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగా ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. దీని అమలు కోసం పరిహార నిధిని ఏర్పాటు చేసి ఏటా బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ సభ్య కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ నిధి నిర్వహణ జరగనుంది. జిల్లా న్యాయ సేవా సంస్థ దరఖాస్తులను పరిశీలించి గరిష్ట పరిమితికి లోబడి బాధితులకు చెల్లించాల్సిన పరిహారం మొత్తాన్ని రెండు నెలల్లో నిర్ణయించనుంది. జిల్లా కలెక్టర్లు బాధితుల ఖాతాలో పరిహారాన్ని జమ చేస్తారు. తప్పుడు కారణాలతో పరిహారం పొందితే 12 శాతం వడ్డీతో తిరిగి వసూలు చేస్తారు.
పథకం వర్తింపు ఇలా..
- నేరం తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే జరిగి ఉండాలి.
- నేరం జరిగిన 48 గంటల్లోపు బాధితులు/సంబంధికులు సంబంధిత పోలీసు స్టేషన్/ సీనియర్ పోలీసు అధికారి/ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్/ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదులో జాప్యం జరిగితే అందుకు గల కారణాలను చూపాలి.
- ఏడాదికి రూ.4.5 లక్షల లోపు ఆదాయం గల కుటుంబాలకే పథకం వర్తిస్తుంది.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, బోర్డులు, కార్పొరేషన్లు, ప్రభుత్వరంగ సంస్థలు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు.
- నేరం జరిగిన 12 నెలల తర్వాత పరిహారం కోరడానికి ఆస్కారం ఉండదు.
- యాసిడ్ దాడి బాధితులకు చెల్లించే రూ.3 లక్షల పరిహారంలో రూ.లక్షను కేసు నమోదైన 15 రోజుల్లో, మిగిలిన రూ. 2లక్షలను ఆ తర్వాత రెండు నెలల్లో చెల్లిస్తారు.