హెరిటేజ్ ఫుడ్స్ లో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి చెందిన డెయిరీ, రిటైల్ రంగ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిలయన్స్ రిటైల్‌కి (ఆర్‌ఆర్‌ఎల్) చెందిన డెయిరీ వ్యాపార విభాగాన్ని హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ డెయిరీ బిజినెస్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్టు హెరిటేజ్ ఫుడ్స్ గురువారం ప్రకటించింది. '' ఈ డీల్ కు సంబంధించి కంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం పొందాం. రిలయన్స్ డెయిరీ బిజినెస్ కొనుగోలును పూర్తిచేశాం'' అని నేడు బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది. ఏప్రిల్ 12 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని తెలిపింది. రిలయన్స్ రిటైల్ దుకాణాల్లో యథావిధిగా అమ్మకాలు నిర్వహిస్తాయని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ రిటైల్ డెయిరీ ప్రొడక్ట్ లను పూర్తిగా తమ సొంతం చేసుకున్నట్టు కంపెనీ ప్రకటించగానే హెరిటేజ్ షేర్లు ఒక్కసారిగా పైకి ఎగిశాయి.
1.71 శాతం లాభాలతో 1092.20గా ట్రేడవుతున్నాయి. మార్కెట్ అవర్స్ లో ఈ ప్రకటనను హెరిటేజ్ ఫుడ్స్ విడుదల చేసింది. 2016 డిసెంబర్ క్వార్టర్లో హెరిటేజ్ ఫుడ్స్ నికరలాభాలు 75.11 శాతం పైకి ఎగిసి 19.91 కోట్లగా నమోదైన సంగతి తెలిసిందే. హెరిటేజ్ ఫుడ్స్ డెయిరీ, రిటైల్, అగ్రి, బేకరీ, రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లలో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. రిలయన్స్ డెయిరీ విభాగం 2007 నుంచి దేశవ్యాప్తంగా పాల సేకరణ, ప్రాసెసింగ్, పంపిణీ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రధానంగా డెయిరీ లైఫ్, డెయిరీ ప్యూర్ బ్రాండ్స్ కింద ప్యాక్డ్ మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్, డెయిరీ వైట్‌నర్, నెయ్యి, వెన్న, స్వీట్స్ తదితర ఉత్పత్తులు విక్రయిస్తోంది.