బైక్‌ల ధరలూ తగ్గాయ్
న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో కార్ల ధరలను తగ్గించినట్లే ద్విచక్రవాహనాల ధరలను కంపెనీలు తగ్గిస్తున్నాయి. టూవీలర్ల ధరలను రూ. 1,600-రూ.7,600 వరకూ తగ్గిస్తున్నామని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రకటించింది. రూ.4,500 వరకూ తగ్గిస్తున్నట్లు హీరో మోటోకార్ప్ మంగళవారం తెలిపింది. మధ్యంతర బడ్జెట్లో చిన్న కార్లు, మోటార్‌బైక్‌లు, స్కూటర్లపై ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఈ తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకే అందించనున్నామని ఈ రెండు కంపెనీలు పేర్కొన్నాయి. తగ్గించిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని హోండా వివరించింది.
తమ వాహనాల ధరలను 2 నుంచి 5 శాతం వరకూ తగ్గిస్తున్నామని హీరో మోటోకార్ప్ పేర్కొంది. హీరో మోటోకార్ప్ కరిజ్మా జెడ్‌ఎంఆర్, ఇంపల్స్, స్ప్లెండర్, గ్లామర్ టూవీలర్లను విక్రయిస్తోంది. ఆక్టివా, డియో, స్కూటర్లతో పాటు డ్రీమ్ యుగ, సీబీ స్టన్నర్, సీబీ యూనికార్న్, సీబీ ట్విస్టర్, షైన్ బైక్‌లను హోండా విక్రయిస్తోంది.