క్యూ2లో ప్రైవేటు కంపెనీలకు లాభాల పంట
16 శాతం వృద్ధి: ఆర్‌బీఐ
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్)లో లిస్టెడ్ ప్రైవేటు కంపెనీల లాభాలు 16 శాతం మేర వృద్ధి చెందాయని ఆర్‌బీఐ తెలిపింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 11.2 శాతమేనని పేర్కొంది. తయారీ రంగంలోని కంపెనీలు అధిక నికర లాభాల ఆర్జనలో ముందున్నాయి. వడ్డీ వ్యయాల్లో ఎటువంటి మార్పు లేకపోవడం లాభాల పెరుగుదలకు దోహదం చేసింది. వరుసగా ఏడు త్రైమాసికాల క్షీణత తర్వాత ముడి సరుకుల వ్యయాలు రెండో త్రైమాసికంలో పెరిగినప్పటికీ, ఉద్యోగుల వ్యయాలు పెరిగినా కానీ లాభాలు వృద్ధి చెందడం విశేషం.
తయారీ రంగ కంపెనీల విక్రయాలు సైతం రెండో త్రైమాసికంలో 3.7 శాతం వృద్ధి చెందాయి. ఇక సేవల రంగం (నాన్ ఐటీ)లోని కంపెనీల లాభాలు ఈ కాలంలో తగ్గిపోయాయి. ప్రభుత్వేతర నాన్ ఫైనాన్షియల్ కంపెనీల లాభాల వృద్ధి 1.9 శాతంగానే ఉంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల తగ్గుదలకు బ్రేక్ పడడంతో ముడి సరుకు వ్యయాలు పెరిగాయని, లాభాలు తగ్గిపోవడానికి ఇదే కారణమని ఆర్‌బీఐ తెలిపింది. స్టాక్ ఎక్సేంజ్‌లలో లిస్ట్ అయిన 2,702 ప్రభుత్వేతర, నాన్ ఫైనాన్షియల్ రంగంలోని కంపెనీల సమాచారాన్ని సంక్షిప్తం చేసి ఆర్‌బీఐ ఈ వివరాలు వెల్లడించింది.