JIO GigaFibre
-
2 రోజుల్లో రూ.29 వేల కోట్లు
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత, బిలియనీర్ ముకేశ్ అంబానీ సంపద అప్రతిహతంగా పెరుగుతోంది. ప్రధానంగా జియో ఫైబర్ ప్రకటన అనంతరం అంబానీ మునుపెన్నడూ లేనంతగా అమాంతం ఎగిసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఆధారంగా 49.9 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో 13వ స్థానంలో ఉన్న అంబానీ తాజాగా మరింత దూసుకుపోతున్నారు. ఆగస్టు 12 నాటి రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం రెండురోజుల్లోనే రూ.29వేల కోట్లు మేర పుంజుకున్నాయి. మార్కెట్ వ్యాల్యూ రూ.80 వేల కోట్లు పెరిగింది. 42వ రిలయన్స్ ఏజీఎంలో సౌదీ కంపెనీ ఆరామ్కోతో అతిపెద్ద ఎఫ్‌డిఐ డీల్‌ను ప్రకటించారు అంబానీ. 20శాతం వాటాలు ఆరామ్కోకు విక్రయిస్తున్నామనీ, తద్వారా రానున్న 18 నెలల్లో (మార్చి , 2021 నాటికి) రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణాలు లేని కంపెనీగా అవతరించనుందని ప్రకటించడం ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చింది. అలాగే అతి తక్కువ ధరలు, బంపర్ ఆఫర్లతో గిగా ఫైబర్‌ను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు మూడీస్, మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు రిలయన్స్‌కు అప్‌గ్రేడ్ రేటింగ్‌ను ఇచ్చాయి. దీంతో మంగళ, బుధవారాలు రిలయన్స్ షేర్లు దలాల్ స్ట్రీట్‌లో మెరుపులు మెరిపించాయి. బుధవారం మార్కెట్లు క్లోజ్ అయ్యే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రూ.1,288.30వద్ద ఉండగా, శుక్రవారం రూ.1,279 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆగస్ట్ 12వ తేదీ ప్రకటన తరువాత రిలయన్స్ షేర్లు 11 శాతం పెరిగాయి. అదే విధంగా అంబానీ ఆస్తులు 4 బిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 28,684 కోట్లు పెరిగింది. వార్షిక ప్రాతిపదికన అంబానీ సంపద 6 శాతం పెరగ్గా, రిలయన్స్ షేర్లు 15 శాతం ఎగిసాయి. -
రిలయన్స్ ఏజీఎం : బంపర్ ఆఫర్లు?!
రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 42వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) ఈ రోజు (సోమవారం) నిర్వహించనుంది. ఉదయం 11:00 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశాన్ని రిలయన్స్ తన యూట్యూబ్, ట్విటర్, ఫేస్బుక్ ఖాతాలలో ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా ఎప్పటినుంచో కస్టమర్లు ఎదురు చూస్తున్న రిలయన్స్ బ్రాడ్‌బ్యాండ్ జియోగిగా ఫైబర్‌ను కమర్షియల్‌గా లాంచ్ చేయనుంది. గత ఏడాది ఏజీఎంలో కంపెనీ అధికారికంగా తన జియోగిగా ఫైబర్ సేవలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, రిలయన్స్ జియోఫోన్ 3 పేరుతో కొత్త ఫీచర్ ఫోన్‌ను కూడా లాంచ్ చేయనుంది. తాజా అంచనాల ప్రకారం బంపర్ ఆఫర్లతో జియో గిగా ఫైబర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా జియో గిగా ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో లభిస్తోంది. నెలకు రూ.600రుసుముపై ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్, టీవీ ప్రసార సేవలతో రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. 50ఎంబీపీఎస్ వేగంతో,100 జీబీ కాంప్లిమెంటరీ డేటాతో ట్రిపుల్ ప్లే ప్లాన్ లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. దీనితోపాటు రూ.1000 ప్లాన్లను తీసుకురానుందని అంచనా. దీని ద్వారా ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు, ఉచిత ల్యాండ్‌లైన్ లభించనుంది. ఈ ల్యాండ్‌లైన్ నుంచి దేశమంతా అపరిమిత ఉచిత కాల్స్ పొందవచ్చు. అంతే కాదు 4కే హెచ్ డీ సర్వీసుతో పాటు, జియో గిగా టీవీ సేవలు, వీడియో కాన్ఫరెన్స్ సేవలు లభించనున్నాయి. చదవండి : మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో -
అద్భుత ఫీచర్లతో జియో ఫోన్-3!
సాక్షి, ముంబై : టెలికం దిగ్గజం రిలయన్స్ జియో జియోగిగా ఫైబర్ సేవలను వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానుంది. సుదీర్ఘం కాలం పరీక్షల అనంతరం ఆగస్టు 12 న జరగబోయే కంపెనీ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా కమర్షియల్‌గా లాంచ్ చేయనుంది. ఈ సందర్భంగా జియో తన కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. జియో గిగా ఫైబర్‌తో పాటు జియోఫోన్ 2 కి కొనసాగింపుగా అప్‌గ్రేడ్ వెర్షన్‌తో జియో ఫీచర్ ఫోన్ 3 ని తీసుకురానుంది. జియోఫోన్ 2 కంటే ఆకర్షణీయ ఫీచర్లతో, దాదాపు అన్ని అంశాలలో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. జియో ఫోన్3 ఫీచర్ల పై అధికారిక సమాచారం వెల్లడి కానప్పటికీ మైస్మార్ట్‌ప్రైస్ నివేదిక ప్రకారం 4జీ టెక్నాలజీతో జియోఫోన్ 3 మీడియాటెక్ చిప్సెట్తో రానుంది. 5 అంగుళాల టచ్ స్క్రీన్‌తో, పవర్ఫుల్ సాఫ్ట్వేర్ సహాయంతో చాలా స్మార్ట్‌గా జియో ఫోన్ 3ని ఆవిష్కరించనుంది. 2జీబీ ర్యామ్, 64 స్టోరేజ్ సామర్ధ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రానుందట. ధర విషయానికి వస్తే రూ. 4500 అందించనుందని అంచనా. అంతేకాదు 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరచినట్టు తెలుస్తోంది. -
మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. టెలికాం చరిత్రలో జియో ఎంట్రీతోడేటా విప్లవానికి నాంది పలికిన సంస్థ ‘జియో గిగా ఫైబర్’ పేరుతో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ సేవల ఆవిష్కారానికి రంగం సిద్ధం చేసింది. హై-స్పీడ్ ఫైబర్-టు-హోమ్ (ఎఫ్టిటిహెచ్) జియో గిగా ఫైబర్ ఆగస్టు 12న కమర్షియల్‌గా లాంచ్ చేయనుందని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) సందర్భంగా అధికారికంగా ఈ సేవలను ప్రారంభించనుందని అంచనా. జియో గిగా ఫైబర్‌తో భారత దేశంలోని బ్రాండ్‌బాండ్‌తో పాటు డీటీహెచ్ టీవీ రంగంలో(బీటా ట్రయల్స్) ఇప్పటికే జియో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రత్యేక ఆఫర్లతో భారతదేశంలో1100 నగరాల్లో జియో గిగా ఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవలను సంస్థ ప్రారంభించినప్పటికీ కమర్షియల్‌గా ఇంకా లాంచ్ కాలేదు. ప్రధానంగా ఇటీవల డీటీహెచ్ బాదుడు షురూ అయిన నేపథ్యంలో జియో గిగా ఫైబర్ లాంచింగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది తీపి కబురే. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గత వారం ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో భారీ లాభాలను నమోదు చేసింది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ జియో గిగా ఫైబర్ సేవల బీటా ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. లాంచింగ్ వివరాలను స్పష్టంగా పేర్కొనక పోయినప్పటికీ, జియోగిగా ఫైబర్ సేవల బీటా ట్రయల్స్ చాలా విజయవంతమయ్యాయి, 50 మిలియన్లకు పైగా వినియోగదారులే లక్ష్యంగా త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తేనున్నామని ప్రకటించడం గమనార్హం. జియో గిగా ఫైబర్ మొదట సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జీగా రూ. 4,500గా ఉంది. అనంతరం ఇటీవల తన ఆప్టికల్ నెట్వర్క్ టెర్మినల్ (ఒఎన్‌టి) ద్వారా కేవలం రూ.2500 సెక్యూరిటీ డిపాజిట్‌తో బ్రాడ్‌బాండ్ సేవలు, వాయిస్ కాల్స్, ఓపీటీవీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అనంతరం 600 రూపాయల కాంబో ప్లాన్‌తోపాటు, గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, జియో హోమ్ టీవీ, జియోటీవీలను ఒకే నెలవారీ ప్యాకేజీ కిందకి తీసుకువచ్చేలా తన ఉద్యోగులతో ట్రిపుల్ ప్లే ప్లాన్‌ను పరీక్షిస్తోంది. జియో డేటా సేవల మాదిరిగానే ఇది కూడా సునామీ సృష్టించనుందా? ఎలాంటి టారిఫ్‌లను అమలు చేయనుంది, ఎలాంటి ప్లాన్లను తీసుకురానుందని అనేదానిపై పూర్తి స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. -
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సేవలు: ఆఫర్లు, ప్లాన్లు ఇవే!
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో గిగాఫైబర్ సేవలు ప్రజల్లోకి ఆవిష్కరిస్తున్న తరుణంలో, డీటీహెచ్ సర్వీసుల సంస్థ టాటా స్కై దానికి పోటీగా వచ్చేసింది. టాటా స్కై కూడా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులను దేశవ్యాప్తంగా ఉన్న 12 నగరాల్లో లాంచ్ చేసింది. న్యూఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, ముంబై, థానే, పుణే, అహ్మదాబాద్, మిరా భాయందర్, భోపాల్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఒక నెల, మూడు నెలలు, ఐదు నెలలు, తొమ్మిది నెలలు, 12 నెలల పాటు వాలిడిటీతో ఈ సేవలు మార్కెట్లోకి వచ్చాయి. ఒక నెల టారిఫ్ ప్లాన్ 999 రూపాయలతో ప్రారంభమైంది. దీని కింద 5ఎంబీపీఎస్ స్పీడులో అపరిమిత డేటాను అందించనుంది. 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్ డేటా స్పీడులో సబ్స్క్రైబర్లకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి యూజర్‌కు కేటాయించిన అలవెన్స్ పడిపోతే, స్పీడ్ 1ఎంబీపీఎస్‌కు పడిపోనుంది. టాటా స్కై ఒక నెల ప్లాన్.. ఒక నెల డేటా ప్లాన్ 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ స్పీడులో 999 రూపాయలుకు, 1150 రూపాయలకు, 1,500 రూపాయలకు, 1,800 రూపాయలకు, 2,500 రూపాయలకు అందుబాటులో ఉంది. అన్ని ప్లాన్లు అపరిమిత డేటాను ఆఫర్ చేయనున్నాయి. అయితే ఇన్స్టాలేషన్ ఫీజు కింద సబ్స్క్రైబర్లు 1200 రూపాయలను చెల్లించాల్సి ఉంది. దీనిపై సబ్స్క్రైబర్లకు ఉచితంగా వై-ఫై రూటర్ లభించనుంది. 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.999కు, రూ.1,250కు రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. టాటా స్కై మూడు నెలల ప్లాన్.. మూడు నెలల డేటా ప్లాన్ 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ స్పీడులో 2,997 రూపాయలుకు, 3,450 రూపాయలకు, 4,500 రూపాయలకు, 5,400 రూపాయలకు, 7,500 రూపాయలకు అందుబాటులో ఉంది. అన్ని ప్లాన్లు అపరిమిత డేటాను ఆఫర్ చేయనున్నాయి. అయితే ఇన్స్టాలేషన్ ఫీజు కింద సబ్స్క్రైబర్లు 1200 రూపాయలను చెల్లించాల్సి ఉంది. దీనిపై సబ్స్క్రైబర్లకు ఉచితంగా వై-ఫై రూటర్ లభించనుంది. 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.2,997కు, రూ.3,750కు రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. టాటా స్కై 12 నెలల ప్లాన్.. 12 నెలల డేటా ప్లాన్ 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ స్పీడులో 11,988 రూపాయలుకు, 13,800 రూపాయలకు, 18,000 రూపాయలకు, 21,600 రూపాయలకు, 30,000 రూపాయలకు అందుబాటులో ఉంది. అన్ని ప్లాన్లు అపరిమిత డేటాను ఆఫర్ చేయనున్నాయి. అయితే ఇన్స్టాలేషన్ ఫీజు కింద సబ్స్క్రైబర్లు 1200 రూపాయలను చెల్లించాల్సి ఉంది. దీనిపై సబ్స్క్రైబర్లకు ఉచితంగా వై-ఫై రూటర్ లభించనుంది. 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.11,988కు, రూ.15,000కు రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఐదు నెలలు, తొమ్మిది నెలల వాలిడిటీతో మరో రెండు ప్లాన్లు ఉన్నాయి. -
యూజర్లకు గుడ్‌న్యూస్ : జియోకు కౌంటర్
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోనూ రిలయన్స్ జియోకు కౌంటర్ ఇస్తోంది. రిలయన్స్ జియో తన గిగాఫైబర్ బ్యాండ్ సర్వీసులను దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్న క్రమంలో, భారతీ ఎయిర్టెల్ తన హోమ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై అపరిమిత డేటాను వాడుకోవచ్చని ఎయిర్టెల్ పేర్కొంది. దీని కోసం ఫేర్ యూసేజ్ పాలసీ డేటా పరిమితిని ఎయిర్టెల్ తొలగించేస్తున్నట్టు పేర్కొంది. 20కి పైగా కీలక మార్కెట్లలో ఎంపిక చేసిన నెలవారీ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లపై ఉన్న ఫేస్ యూసేజ్ పాలసీ డేటా పరిమితిని తొలగిస్తున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. దీంతో కస్టమర్లకు అపరిమిత డేటా లభించనుంది. ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్‌కు మాత్రమే అపరిమిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఎయిర్టెల్ ఆఫర్ చేసేది. దీన్ని ఇతర మేజర్ మార్కెట్లకు కూడా విస్తరిస్తోంది. దీంతో తనకున్న 2.4 మిలియన్ యాక్టివ్ వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లను కాపాడుకోవాలని ఎయిర్టెల్ చూస్తోంది. గత నెలలో 300ఎంబీపీఎస్ వరకు స్పీడ్ ఉన్న హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఎంపిక చేసుకున్న వారికి ఆరు నెలలు, ఏడాది పాటు 15 శాతం, 20 శాతం డిస్కౌంట్లను ఎయిర్టెల్ ఆఫర్‌చేసింది. ఎయిర్టెల్ అపరిమిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ డేటా ప్లాన్లను, కరెక్ట్‌గా జియో గిగాఫైబర్ సర్వీసులు మార్కెట్లోకి వచ్చే సమయంలో ఆఫర్ చేస్తోంది. కాగ, ఆగస్టు 15 నుంచే రిలయన్స్ జియో తన అప్‌కమింగ్ గిగాఫైబర్ బ్యాండ్ సర్వీసుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. కేవలం రూ.500కే హై-స్పీడ్, వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ఇంటర్నెట్ ఆధారిత టెలివిజన్ ప్రొగ్రామింగ్ ఆధారితంగా అందిస్తోంది. అపరిమిత ప్యాక్లుగా మారబోతున్న ఎయిర్టెల్ డేటా ప్లాన్లు... ముంబైలో 699 రూపాయలు, 1,999 రూపాయల ప్లాన్లు అహ్మదాబాద్, గాంధీనగర్, జమ్నాగర్‌లో 499 రూపాయలు, 599 రూపాయలు, 1,099 రూపాయల ప్లాన్లు చంఢీఘర్, ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, జైపూర్, ఇండోర్, కోల్‌కత్తాల్లో 1,999 ప్లాన్ ఆగ్రా, అంబాలా, కర్నల్‌ల్లో 499 రూపాయలు, 1,999 రూపాయల ప్లాన్లు ‘ఎయిర్టెల్ మొత్తం హోమ్ బ్రాండ్ నెట్వర్క్ ప్రస్తుతం వి-ఫైబర్ ఆఫర్ చేస్తుంది. దీని కింద 300 ఎంబీపీఎస్ స్పీడులో డేటా లభ్యవుతుంది. ఒకవేళ కస్టమర్లకు అవసరమైతే, 1 జీబీపీఎస్ స్పీడుకు అప్‌గ్రేడ్ చేస్తాం’ అని ఎయిర్టెల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రస్తుతం 89 ప్రాంతాల్లో ఉన్న బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను కనీసం 100 కీ నగరాలకు విస్తరించేందుకు ఆర్థిక సంవత్సరం 2019 కోసం రూ.24వేల కోట్లను పక్కన తీసి పెట్టినట్టు మరో సీనియర్ ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. 2021 వరకు మరో 10 మిలియన్ పైగా గృహాలకు తమ నెట్‌వర్క్‌ను కనెక్ట్ చేయాలని ఎయిర్టెల్ లక్ష్యంగా పెట్టుకుంది. -
‘జియోఫోన్ 2’ తర్వాత సేల్ ఎప్పుడంటే..
రిలయన్స్ జియో తన జియోఫోన్ హై-ఎండ్ మోడల్ జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్‌ను ప్రారంభించింది. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ జియో వెబ్సైట్లో కొనుగోలుకు అందుబాటులోకి తెచ్చింది. జియో.కామ్, రిలయన్స్ జియో వెబ్సైట్లో ఈ ఫోన్ ఫ్లాష్ సేల్‌ను నిర్వహించింది. జియోఫోన్ 2 తొలి సేల్‌ను ముగించి, తర్వాతి ఫ్లాష్ సేల్ ఆగస్టు 30 మధ్యాహ్నం 12 గంటలకు అని కూడా పేర్కొంది. జియో ఫోన్ 2 ధర 2999 రూపాయలు. వినియోగదారులు తమ పాత ఫీచర్ ఫోన్‌ను ఇచ్చి రూ. 501కు కొత్త జియో ఫోన్‌ను పొందవచ్చు. జియో ఫోన్ 2 వినియోగదారుల కోసం కంపెనీ రూ.49, రూ.99, రూ.153 కింద ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. బుధవారం నుంచి జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది. జియోఫోన్ 2 ఫీచర్లు 2.4 అంగుళాల హారిజంటల్ డిస్ప్లేతో పాటు క్వర్టీ కీప్యాడ్ జీపీఎస్, ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్, వాట్సప్ 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమరీ కార్డుతో 128 జీబీ వరకు) 2000ఎంఏహెచ్ బ్యాటరీ వెనక భాగంలో 2 మెగాపిక్సల్ కెమెరా ముందు భాగంలో వీజీఏ సెల్ఫీ కెమెరా 4జీ ఫీచర్, వీఓవైఫై, బ్లూటూత్, వైఫై ‘భారతదేశంలో డిజిటల్ విప్లవాన్ని పెంచేందుకు జియోఫోన్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రతి ఒక్క భారతీయుడికి ఇంటర్నెట్ యాక్సెస్‌ను కల్పించి, డిజిటల్ లైఫ్ ఎంజాయ్ చేసే అవకాశం కల్పించనున్నాం’ అని జియోఫోన్ 2ను అందుబాటులోకి తీసుకొస్తూ రిలయన్స్ జియో ఈ ప్రకటన చేసింది. జియోఫోన్ లేటెస్ట్ ఫీచర్లు... ఆగస్టు 15 నుంచి ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్‌ను జియోఫోన్ కస్టమర్లు పొందుతున్నారు. వాట్సాప్ కూడా బ్యాచ్ వారీగా అందుబాటులోకి వస్తుంది. జియోటీవీ, జియోసినిమా, జియోమ్యూజిక్, జియోఛాట్ అప్లికేషన్ల ప్రీమియం కంటెంట్‌ను పొందడంతో పాటు, ఉచిత వాయిస్ కాల్స్ కూడా పొందుతారు. వాయిస్ కమాండ్ ఫీచర్ ద్వారా కాల్స్ చేసుకోవడం, మెసేజ్‌లు పంపుకోవడం, ఇంటర్నెట్ సెర్చ్ చేసుకోవడం, మ్యూజిక్ ప్లే చేయడం, వీడియోలు చూడటం వంటివి చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్, ఇతర ముఖ్యమైన సర్వీసుల యాక్సస్‌ను పొందవచ్చు. -
హ్యాపీ అవర్స్! ముఖేష్ తర్వాత హిట్‌లిస్ట్ వారే!
బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో రిలయన్స్ జియో హ్యాపీ అవర్స్ ప్రారంభం కాబోతున్నాయి. ముఖేష్ అంబానీ తర్వాత హిట్‌లిస్ట్‌గా కేబుల్ ఆపరేటర్స్ ఛార్జ్ చేసే దానికంటే సగం తక్కువగా ఇంటర్నెట్ ఆధారిత టెలివిజన్ ప్రొగ్రామింగ్ సర్వీసులను(జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను) ఆఫర్ చేసేందుకు జియో సన్నద్ధమైంది. వీటి ప్రారంభ ధర 500 రూపాయలుగా కంపెనీ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. జియోగిగాఫైబర్‌ను దివాళి కంటే ముందస్తుగానే కమర్షియల్‌గా ఆవిష్కరించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ సర్వీసుల అందుబాటు ఆగస్టు 15 నుంచే ప్రారంభమయ్యే వినియోగదారుల రిజిస్ట్రేషన్లను బట్టి ఉంటుంది. ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ రిజిస్ట్రేషన్లు నమోదు అవుతాయో, అక్కడ తొలుత ఈ సర్వీసులను అందజేయనున్నారు. ఇలా దివాళి కల్లా కమర్షియల్‌గా ఆవిష్కరించడం పూర్తయి పోవాలని కంపెనీ చూస్తోంది. తొలుత మెట్రోల్లో, ఆ అనంతరం 80 టాప్ టైర్ 1, టైర్ 2 మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్స్‌ను కేబుల్ ఆపరేటర్స్ ఆఫర్ చేస్తున్నరు. నెలకు 700 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో 100 జీబీ డేటాను, 100 ఎంబీపీఎస్ స్పీడులో అందజేస్తున్నారు. అదనంగా టీవీ సర్వీసులకు ఒక్కో ఇంటికి 250 రూపాయల నుంచి 300 రూపాయలు తీసుకుంటున్నారు. జియో కూడా అదేరకమైన ఆఫర్‌ను అంటే 100జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడులో వాటికంటే 50 శాతం తక్కువ ధరకే అందజేయబోతుంది. కంపెనీ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల ధరలు ప్రస్తుతమున్న 4జీ మొబైల్ డేటా రేట్లకు 25 శాతం నుంచి 30 శాతం డిస్కౌంట్లో లభించనున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అంటే ఒక్క జీబీ డేటా కేవలం రూ.2.7 నుంచి రూ.5కే లభ్యం కానుందని హెచ్ఎస్బీసీ డైరెక్టర్, టెలికాం విశ్లేషకులు రాజీవ్ శర్మ చెప్పారు. టీవీ సర్వీసులతో వస్తున్న జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు, తన సొంత 4జీ మొబైల్ డేటా వ్యాపారాలను దెబ్బకొట్టవని విశ్లేషకులు చెప్పారు. ఫైబర్ ఆధారిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల వీడియో స్ట్రీమింగ్ నాణ్యత, 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కంటే ఎక్కువ విశ్వసనీయతతో, స్థిరంగా ఉంటాయని ఫిలిప్‌క్యాపిటల్ టెలికాం విశ్లేషకుడు నవీన్ కులకర్ని తెలిపారు. -
జియో గిగాఫైబర్ టారిఫ్ ప్లాన్స్ ఇవేనట!
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోనూ తన సత్తా చూపేందుకు వచ్చేస్తోంది. జియోగిగాఫైబర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 41వ వార్షిక సాధారణ సమావేశంలో లాంచ్ చేసింది. ఇళ్లకు, ఆఫీసులకు, దుకాణాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా హై-స్పీడ్ఇంటర్నెట్ను అందించడమే లక్ష్యంగా జియోగిగాఫైబర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల్లోనే జియోగిగాటీవీ సేవలను అందించబోతుంది. ఆగస్టు 15 నుంచి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు 41వ ఇన్వెస్టర్ల సమావేశంలోనే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. కానీ ఆ సమయంలో జియోగిగాఫైబర్ టారిఫ్‌లను రివీల్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఈ టారిఫ్ ప్లాన్లపై కంపెనీ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. మరికొన్ని రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తున్న క్రమంలో జియోగిగాఫైబర్ టారిఫ్ ప్లాన్లు ఈ విధంగా ఉండబోతున్నాయంటూ ఆన్లైన్లో కొన్ని టారిఫ్ ధరలు చక్కర్లు కొడుతున్నాయి. అవేమిటో ఓ సారి చూద్దాం.. 500 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్... జియోగిగాఫైబర్ తొలి ప్యాకేజీ రూ.500 నుంచి ప్రారంభమవుతుందట. ఈ ప్లాన్ కింద నెలకు 300 జీబీ వరకు డేటాను 50 ఎంబీపీఎస్ స్పీడులో అందించనున్నట్టు తెలుస్తోంది. అయితే 300 జీబీ ఎఫ్‌యూపీ పరిమితి అయిపోయాక, స్పీడ్ తగ్గిపోనుందని సమాచారం. 750 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్... తర్వాత ప్లాన్ రూ.750గా ఉంటుందని సంబంధిత వర్గాల టాక్. ఈ ప్లాన్ కింద నెలకు 450 జీబీ అపరిమిత డేటాను 50 ఎంబీపీఎస్ స్పీడులో అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీలో మార్కెట్లోకి వస్తుందని టాక్. 999 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్.... 600జీబీ వరకు అపరిమిత డేటాను రూ.999 ప్లాన్‌పై పొందవచ్చట. దీని స్పీడ్ 100 ఎంబీపీఎస్ అని తెలుస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులుగా ఉంటుందని సమాచారం. 1,299 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్.... ఈ ప్లాన్ ఎఫ్‌యూపీ పరిమితి 750 జీబీ. ఈ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడులో 30 రోజుల వరకు వాడుకోవచ్చట. 1,599 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్.... జియోగిగాఫైబర్ కింద అందించే హైయస్ట్ ప్లాన్ ఇదేనట. ఈ ప్లాన్ కింద 900 జీబీ డేటాను 150 ఎంబీపీఎస్ స్పీడులో పొందవచ్చట. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులని తెలుస్తోంది. ఎఫ్‌యూపీ పరిమితి అయిపోయాక స్పీడు పడిపోనుందని టాక్. జియోగిగాఫైబర్ రిజిస్ట్రేషన్లు... జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల రిజిస్ట్రేషన్లను రిలయన్స్ జియో ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతుంది. జియో అధికారిక వెబ్సైట్ లేదా మైజియో మొబైల్ అప్లికేషన్ నుంచే దీని రిజిస్ట్రేషన్లను ఆమోదించనుంది. తొలి దశలో 1,100 నగరాల్లో ఈ సేవలు లాంచ్ కాబోతున్నాయి. ఎక్కడైతే ఎక్కువ రిజిస్ట్రేషన్లు నమోదు అవుతాయో అక్కడ తొలుత దీని సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
నయా ఆఫర్: నెలకు 1500 జీబీ డేటా
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతుంది. తన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు జియో గిగాఫైబర్‌ను గత కొన్ని రోజుల క్రితమే లాంచ్ చేసింది. ఇవి త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్లాన్లను పునఃసమీక్షించడం ప్రారంభించింది. చెన్నై సర్కిల్లో తన ప్రీమియం ఎఫ్టీటీహెచ్ ప్లాన్ల ఎఫ్‌యూపీ పరిమితిని పెంచుతున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రూ.4999 ప్లాన్‌పై బీఎస్ఎన్ఎల్ అంతకముందు 1 టీబీ డేటా ఆఫర్ చేయగా.. ప్రస్తుతం 1.5 టీబీ వరకు అంటే 1500 జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఇతర ప్లాన్లపై కూడా ఎఫ్‌యూపీ ప్రయోజనాలను పెంచింది. చెన్నై సర్కిల్లో ఎవరైతే, ఫైబ్రో కోంబో యూఎల్డీ 4999 ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ఎఫ్టీటీహెచ్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తారో, వారికి 100 ఎంబీపీఎస్ స్పీడులో 1.5 టీబీ డేటా ఆఫర్ చేయనున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఎఫ్‌యూపీ అనంతరం స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు పడిపోనుంది. ఈ ప్లాన్‌పై డేటాతో పాటు బీఎస్ఎన్ఎల్ ఉచిత వాయిస్‌కాల్స్‌ను(బీఎన్ఎన్ఎల్ నెట్వర్క్ పరిధిలోనూ, బయట నెట్వర్క్) కూడా అందిస్తోంది. ఫైబ్రో కోంబో యూఎల్డీ 999 ప్లాన్‌పై 250 జీబీ డేటాను 60 ఎంబీపీస్ స్పీడులో అందిస్తుండగా.. రూ.1299 ప్లాన్‌పై 400 జీబీ డేటాను, 80 ఎంబీపీఎస్ స్పీడులో అందించనున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఫైబ్రో కోంబో యూఎల్డీ 1699 ప్లాన్‌పై 550 జీబీ డేటాను, 80 ఎంబీపీఎస్ స్పీడులో... ఫైబ్రో కోంబో యూఎల్డీ 1999 ప్లాన్‌పై 800 జీబీ డేటాను 80 ఎంబీపీఎస్ స్పీడులో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తుంది. అన్ని ఈ ప్రీమియం ఎఫ్టీటీహెచ్ ప్లాన్లపై ఉచిత వాయిస్ కాల్స్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. అయితే ఈ టారిఫ్‌లన్నీ కేవలం చెన్నై సర్కిల్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ జియోకు పోటీగా రూ.1045, రూ.1395, రూ.1895 ప్లాన్లను సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో జియో లాంచ్ చేసిన జియో గిగాఫైబర్‌పై 1 బీబీపీఎస్ వరకు స్పీడును అందించనుంది. గిగాటీవీ సెటాప్-బాక్స్‌లు, స్మార్ట్ హోమ్ డివైజ్‌ల సాయంతో, టీవీలకు కూడా ఇది పనిచేయనుంది. జియో గిగాఫైబర్ నెట్‌వర్క్‌లపై గిగాటీవీ ఇతర టీవీలకు, ఫోన్లకు, టాబ్లెట్లకు ఫోన్ కాల్స్ చేసుకోవడానికి వీలవుతుంది. -
బిగ్గెస్ట్ గేమ్‌ఛేంజర్ : ‘జియో గిగాఫైబర్’
ముంబై : దేశీయ టెలికాం రంగంలో అతిపెద్ద గేమ్ ఛేంజర్ ఫైబర్ ఆధారిత ఫిక్స్‌డ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు‘ జియోగిగాఫైబర్’ ను రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్ అంబానీలు మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. నేడు ముంబైలోని న్యూ మెరైన్ లైన్స్‌లో బిర్లా మధుశ్రీ ఆడిటోరియంలో జరిగిన 41వ వార్షికోత్సవ సమావేశంలో ఈ సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. జియోగిగాఫైబర్ ద్వారా అందించే ఫీచర్లను ఆకాశ్, ఇషా అంబానీలు ప్రజెంటేషన్ ద్వారా ఇన్వెస్టర్లకు వివరించారు. బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఆగస్టు 15 నుంచే కస్టమర్ల ముందుకు తీసుకురానున్నట్టు ముఖేష్ అంబానీ చెప్పారు. సెటాప్‌బాక్స్ ద్వారా టీవీలో కూడా జియోగిగాఫైబర్ సేవలను అందించనున్నట్టు ఆకాశ్, ఇషాలు తెలిపారు. జియోగిగాఫైబర్ ద్వారా జియోటీవీ కాలింగ్ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు. స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, టీవీ కాలింగ్‌లు జియోగిగాఫైబర్ రెండు ముఖ్యమైన ఫీచర్లని తెలిపారు. జియో.కామ్ లేదా మైజియో ద్వారా ‘జియోగిగాఫైబర్’ సర్వీసులను రిజిస్టర్ చేసుకోవచ్చని రిలయన్స్ పేర్కొంది. మూడు ముఖ్యమైన యాప్స్ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్‌లను జియో ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్టు ఆకాశ్, ఇషాలు చెప్పారు. జియో ఫోన్లో ఇవి ఎలా పనిచేస్తాయో కూడా చూపించారు. వీటిని ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు ముఖేష్ అంబానీ తెలిపారు. జియోఫోన్ హైఎండ్ మోడల్ జియోఫోన్ 2ను కూడా ఇషా, ఆకాశ్‌లు ప్రవేశపెట్టారు. గృహాలకు, వర్తకులకు, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలకు, పెద్దపెద్ద వ్యాపారాలకు ఫైబర్ కనెక్టివిటీని విస్తరించనున్నామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. 1,100 నగరాలకు అత్యున్నతమైన ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ సొల్యూషన్స్‌ను ఆఫర్‌చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే టాప్ - 5 బ్రాడ్‌బ్యాండ్ దేశాల్లో భారత్‌ను ఒకటిగా నిలుపాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ముఖేష్ అంబానీ ప్రసంగంలో పలు ముఖ్యాంశాలు : 2,999 రూపాయలకే జియోఫోన్ హై-ఎండ్ మోడల్ జియోఫోన్ 2 జియోఫోన్‌కు మాన్సూన్ హంగామా ఆఫర్, కేవలం రూ.501కే పాత ఫీచర్ ఫోన్ల ఎక్స్చేంజ్లో కొత్త జియోఫోన్ జియోగిగాపైబర్ నెట్‌వర్క్‌ను గంట కంటే తక్కువ వ్యవధిలోనే కంపెనీ సర్వీసుమెన్ ఇన్స్టాల్ బ్రాడ్‌బ్యాండ్ వాడకంలో ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత్ 134వ స్థానంలో ఉంది. దీనిలో ప్రపంచంలో టాప్-5లో భారత్‌ను ఒకటిగా చేరుస్తాం ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్‌దే రాబోయే భవిష్యత్తు కాలం బెస్ట్ ఎడ్యుకేషనల్ కంటెంట్‌ను జియోగిగాఫైబర్ హోమ్ ద్వారా యాక్సస్ రియల్ టైమ్ మెడికల్ సూచనలు అందుబాటు జియోగిగా టీవీ లాంచ్ చేసిన రిలయన్స్, 4కే రెజుల్యూషన్‌లో వీడియో ప్లే అందుబాటు ధరలో నాణ్యమైన సేవలు కేవలం 22 నెలల కాలంలోనే జియోకు 215 మిలియన్ కస్టమర్లు డేటా వాడకం నెలకు 125 కోట్ల జీబీ నుంచి 240 కోట్ల జీబీకి పైగా పెరిగింది వాయిస్ వాడకం ప్రతి రోజూ 250 కోట్ల నిమిషాల నుంచి 530 కోట్ల నిమిషాలకు చేరింది వీడియో వాడకం 165 కోట్ల గంటల నుంచి 340 కోట్ల గంటలకు పెరిగింది అనూహ్యమైన నెట్వర్క్ వృద్ది గుర్తింపును సాధిస్తూనే నెంబర్ వన్ స్థానాన్ని విజయవంతంగా కలిగి ఉండగలిగాం. గతేడాది ప్రతి నెలలోనూ ట్రాయ్ స్పీడ్ టెస్ట్ డేటాలో భారత్‌లో ఫాస్టెస్ట్ నెట్వర్క్ గుర్తింపును తెచ్చుకుంది భారత ఎగుమతుల్లో రిలయన్స్ వాటా 8.9 శాతం 20.6 శాతం పెరిగిన రిలయన్స్ నికర లాభాలు ప్రైవేట్ కంపెనీలో అత్యధిక పన్ను చెల్లింపుదారు రిలయన్స్ ఇండస్ట్రీస్, 2018లో రూ.9844 కోట్ల పన్ను చెల్లింపు రిలయన్స్ రిటైల్ : గతేడాది 3500 స్టోర్లు ప్రారంభం, ఈ ఏడాది 4 వేలకు పైగా ప్రారంభించనున్నట్టు తెలిపిన ముఖేష్ 5 లక్షల టన్నుల గ్రోసరీలు అమ్మిన రిలయన్స్ రిటైల్