హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫీజుల బాదుడు
నగదు లావాదేవీలపై భారీగా పెంపు
ముంబై: డిజిటల్ లావాదేవీలకు ఊతమిచ్చే దిశగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి నగదు లావాదేవీలపై ఫీజులను భారీగా పెంచాలని నిర్ణయించింది. మార్చ్ 1 నుంచి నిర్దిష్ట లావాదేవీల చార్జీలను భారీగా పెంచాలని, ఇతరత్రా లావాదేవీల్లో నగదు పరిమాణంపై పరిమితులు విధించాలని, మరికొన్ని లావాదేవీలపై కొత్తగా చార్జీలు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. రోజులో థర్డ్ పార్టీ లావాదేవీలపై రూ. 25,000 పరిమితి, శాఖల్లో ఉచిత నగదు లావాదేవీల సంఖ్యను అయిదు నుంచి నాలుగుకి తగ్గుతాయని పేర్కొన్నాయి.
ఉచితం కాని లావాదేవీలపై ఫీజులను 50 శాతం మేర పెంచుతూ రూ. 150కి చేర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హోమ్ బ్రాంచ్‌లలో మొత్తం డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ ఉచిత లావాదేవీలను రూ. 2 లక్షలకు పరిమితం చేసినట్లు పేర్కొన్నాయి. పరిమితి దాటిన పక్షంలో కనిష్టంగా రూ. 150 లేదా ప్రతి వెయ్యికి రూ. 5 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. పెద్ద నోట్ల రద్దు దరిమిలా వివిధ చార్జీలను తొలగించడం వల్ల మూడో త్రైమాసికంలో ఫీజుల రూపంలో ఆదాయాలు మందగించి, లాభాల వృద్ధి గడిచిన పద్దెనిమిదేళ్లలో అత్యంత తక్కువ స్థాయిలో నమోదైన నేపథ్యంలో ఫీజుల పెంపు ప్రాధాన్యం సంతరించుకుంది.