నియామకాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) చీఫ్ జనరల్ మేనేజర్‌గా డి.వి.సురేష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1985లో ఎస్‌బీహెచ్‌లో ఆఫీసర్ హోదాలో వృత్తిని ప్రారంభించిన సురేష్ కుమార్ ఎస్‌బీఐ చికాగో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో పనిచేశారు.
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సిమెంట్ కంపెనీ లఫార్జ్ భారత కార్యకలాపాల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉజ్వల్ భర్తియా నియమితులయ్యారు. ఇది వరకు కంపెనీ భారత కార్యకలాపాలను మార్టిన్ రిగ్నర్ పర్యవేక్షించేవారు. ఉజ్వల్ భర్తియా గత 16 ఏళ్లుగా కంపెనీలోనే పనిచేస్తున్నారు.
స్టాక్ మార్కెట్‌లో ఈపీఎఫ్‌ఓ
ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) వచ్చే నెల నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించనుంది. వచ్చే నెల ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో(ఈటీఎఫ్) ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తామని ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ ప్రావిడెండ్ ఫండ్ కమిషనర్ కె.కె.జలాన్ చెప్పారు. తొలి ఏడాది రూ.5,000 కోట్ల వరకూ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయనున్నారు.
ఎలక్ట్రానిక్స్ రంగంలోకి హీరో గ్రూప్
పారిశ్రామిక దిగ్గజం హీరో గ్రూప్ తాజాగా ఎలక్ట్రానిక్స్ రంగంలోకి ప్రవేశించింది. హీరో ఎలక్ట్రానిక్స్ పేరుతో కొత్త సంస్థను ప్రారంభించింది. రాబోయే రోజుల్లో సుమారు రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు హీరో ఎలక్ట్రానిక్స్ సంస్థ చైర్మన్ సుమన్ కాంత్ ముంజల్ వెల్లడించారు.
రిలయన్స్ జియోకి ఎంఎస్‌ఓ అనుమతి
డిజిటల్ కేబుల్ టీవీ విభాగంలో మల్టీ సర్వీస్ ఆపరేటర్‌గా (ఎంఎస్‌ఓ) వ్యవహరించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియోకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ అనుమతితో రిలయన్స్ జియో ఇక నుంచి ఐఎంసీఎల్, సిటీ కేబుల్ నెట్‌వర్క్, డెన్ నెట్‌వర్క్ వంటి వాటికి పోటీ ఇవ్వనుం ది. ఇంటిగ్రేటెడ్ బిజినెస్ కేబుల్ రూపంలో టెలికం, హైస్పీడ్ డాటా, డిజిటల్ కామర్స్, మీడియా, పేమెంట్ సర్వీసులను అందించే జియో బ్రాండ్‌ను రిలయన్స్ జియో అభివృద్ధి చేస్తోంది.
టెక్ మహీంద్రాకు రూ.500 కోట్ల ప్రాజెక్ట్
వైద్య సేవల రంగానికి సంబంధించి ‘ఎన్త్‌డెమైన్షన్’ పేరిట ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా కొత్తగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. బ్రిటన్‌కు చెందిన సర్కిల్ హెల్త్ సంస్థకి టెక్నాలజీ సర్వీసులు అందించేందుకు ఈ కొత్త కంపెనీ దాదాపు రూ. 500 కోట్ల డీల్‌ను దక్కించుకుంది. అదనంగా పేషెంట్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఎంఆర్‌ఐ అపాయింట్‌మెంట్స్ తీసుకోవడానికి, డాక్టర్లు మొబైల్ పరికరాల్లోనే స్కానింగ్ రిపోర్టులు చూడటానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా టెక్ మహీంద్రా అందించనుంది.
భారత సాఫ్ట్‌వేర్ మార్కెట్ వృద్ధి 10%
గతేడాది రెండో అర్ధ భాగంలో భారతీయ సాఫ్ట్‌వేర్ మార్కెట్ వృద్ధి 10 శాతంగా నమోదైంది. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి టాప్ ఐటీ కంపెనీలు స్థిరంగా రెండంకెల వృద్ధిని నమోదు చేయడమే దీనికి కారణమని ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తన నివేదికలో తెలిపింది. భారతీయ సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో ప్రాథమికంగా ఉన్న అప్లికేషన్ డెవలప్‌మెంట్ డిప్లాయ్‌మెంట్, అప్లికేషన్స్, సిస్టమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్‌వేర్(ఎస్‌ఐఎస్) అనే మూడు విభాగాలు దాదాపుగా రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి.
ఆర్‌బీఐ అనుమతి అవసరం లేదు
అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు లేకుండానే నిధులు సమీకరించవచ్చు. దీనికి సంబంధించిన నిబంధనలను ఆర్‌బీఐ సడలించింది. భారత ప్రభుత్వం ఒక వాటాదారుగా ఉన్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు/మల్టీలేటరల్ ఆర్థిక సంస్థల నుంచి బ్యాంకులు రుణాలు తీసుకోవచ్చని, దీనికి తమ నుంచి ఎలాంటి అనుమతులూ అక్కర్లేదని ఆర్‌బీఐ పేర్కొంది.
చిన్న సంస్థలకు ఈపీఎఫ్‌ఓ ఊరట
ఉద్యోగుల భవిష్య నిధికి తమ వంతుగా కట్టాల్సిన మొత్తాన్ని జమ చేసే విధానం విషయంలో చిన్న సంస్థలకు ఈపీఎఫ్‌ఓ కొంత వెసులుబాటు కల్పించింది. ఇంతకు ముందు లాగానే సుమారు రూ. 1లక్ష కన్నా తక్కువగా జమ చేయాల్సిన మొత్తాన్ని చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల ద్వారా చెల్లించడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ దాకా ఈ వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జమ చేయాల్సి ఉంటుంది.
ఉల్లి కనీస ఎగుమతి ధర పెంపు
దేశీయంగా ధరలను కట్టడి చేసేందుకు, తగినంత సరఫరా ఉండేలా చూసేం దుకు ఉల్లి కనీస ఎగుమతి ధరను (ఎంఈపీ) కేంద్రం ఏకంగా టన్నుకు 175 డాలర్ల మేర పెంచింది. దీంతో ఇది 425 డాలర్లకు చేరింది. ఇంతకన్నా తక్కువ ధరకు ఉల్లిని ఎగుమతి చేయకూడదు.
కోల్ పీఎఫ్ నిధుల నిర్వహణకు 2 సంస్థలు
బొగ్గుగని కార్మికుల ప్రావిడెండ్ ఫండ్ నిధులను నిర్వహించడానికి రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ(ఆర్‌క్యామ్), ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రైమరీ డీలర్షిప్ సంస్థలు ఎంపికయ్యాయి. ఈ రెండు సంస్థలు కోల్‌మైన్స్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(సీఎంపీఎఫ్‌ఓ)కు చెందిన రూ.60,000 కోట్ల పీఎఫ్ నిధుల నిర్వహణ బాధ్యతను చూసుకోనున్నాయి.
కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పెంపు
2005కు ముందున్న కరెన్సీ నోట్ల మార్పిడి గడువును భారతీయ రిజర్వు బ్యాంక్ మరింత పొడిగించింది. సాధారణంగా ఈ గడువు జూన్ 30 నాటితో ముగుస్తుంది. కానీ ఆర్‌బీఐ ఆ గడువును డిసెంబర్ చివరిదాకా పొడిగించింది. ప్రజలు బ్యాంక్ శాఖల్లో వెంటనే మార్పు చేసుకోవచ్చు.
6 రోజుల్లోనే లిస్టింగ్
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పలు కీలక సం స్కరణలను ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఐపీఓ ప్రక్రియను ఇప్పుడున్న 12 రోజుల నుంచి 6 రోజులకు కుదించింది. ఇన్వెస్టర్ల నిధు లు ఎక్కువ రోజుల పాటు లాక్ కాకుండా.. అదేవిధం గా కంపెనీల లిస్టింగ్‌ను వేగవంతం చేయడం కోసం సెబీ ఈ మార్పులు చేసింది. అంటే ఇకపై ఐపీఓ ముగింపు తేదీ నుంచి ఆరు రోజుల్లోగా కంపెనీ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కావాల్సి ఉంటుంది. తాజా మార్పులు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఐక్సిగోలో మైక్రోమ్యాక్స్ పెట్టుబడులు
మొబైల్ ఫోన్‌లు తయారు చేసే మైక్రోమ్యాక్స్ సంస్థ ఐక్సిగో(మొబైల్ ట్రావెల్ సెర్చ్ అండ్ మార్కెట్ ప్లేస్)లో పెట్టుబడులు పెట్టింది. ఏడాదిలో 20 స్టార్టప్‌ల్లో 2 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలో భాగంగా ఐక్సిగోలో పెట్టుబడులు పెట్టినట్లు మైక్రోమ్యాక్స్ తెలిపింది.
డీల్స్..
దేశీయంగా భారీ ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే దిశగా టెలికం దిగ్గజం భారతీ ఎంటర్‌ప్రైజెస్, జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్, తైవాన్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది. ఈ జాయింట్ వెంచర్ సంస్థ కంపెనీ సౌర విద్యుత్ రంగంలో దాదాపు 20 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. భారత్‌లో 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
బ్లూ డార్ట్ ఏవియేషన్‌లో 21 శాతం వాటా కొనుగోలు చేశామని బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. దీంతో తమ మొత్తం వాటా 49 శాతం నుంచి 70 శాతానికి పెరిగిందని పేర్కొంది. దీంతో బ్లూ డార్ట్ ఏవియేషన్ తమ అనుబంధ సంస్థగా మారిందని వెల్లడించింది.
అమెరికాకు చెందిన డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ సంస్థ మార్కెట్ మోటివ్‌ను భారత్‌కు చెందిన ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ సింపుల్ లెర్న్ కొనుగోలు చేసింది. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే మార్కెట్ మోటివ్‌ను కోటి డాలర్లకు కొనుగోలు చేసినట్లు బెంగళూరు కేంద్రంగా పనిచేసే సింపుల్ లెర్న్ తెలిపింది.
గతవారం బిజినెస్
Published Mon, Jun 29 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM
Advertisement
Advertisement