
న్యూఢిల్లీ: గృహ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 2,114 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కంపెనీ నికర లాభం రూ. 5,300 కోట్లు. అయితే, అప్పట్లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూలో వాటాలను విక్రయించడం ద్వారా రూ. 5,250 కోట్ల నిధులు వచ్చినందున రెండు త్రైమాసికాల ఫలితాలను పోల్చి చూడటానికి లేదని సంస్థ తెలిపింది. మరోవైపు, క్యూ3లో మొత్తం ఆదాయం రూ. 8,824 కోట్ల నుంచి రూ. 10,569 కోట్లకు చేరింది.
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) నిబంధనల ప్రకారం స్థూల నిరర్ధక ఆస్తులు 1.22 శాతంగా ఉన్నాయని, మూలధన నిల్వల నిష్పత్తి (సీఏఆర్) 18.9%గా ఉందని హెచ్‌డీఎఫ్‌సీ వివరించింది. ఇందులో టియర్ 1 మూలధన నిష్పత్తి 17.2 శాతంగా ఉండగా, టియర్ 2 నిష్పత్తి 1.7%గా ఉన్నట్లు పేర్కొంది. సాధారణంగా నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం సీఏఆర్ 12 శాతంగాను, టియర్ 1 నిష్పత్తి 6 శాతంగాను ఉంటే సరిపోతుంది. అటు, స్వతంత్ర డైరెక్టర్‌గా ఇరీనా విఠల్ నియామకానికి బోర్డు ఆమోదముద్ర వేసింది. జనవరి 30 నుంచి అయిదేళ్ల పాటు ఆమె ఈ హోదాలో ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment