హీరో సైకిల్స్ చైర్మన్ కన్నుమూత
లూధియానా : హీరో గ్రూప్ సహ వ్యవస్థాపకులు, హీరో సైకిల్స్ చైర్మన్ ఓపీ ముంజల్(87) పరమపదిం చారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముంజల్ గురువారం డీఎంసీ హీరో హార్ట్ సెంటర్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ముంజల్ 1928లో కమాలియాలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ముంజల్ తన ముగ్గురు సోదరులతో కలిసి 1944లో అమృత్‌సర్‌లో సైకిల్ విడిభాగాల వ్యాపారాన్ని ప్రారంభించారు.
తర్వాత వీరు 1956లో లూధియానా కేంద్రంగా ‘హీరో’ పేరుతో తొలి సైకిల్ తయారీ కంపెనీ స్థాపించారు. రోజుకు 25 సైకిళ్ల తయారీ సామర్థ్యంతో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్తుతం రోజుకు 19,500 సైకిళ్లను తయారు చేసే స్థాయికి ఎదిగింది. దేశంలోని సైకిల్ మార్కెట్‌లో 40 శాతం వాటా హీరో సైకిల్స్‌దే. హీరో సైకిల్స్ 1986లో ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ తయారీ కంపెనీగా గిన్నిస్ బుక్‌లో స్థానం సాధించింది. ముంజల్ పర్యవేక్షణలో కంపెనీ క్రమంగా అభివృద్ధి చెందుతూ.. పలు ఇతర రంగాలకు విస్తరించింది.
అనారోగ్య కారణాల వల్ల ముంజల్ ఇటీవలే హీరో మోటార్స్ గ్రూప్ చైర్మన్, ఎండీ బాధ్యతల నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఆయన అఖిల భారత సైకిల్ తయారీదారుల సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. రాక్‌మన్ సైకిల్ ఇండస్ట్రీస్, హైవే సైకిల్ ఇండస్ట్రీస్, సన్‌బీమ్ క్యాస్టింగ్, గుజరాత్ సైకిల్స్ లిమిటెడ్ వంటి కంపెనీల డైరె క్టర్‌గా వ్యవహరించారు. లూదియానాలోని భారతీయ విద్యా మందిర్ హైస్కూల్ ప్రెసిడెంట్, బీసీఎం పబ్లిక్ స్కూల్స్, బీఎడ్ కళాశాల ట్రస్టీగా వ్యవహరించారు. దయానంద్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్నారు. ఆయనను ఉద్యోగ్ పత్ర, పంజాబ్ రతన్, సాహీర్ వంటి అవార్డులు వరించాయి. ముంజల్ మృతికి పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌తోపాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.