![GST slabs rates list: GST Rates in India - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/2/Untitled-8.jpg.webp?itok=VygzfTjJ)
హమ్మయ్య! జీఎస్‌టీ తగ్గింది. నిర్మాణంలో ఉన్న గృహాల మీద 12 శాతం నుంచి 5 శాతానికి, అందుబాటు గృహాల మీద 8 శాతం నుంచి 1 శాతానికి! బావుందని సంబరపడిపోకండి.. తగ్గిన జీఎస్‌టీ శ్లాబును కాస్త లోతుగా విశ్లేషిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఐటీసీ లేకుండా జీఎస్‌టీ తగ్గింపుతో పెద్దగా ప్రయోజనం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే తాజా జీఎస్‌టీలో పన్ను రేటు తగ్గలేదు.. ఐటీసీ ఎంతొస్తుందనే అంశం మీద డెవలపర్లకు, కస్టమర్లకు మధ్య సందిగ్ధత తొలగిందంతే!
సాక్షి, హైదరాబాద్: జీఎస్‌టీ తగ్గింపు కస్టమర్లకు లాభమా? నష్టమా? అంటే నష్టమే అని చెప్పాలి. పాత, కొత్త రెండు జీఎస్‌టీ శ్లాబుల్లోనూ ప్రభుత్వానికొచ్చే పన్ను ఆదాయంలో ఎలాంటి మార్పు లేదు. ‘‘కేంద్రం ఐటీసీని నికరంగా 7 శాతంగా గణించింది. ఈ లెక్కన పాత జీఎస్‌టీలో 7 శాతం ఐటీసీ, 8 శాతం జీఎస్‌టీ.. రెండు కలిపి 12 శాతంగా ఉండేది. తాజా జీఎస్‌టీలో 7 శాతం ఐటీసీని ఇవ్వకుండా 1 శాతం జీఎస్‌టీ కేటాయించింది. తన్ని పడేసినా.. పడేసి తన్నినా తగిలే దెబ్బ కొనుగోలుదారునికే! గత జీఎస్‌టీలో కస్టమర్లకు ఐటీసీ 7–8 శాతం వరకొచ్చేది. 12 శాతం జీఎస్‌టీలో మిగిలిన 4–5 శాతం జీఎస్‌టీ కట్టేవాళ్లు. కానీ, ఇప్పుడు ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. అంటే గతంతో పోలిస్తే 1–2 శాతం జీఎస్‌టీ పెరిగినట్టేగా!
చ.అ.కు రూ.300–500 పెంపు..
12 శాతం జీఎస్‌టీ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో చాలా మంది డెవలపర్లు ఏం చేసేవారంటే.. కస్టమర్ల నుంచి 12 శాతం జీఎస్‌టీకి బదులు 8 శాతం వసూలు చేసేవాళ్లు. ఐటీసీని బదలాయించేవాళ్లు కాదు! ఒక్కోసారి డెవలపర్లకు ఐటీసీ 7–9 శాతం వరకూ వచ్చేది. దీంతో నిర్మాణ వ్యయం, తిరిగొచ్చిన ఐటీసీ అక్కడికక్కడే సరిపోయేది. కానీ, ఇప్పుడు కేంద్రం ఐటీసీని ఎత్తేసింది. అంటే డెవలపర్లకు నిర్మాణ సామగ్రి మీద వెచ్చించే ఐటీసీ తిరిగి రాదన్నమాట. హైదరాబాద్‌లో డెవలపర్లకు 15–20 శాతం వరకు మార్జిన్లుంటాయి. ఏప్రిల్ 1 తర్వాతి నుంచి ఐటీసీ రాదు కాబట్టి మార్జిన్లు 5–10 శాతం వరకు తగ్గే అవకాశముంది. ఈ నష్టాన్ని డెవలపర్లు కొనుగోలుదారుల నుంచి వసూలు చేస్తారు. అంటే ప్రాపర్టీ ధరలను పెంచుతారన్నమాట. దీర్ఘకాలంలో ధరలు చ.అ.కు రూ.300–500 వరకూ పెరిగే అవకాశముంది.
ఐటీసీ లేకపోతే వ్యయం పెరుగుతుంది..
కొత్త జీఎస్‌టీ వల్ల స్థలాల ధరలు ఎక్కువ ఉన్న చోట లాభదాయకమని, తక్కువగా ఉన్న చోట పెద్దగా ప్రయోజనం ఉండదని క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. అర్బన్, నాన్–అర్బన్ ఎక్కడైనా సరే నిర్మాణ వ్యయం ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. మెట్రో నగరాల్లో ప్రాజెక్ట్ వ్యయంలో 1/3 వంతు వ్యయం స్థలం మీదనే పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి చోట ఐటీసీ లేకపోవటం అనేది డెవలపర్లకు భారమే. ఇదిలా ఉంటే 1 శాతం జీఎస్‌టీ ఉన్న అందుబాటు గృహాలు కొందామంటే.. 60 చ.మీ., రూ.45 లక్షల లోపు గృహాలు మెట్రో నగరాల్లో దొరకడం కష్టమే. కొత్త జీఎస్‌టీలోనూ కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఏంటంటే.. ఒక ప్రాజెక్ట్‌లో 50 ఫ్లాట్లు ఉన్నాయనుకుందాం. గతంలో 25 ఫ్లాట్లను విక్రయించిన డెవలపర్.. ఏప్రిల్ 1 తర్వాతి నుంచి విక్రయించే మిగిలిన ఫ్లాట్లకు ఐటీసీ తీసుకోవాలా? వద్దా? మరి, గతంలో విక్రయించిన ఫ్లాట్లకు ఐటీసీ తిరిగి వస్తుందా? రాదా?!
తగ్గించాల్సింది నిర్మాణ సామగ్రి మీద
సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి మీద జీఎస్‌టీని తగ్గించకుండా ప్రాపర్టీలపై జీఎస్‌టీని తగ్గించి లాభం లేదని టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్మాణ వ్యయంలో అత్యంత కీలకమైన సిమెంట్, స్టీల్ వంటి ఉత్పత్తుల మీద జీఎస్‌టీ భారం తగ్గించకుండా ప్రాపర్టీల మీద జీఎస్‌టీ తగ్గించడం.. అది కూడా ఐటీసీ లేకుండా సరైంది కాదని తెలిపారు. ప్రస్తుతం సిమెంట్ మీద 28 శాతం, స్టీల్, టైల్స్, రంగులు, సీపీ ఫిట్టింగ్స్, ఎలక్ట్రిక్ వంటి ఉత్పత్తుల మీద 18 శాతం, ఇటుకల మీద 5 శాతం, ఇసుక, మెటల్స్ మీద 8 శాతం జీఎస్‌టీ ఉంది. ఇక, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, వర్క్ కాంట్రాక్టర్స్ వంటి నిర్మాణ సంబంధమైన సేవల మీద 18 శాతం జీఎస్‌టీ ఉంది. నిర్మాణ ఉత్పత్తులు, సేవలు అన్నింటినీ 5– 8 శాతం జీఎస్‌టీలోకి తీసుకురావాలి.
భవిష్యత్తులో జనప్రియ గృహాలే!
ముందునుంచి కూడా కేంద్రం అందుబాటు గృహాల మీద ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ విభాగానికి 1 శాతం జీఎస్‌టీతో పాటూ క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్‌ఎస్‌ఎస్) కింద రూ.2.5 లక్షల వరకూ వడ్డీ రాయితీ, పరిశ్రమ హోదాతో చౌక వడ్డీ రేట్లకు గృహ రుణాలు వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. పైగా అఫడబుల్ హౌజింగ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే భవిష్యత్తులో జనప్రియమైన అందుబాటు గృహాల నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ఆధునిక వసతులు, సౌకర్యాలు, లగ్జరీ ఏర్పాట్ల మీద దృష్టిపెట్టిన డెవలపర్లు మళ్లీ పాత బాట పడతారని ఏవీ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ వెంకట్ రెడ్డి తెలిపారు. దశాబ్ధం క్రితం హైదరాబాద్‌లో నిర్మించిన 1000 లోపు చ.అ. ఫ్లాట్లు మళ్లీ దర్శనమిస్తాయని పేర్కొన్నారు. శివారు ప్రాంతాలు, అభివృద్ధికి ఆస్కారముండే ప్రాంతాల్లో అందుబాటు గృహాలను నిర్మిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment