రిలయన్స్ జియో (ఫైల్ ఫోటో)
బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో రిలయన్స్ జియో హ్యాపీ అవర్స్ ప్రారంభం కాబోతున్నాయి. ముఖేష్ అంబానీ తర్వాత హిట్‌లిస్ట్‌గా కేబుల్ ఆపరేటర్స్ ఛార్జ్ చేసే దానికంటే సగం తక్కువగా ఇంటర్నెట్ ఆధారిత టెలివిజన్ ప్రొగ్రామింగ్ సర్వీసులను(జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను) ఆఫర్ చేసేందుకు జియో సన్నద్ధమైంది. వీటి ప్రారంభ ధర 500 రూపాయలుగా కంపెనీ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. జియోగిగాఫైబర్‌ను దివాళి కంటే ముందస్తుగానే కమర్షియల్‌గా ఆవిష్కరించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ సర్వీసుల అందుబాటు ఆగస్టు 15 నుంచే ప్రారంభమయ్యే వినియోగదారుల రిజిస్ట్రేషన్లను బట్టి ఉంటుంది. ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ రిజిస్ట్రేషన్లు నమోదు అవుతాయో, అక్కడ తొలుత ఈ సర్వీసులను అందజేయనున్నారు. ఇలా దివాళి కల్లా కమర్షియల్‌గా ఆవిష్కరించడం పూర్తయి పోవాలని కంపెనీ చూస్తోంది.
తొలుత మెట్రోల్లో, ఆ అనంతరం 80 టాప్ టైర్ 1, టైర్ 2 మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్స్‌ను కేబుల్ ఆపరేటర్స్ ఆఫర్ చేస్తున్నరు. నెలకు 700 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో 100 జీబీ డేటాను, 100 ఎంబీపీఎస్ స్పీడులో అందజేస్తున్నారు. అదనంగా టీవీ సర్వీసులకు ఒక్కో ఇంటికి 250 రూపాయల నుంచి 300 రూపాయలు తీసుకుంటున్నారు. జియో కూడా అదేరకమైన ఆఫర్‌ను అంటే 100జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడులో వాటికంటే 50 శాతం తక్కువ ధరకే అందజేయబోతుంది.
కంపెనీ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల ధరలు ప్రస్తుతమున్న 4జీ మొబైల్ డేటా రేట్లకు 25 శాతం నుంచి 30 శాతం డిస్కౌంట్‌లో లభించనున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అంటే ఒక్క జీబీ డేటా కేవలం రూ.2.7 నుంచి రూ.5కే లభ్యం కానుందని హెచ్‌ఎస్‌బీసీ డైరెక్టర్, టెలికాం విశ్లేషకులు రాజీవ్ శర్మ చెప్పారు. టీవీ సర్వీసులతో వస్తున్న జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు, తన సొంత 4జీ మొబైల్ డేటా వ్యాపారాలను దెబ్బకొట్టవని విశ్లేషకులు చెప్పారు. ఫైబర్ ఆధారిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల వీడియో స్ట్రీమింగ్ నాణ్యత, 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కంటే ఎక్కువ విశ్వసనీయతతో, స్థిరంగా ఉంటాయని ఫిలిప్‌క్యాపిటల్ టెలికాం విశ్లేషకుడు నవీన్ కులకర్ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment