బైక్‌ షి‘కారు’కు గెట్‌ రెడీ! | GST rates: Car and bike makers announce price cuts of up to Rs3 lakh | Sakshi
Sakshi News home page

బైక్‌ షి‘కారు’కు గెట్‌ రెడీ!

Published Tue, Jul 4 2017 12:19 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

బైక్‌ షి‘కారు’కు గెట్‌ రెడీ! - Sakshi

బైక్‌ షి‘కారు’కు గెట్‌ రెడీ!

జీఎస్‌టీతో రేట్లు తగ్గిన కార్లు, టూవీలర్లు
350 సీసీ దాటిన బైకుల ధర పెరుగుదల

కొన్ని డీజిల్‌ కార్లపై స్వల్పంగా మోత
టీవీ, ఫ్రిజ్, వాషింగ్‌ మెషిన్‌ కాస్త ప్రియమే
1 నుంచి 3 శాతం వరకూ పెరగనున్న ధరలు
కొన్ని రాష్ట్రాల్లో మొబైల్స్‌ ఇకపై చౌక
దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం కొంత భారమే
జీఎస్‌టీ ప్రాతిపదికనే ఈ హెచ్చుతగ్గులు
ముడిసరుకుపై పన్నుల్ని ఇంకా లెక్కించని కంపెనీలు
అసలు ధర తెలిసేది ఆ తర్వాతే...
అందుకు కొన్నాళ్లు ఆగాలంటున్న పరిశ్రమ వర్గాలు  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో
కొత్తగా వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చి మూడు రోజుగులు గడిచిపోయింది. జూలై 1, 2 తారీఖులు వారాంతాలనుకున్నా... 3వ తేదీ సోమవారం కావటంతో దాదాపు అన్ని కంపెనీలు జీఎస్‌టీ ఆధారంగానే అమ్మకాలు జరిపాయి. మరి జనానికి ఒరిగిందేంటి? నిత్యావసర సరుకుల్ని మినహాయిస్తే మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు, ద్విచక్ర వాహనాలు, కార్ల విషయంలో పెద్దగా పెరుగుదల ఏమీ లేదు. నిజం చెప్పాలంటే కార్ల విషయంలో ఏ రకంగా చూసినా రేట్ల తగ్గుదలే కనిపిస్తోంది. చిన్నకార్లు రూ.3వేల నుంచి 10వేల వరకూ తగ్గగా... మధ్య స్థాయి కార్లు గరిష్ఠంగా రూ.1.3 లక్షల వరకూ తగ్గాయి. లగ్జరీ కార్ల విషయానికొస్తే ఈ తగ్గుదల ఇంకా ఎక్కువే.  టూ వీలర్లదీ ఇదే బాట. 350 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న స్పోర్ట్స్‌ బైక్‌ల మినహా మిగిలిన టూ వీలర్లన్నీ కనిష్ఠంగా రూ.2 వేల నుంచి గరిష్ఠంగా రూ.5 వేల వరకూ తగ్గాయి.

మనకైతే మొబైల్స్‌ది పెరుగుదలే!
మొబైల్‌ ఫోన్లది కూడా తగ్గుదల బాటే. ఎందుకంటే దేశంలో అమ్ముడవుతున్న ఫోన్లలో మెజారిటీ దిగుమతి చేసుకునేవే. వీటిపై దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 12 శాతం నుంచి ఇపుడు 10 శాతానికి తగ్గించారు. ఇక జీఎస్‌టీ కూడా పాత పన్నుల కన్నా 1 నుంచి 7 శాతం వరకూ తగ్గినట్లే. అంటే కొన్ని రాష్ట్రాల్లో 5 శాతం తగ్గితే... మరికొన్ని రాష్ట్రాల్లో 4 శాతం వరకూ పెరిగినట్లు లెక్క. ఎందుకంటే మొబైల్‌ ఫోన్లపై జీఎస్‌టీ 12 శాతంగా ఉండగా ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్, ఇతర పన్నులు కలిపి 16 శాతం వరకూ ఉన్నాయి. అంటే ఇలాంటి వారికి జీఎస్‌టీతో లాభమే. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం మొబైల్స్‌పై వ్యాట్‌ 5 శాతమే. ఇలాంటి చోట 12 శాతం జీఎస్‌టీ పడుతుంది కనక మొబైల్స్‌ ధరలు పెరుగుతాయనే చెప్పాలి.

టీవీ, ఫ్రిజ్‌లూ స్వల్ప పెరుగుదల!
గృహోపకరణాల విషయానికొస్తే టెలివిజన్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్ల వంటి గృహోపకరణాల ధరలు కూడా 1 నుంచి 3 శాతం వరకూ పెరుగుతాయనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా వీటిపై అన్ని పన్నులూ కలిపి 25 నుంచి 27 శాతం వరకూ ఉన్నాయి. జీఎస్‌టీతో ఇవన్నీ 28 శాతం పన్ను జాబితాలో పడ్డాయి. దీంతో ప్రస్తుతానికి స్వల్ప పెరుగుదలే కనిపిస్తోంది. ల్యాప్‌టాప్‌ వంటి కంప్యూటర్ల విషయంలో కూడా పన్నుల పరంగా 1 శాతం వరకూ పెరుగుదల ఉండటంతో రూ.300 వరకూ స్వల్ప పెరుగుదల కనిపించింది.

అసలు ధరలు కొన్నాళ్ల తరవాతే?
నిజానికి జీఎస్‌టీ అమల్లోకి వచ్చి 3 రోజులే అయింది. కంపెనీలు, డీలర్లు ధరలు తగ్గిస్తున్నా... అవన్నీ జీఎస్‌టీ రేటును బట్టే నిర్ణయమవుతున్నాయి. నిజానికి రేటును ప్రభావితం చేసేది అమ్మకంపై విధిస్తున్న జీఎస్‌టీ ఒక్కటే కాదు. ముడి సరుకులపై విధిస్తున్న పన్నులు కూడా రేట్లను ప్రభావితం చేస్తాయి. కార్లు, టూవీలర్లు, గృహోపకరణాల ముడి సరుకులపై ప్రస్తుతం ఉన్న పన్నుల రేట్లు కూడా జీఎస్‌టీతో మారాయి. కాకపోతే కంపెనీలు ఇంకా ఆ రేట్లతో ముడి సరుకుల్ని కొనటం, వాటితో సరుకులు తయారు చెయ్యటం మొదలుపెట్టలేదనే చెప్పాలి. అంటే అవి ప్రస్తుతం ఉన్న సరుకును క్లియర్‌ చేస్తున్నాయి. కొత్త ముడి సరుకు కొని, తయారీ చేపడితే... తద్వారా తమకు మిగులుతోందా? తగులుతోందా? అనేది కంపెనీలకు తెలిసిపోతుంది.

ఒకవేళ ముడిసరుకుపై పన్ను తగ్గితే... ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ రూపంలో కొంత మిగులుతుంది. అలా మిగిలితే దాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలి కూడా. లేనిపక్షంలో జీఎస్‌టీలో పొందుపరిచిన యాంటీ ప్రాఫిటీరింగ్‌ నిబంధన వారిని శిక్షార్హుల్ని చేస్తుంది. కాబట్టి అవన్నీ కొత్త ధరలను ప్రకటించి తీరాలి. అప్పుడే జీఎస్‌టీ ప్రభావంతో ఈ వస్తువుల ధరలు నిజంగా తగ్గాయో లేదో, తగ్గితే ఎంత తగ్గాయో తెలుస్తుంది. ప్రస్తుతం జీఎస్‌టీ అమలు ఆధారంగానే పలు కంపెనీలు రేట్లను సవరించినట్లు ఆరెంజ్‌ హోండా ఎండీ రామ్‌ తెలిపారు. ‘‘మారుతి సుజుకి కార్ల ధరలు రూ.6,000 నుంచి రూ.18,000 వరకు తగ్గాయి’’ అని వరుణ్‌ గ్రూప్‌ ఎండీ వరుణ్‌దేవ్‌ తనను సంప్రదించిన ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. కొన్ని డీజిల్‌ వేరియంట్లు మాత్రం రూ.6–18 వేలు పెరిగాయన్నారు. లగ్జరీ కార్ల కంపెనీలు రూ.1.25 నుంచి రూ.7 లక్షల దాకా ధరల్ని తగ్గించాయి. బజాజ్‌ బైక్‌ల ధరలు రూ.2,500 వరకు తగ్గాయని శ్రీవినాయక బజాజ్‌ సీఎండీ కె.వి.బాబుల్‌ రెడ్డి తెలిపారు. కేటీఎం బైక్‌లు రూ.6,500 దాకా తగ్గినట్టు వెల్లడించారు.

పలు కంపెనీల తాజా తగ్గింపులివీ...
హోండా కార్ల ధరలు గరిష్ఠంగా రూ.1.31 లక్షల వరకూ తగ్గాయి. హ్యాచ్‌బ్యాక్‌ కారు బ్రియో ధరను రూ.12,279 వరకు, కాంపాక్ట్‌ సెడాన్‌ కారు అమేజ్‌ ధరను రూ.14,825 వరకు, జాజ్‌ మోడల్‌ ధరను రూ.10,031 వరకు తగ్గించింది. ఇటీవలే మార్కెట్‌లోకి తీసుకువచ్చిన డబ్ల్యూఆర్‌–వీ మోడల్‌ ధరలో రూ.10,064 వరకు, మిడ్‌సైజ్‌ సెడాన్‌ సిటీ కారు ధరను రూ.16,510–రూ.28,005 శ్రేణిలో, బీఆర్‌–వీ ధరలో రూ.30,387 వరకు, ప్రీమియం ఎస్‌యూవీ సీఆర్‌–వీ ధరలో రూ.1,31,663 వరకు కోత విధించింది. ఇవన్నీ ఢిల్లీ (ఎక్స్‌షోరూమ్‌)వి. ప్రాంతాన్ని బట్టి తగ్గింపు మారుతుంది.
ఫోర్డ్‌ ఇండియా కూడా తన వాహన ధరలను 4.5 శాతం వరకు తగ్గించింది. దీంతో ముంబైలో ఎస్‌యూవీ ఎండీవర్‌ ధర రూ.3 లక్షల వరకు తగ్గనుంది. మొత్తంగా ధరల తగ్గింపు రూ.28,000– రూ.3 లక్షల శ్రేణిలో ఉంటుంది. ఫిగో ధర రూ.2,000, కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్‌ ధర రూ.8,000 వరకు తగ్గాయి.
టూవీలర్‌ సంస్థలు టీవీఎస్‌ మోటార్, హోండా స్కూటర్స్, సుజుకీ కూడా ధరల తగ్గింపును ప్రకటించాయి. టీవీఎస్‌ తన వాహన ధరలను రూ.4,150 వరకు తగ్గించింది. హెచ్‌ఎంఎస్‌ఐ తన ప్రొడక్టుల ధరల్లో రూ.5,500 వరకు కోత విధించింది. సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా, యమహా కంపెనీలు కూడా వాటి వాహన ధరలను తగ్గించాయి. హీరో మోటొకార్ప్‌ తన వాహన ధరలను రూ.1,800 వరకు తగ్గించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement