ఏటీఎం కార్డుతోనే లోన్లు!
ముంబై: ఏటీఎం కార్డు ..అదే ఎనీ టైమ్ మనీ కార్డు ఇపుడు ఎనీ టైం లోన్ కార్డ్ గా అవతరించింది. ఏటీఎం ద్వారా అప్పటికప్పుడు లోన్ తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తూ హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో గత మూడు దశాబ్దాలుగా మన జీవితాల్లో పెనవేసుకుపోయిన ఏటీఎం కార్డు ఇపుడు మరో విప్లవాత్మక పాత్ర పోషించనుంది. ఎనీ టైం లోన్ తో ఏటీఎం కార్డు ద్వారా చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తోంది. వ్యక్తిగత రుణాల వ్యవస్థను బలోపేతం చేసిన హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు తమ దగ్గర ఉన్న వినియోగదారుల ఖాతాకు సంబంధించిన వివరాలు తదితరాలను పరిశీలించి అప్పటికప్పుడు రుణం తీసుకునే సదుపాయాన్ని కల్పించింది.
ఈ వివరాలను పరిశీలించేందుకు బ్యాంకుకు సంబంధించిన ఆన్ లైన్ పోర్టల్ లో లాగిన్ అయిన తర్వాత కేవలం పది నిమిషాలు సరిపోతుందని బ్యాంక్ తెలిపింది. ఈ పద్ధతి ద్వారా వినియోగదారులను, ఖాతాదారులను పెంచుకునేందుకు బ్యాంక్ పథక రచన చేసింది. ఈ క్రమంలో ఏటీఎంల సంఖ్యను బాగా పెంచుకుని తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ఆలోచిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన ఆటోమేటెడ్ టెల్లర్ మిషిన్.. నో.. ఎనీ టైం మనీ.. అని పిలిచే ఏటీఎం ఇపుడు ఎనీ టైం లోన్ అంటూ దూసుకుపోవడానికి రెడీ అవుతోందన్నమాట.