ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది యాక్టివ్ యూజర్లతో ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ సర్వీసుల దిగ్గజం వాట్సాప్‌ను ఎలా ప్రారంభించారు. అసలు ఈ యాప్‌ను ప్రారంభించాలనే ఆలోచన తమకు ఎలా వచ్చింది అనే విషయాన్ని ఆ కంపెనీ సీఈవో, సహవ్యవస్థాపకుడు జోన్ కౌమ్ రివీల్ చేశారు. మిస్డ్ కాల్సే, వాట్సాప్‌కు అంకురార్పణ అని తెలిపారు. జిమ్‌లో ఉన్నప్పుడు మిస్డ్ కాల్స్ ఎక్కువగా వస్తుండటంతో వాట్సాప్‌ను కనిపెట్టాలనే ఆలోచన తట్టిందని చెప్పారు.. కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూలో వందల కొద్దీ సిలికాన్ వ్యాలీ దిగ్గజాలతో నిర్వహించిన ఈవెంట్‌లో కౌమ్ ఈ విషయం వెల్లడించారు.
తాను జిమ్‌లో ఉన్నప్పుడు పదేపదే మిస్డ్ కాల్స్ వస్తుండేవని, ఇది చాలా కోపానికి కారణమయ్యేదని చెప్పారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఒక యాప్‌ను రూపొందించాలని బ్రియన్ యాక్టన్, తాను 2009లో నిర్ణయించామని తెలిపారు. తాము ఓ కంపెనీని ప్రారంభించాలని అనుకోలేదని, ప్రజలకు ఉపయోగపడేందుకు కేవలం ఒక ఉత్పత్తిని మాత్రమే రూపొందించాలని అనుకున్నామని చెప్పారు. ఆపిల్ ప్లే స్టోర్ తమ యాప్‌ను ఆమోదించినప్పటికీ, రాత్రికి రాత్రి ఇది విజయవంతం కాలేదని, ప్రారంభంలో దీన్ని ఎవరూ వాడలేదని గుర్తుచేసుకున్నారు.
కానీ మెల్లమెల్లగా 2014లో 400 మిలియన్ మందికి పైగా యూజర్లను సొంతం చేసుకుందని, అదే ఏడాది ఫేస్‌బుక్ ఈ యాప్‌ను రికార్డు స్థాయిలో 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందని తెలిపారు. దీంతో సహ వ్యవస్థాపకులమైన తాము రాత్రికి రాత్రే బిలీనియర్స్ అయినట్టు చెప్పారు. ఈ డీల్ తనకెంతో గుర్తుండిపోయే డీల్ అని తెలిపారు. గతేడాది బ్రియన్ కంపెనీ నుంచి వైదొలిగారని, తనని తాము చాలా మిస్ అవుతున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment