సాక్షి,బెంగళూర్: ఐటీ రంగంలో నియమాకాలు మరికొన్నేళ్లు మందకొడిగానే ఉంటాయన్న అంచనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 7-8 శాతం పెరగడం కష్టమేనని ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) వీ బాలకృష్ణన్ అన్నారు. వచ్చే ఏడాది ఐటీ రంగంలో వృద్ధి పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి చెందిన మార్కెట్లలో పరిస్థితి ప్రోత్సాహకరంగా లేకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో ఐటీ రంగం చెప్పుకోదగ్గ వృద్థి సాధించలేదని పేర్కొన్నారు.
నియామకాలు మందగించాయని, ఆటోమేషన్ ప్రభావంతో మూడు ప్రధాన కంపెనీలు ఉద్యోగుల వృద్థిలో ప్రతికూల వృద్ధిని సాధించాయని చెప్పుకొచ్చారు. అయితే భారత ఐటీ పరిశ్రమకు ప్రధాన వనరుగా ఉన్న అమెరికాలో ఆర్థిక వ్యవస్థ కొంత మేర ఊపందుకోవడం ఊరట ఇచ్చే పరిణామమని చెప్పారు. యూరప్‌లోనూ పరిస్థితి మెరుగుపడటంతో వచ్చే ఏడాది నుంచి ఐటీ ఎగుమతులు ఆశాజనకంగా ఉంటాయని, అయితే డిజిటల్ రంగంలోనూ భారత్ సత్తా చాటాలని డిజిటల్ వైపుయ మళ్లే క్రమంలో భారత ఐటీ పరిశ్రమ పెద్దమొత్తంలో నిధులు కేటాయించి నూతన టెక్నాలజీలకు మళ్లే ప్రక్రియపై పెట్టుబడులు పెట్టాల్సిఉందన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ వృద్ధి 7 నుంచి 8 శాతం ఉంటుందన్న నాస్కామ్ అంచనాలను ప్రస్తావిస్తూ ఆ స్థాయిలో ఐటీ వృద్ధి ఉంటుందని తాను అనుకొవడం లేదన్నారు. మూడవ, నాల్గో త్రైమాసికాల్లో ప్రోత్సాహకర వృద్ధి రేటును సాధించడం ఐటీ పరిశ్రమ ముందున్న సవాల్ అని అన్నారు. ఇక ఐటీ రంగంలో నియామకాల్లో నెలకొన్న మందకొడితనం మరికొన్నాళ్లు కొనసాగుతుందని బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment