రుణ రేటును తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర బ్యాంకులు, ఆర్థిక సంస్థల బాటలోనే దేశంలో రెండవ పెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఎంసీఎల్‌ఆర్ ఆధారిత బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 90 బేసిస్ పాయింట్లు (0.9%) వరకూ తగ్గించింది. జనవరి 7వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి. పలు కాలపరిమితులకు సంబంధించి రేటును 0.75% నుంచి 0.90 శాతం శ్రేణిలో తగ్గించినట్లు బ్యాంక్ పేర్కొంది.
తగ్గించిన రేట్లు ఇలా...
⇔ గృహ రుణాలుసహా వివిధ ప్రొడక్టులపై వార్షిక ఎంసీఎల్‌ఆర్ 0.75 శాతం తగ్గి 8.15 శాతానికి చేరింది. ఎస్‌బీఐ విషయంలో ఈ రేటు 8 శాతం ఉండగా, ఐసీఐసీఐ బ్యాంక్ రేటు 8.20 శాతంగా ఉంది.
⇔ ఓవర్‌నైట్ రేటు 0.85 శాతం తగ్గి, 7.85 శాతానికి చేరింది.
⇔ 3 నెలల రేటు 0.90 శాతం తగ్గి, 7.90 శాతానికి పడింది.
కెనరా బ్యాంక్ కూడా...
ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ కూడా ఎంసీఎల్‌ఆర్ వార్షిక రేటును 0.7% తగ్గించింది. దీంతో ఈ రేటు 8.45%కి పడింది.