ర్యాపిడోలో పవన్ ముంజాల్, రాజన్ ఆనందన్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్, గూగుల్ ఇండియా హెడ్ రాజన్ ఆనందన్‌లు.. బైక్ ట్యాక్సీ ఆపరేటర్ ‘ర్యాపిడో’లో పెట్టుబడులు పెట్టారు. వీరితోపాటు అద్వాంత్‌ఎడ్జ్ పార్ట్‌నర్స్, అస్ట్రాక్ వెంచర్స్, టెసెల్లటె వెంచర్స్, పీపుల్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో అనుపమ్ మిట్టల్, స్మైల్ గ్రూప్ పార్ట్‌నర్స్, ఫ్లిప్‌కార్ట్ మాజీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నాగోరి, కార్నేషన్ ఆటో సహా వ్యవస్థాపకుడు కునాల్ ఖట్టర్ వంటి తదితరులు ఇన్వెస్ట్ చేశారని ర్యాపిడో తెలిపింది. వీరు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టింది సంస్థ వెల్లడించలేదు. వచ్చిన నిధులను సంస్థ విస్తరణ కోసం ఉపయోగిస్తామని ర్యాపిడో సహా వ్యవస్థాపకుడు అరవింద్ సంకా తెలిపారు.
‘ప్రజలకు రవాణాను సులభతరం చేయడమే కాకుండా చాలా మందికి ఉపాధిని కల్పించే సామర్థ్యం ర్యాపిడోకు ఉంది. సంస్థ వ్యవస్థాపకులపై నాకు పూర్తి నమ్మకముంది. వారు తమ లక్ష్యాలను చేరుకుంటారని విశ్వసిస్తున్నాను’ అని ముంజాల్ తెలిపారు.