హీరో యాజమాన్యంలో మార్పులు!
• హీరో మోటోకార్ప్ నుంచి తప్పుకుంటున్న సునిల్ ముంజాల్
• ఆగస్టు 16 నుంచీ గ్రూప్ ఇతర సంస్థల బాధ్యతలు
• గ్రూప్ వ్యవస్థాపకులు బ్రిజ్‌మోహన్‌లాన్ మృతి నేపథ్యం
న్యూఢిల్లీ : యాజమాన్య పంపిణీలో భాగంగా ఐదు బిలియన్ డాలర్ల హీరో గ్రూప్ ప్రధాన కంపెనీ హీరో మోటోకార్ప్ నుంచి సునిల్ ముంజల్ తప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కంపెనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ వ్యవరిస్తున్నారు. ఆయన పెద్ద సోదరుడు పవన్ ముంజాల్ చీఫ్‌గా ఉన్నారు. ఇతర వ్యాపార అవకాశాలతోపాటు గ్రూప్‌లోని ఇతర కంపెనీపై ఆయన ఇకపై దృష్టి సారించనున్నారు. ఎంఎంల్ ముంజాల్ కుటుంబం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
గత ఏడాది నవంబర్‌లో హీరో గ్రూప్ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రిజ్‌మోహన్ లాన్ ముంజాల్ మృతి నేపథ్యంలో తాజా యాజమాన్య మార్పులు చోటుచేసుకుంటుండడం గమనార్హం. సంస్థ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్‌గా సునిల్ పదవీ బాధ్యతల కాలం ఆగస్టు 16తో ముగుస్తుంది. అటు తర్వాత ఆయన హీరో కార్పొరేట్ సర్వీస్, ఇతర అనుబంధ కంపెనీలకు చైర్మన్‌గా కొనసాగుతారు. కొత్త వ్యాపార అవకాశాలపై సైతం ఆయన దృష్టి సారిస్తారు. తాజా పరిణామంలో భాగంగా హీరో గ్రూప్‌లో ప్రమోట ర్ వాటాలో ఎటువంటి మార్పూ వుండదని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.
సాన్నిహిత్యంపై ప్రభావం ఉండదు...
కాగా ఇది వ్యాపార విభజన, విస్తరణ భాగమేనని, కుటుంబం సాన్నిహిత్యం, ఐక్యతపై ఈ ప్రభావం ఏదీ ఉండబోదని సునిల్ ముంజాల్ తెలిపారు. పవన్ ముంజాల్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. ముంజాల్ సోదరులు నలుగురిలో సునిల్ చిన్నవారు. కాగా ఎన్‌ఎస్‌ఈలో హీరోమోటో కంపెనీ షేర్ ధర గురువారం క్రితం ముగింపు కన్నా స్వల్పంగా 0.39 శాతం (రూ.12.65) తగ్గి రూ. 3,192 వద్ద ముగిసింది.