వయ వందన యోజన.. మంచిదేనా?
► వడ్డీ రేటు తక్కువే; కానీ స్థిరంగా పదేళ్లు
► గరిష్టంగా రూ.7.5 లక్షలు మాత్రమే పెట్టొచ్చు
► అంటే ఒక కుటుంబానికి నెలకొచ్చేది రూ.5వేలే
► ఇది చాలదు కనక దీనిపై ఆధారపడలేం: నిపుణులు
► పోస్టాఫీసు పథకం కొంత బెటర్; వడ్డీ 8.3 శాతం
► కానీ దీన్లో కాలపరిమితి ఐదేళ్లే; తరవాత వడ్డీ మారొచ్చు
► వడ్డీ తగ్గుతున్న ఈ సమయంలో స్థిర రేటు మంచిదే!!
ప్రతినెలా ఆదాయం కోరుకునే పెద్దల కోసం కేంద్రం... ‘ప్రధానమంత్రి వయ వందన యోజన’ పేరిట ఓ పథకాన్ని తెచ్చింది. ఒకేసారి ఏకమొత్తం పెట్టుబడి పెడితే, దానిపై 8 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా ఆదాయం వస్తుంటుంది. దీని నిర్వహణ బాధ్యతల్ని ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసీ చూస్తోంది. అసలు ఈ పాలసీ ప్రయోజనాలేంటి? ఇతర నిబంధనలేంటి? ఇది మంచిదేనా? ఇలాంటి ప్రత్యామ్నాయాలు వేరే కూడా ఉన్నాయా? ఇవన్నీ ఒకసారి చూద్దాం...
ప్రధానమంత్రి వయ వందన యోజన పథకం విధి, విధానాలు అన్నీ కూడా ఎల్‌ఐసీ గత పథకం వరిష్ట బీమా యోజనలో మాదిరిగానే ఉన్నాయి. వరిష్ట బీమా యోజనను 2014 ఆగస్టు నుంచి 2015 ఆగస్టు వరకు ఏడాది కాలం పాటు పెట్టుబడుల కోసం అందుబాటులో ఉంది. దీని స్థానంలో తాజాగా వచ్చిందే వయ వందన యోజన. కాకపోతే వరిష్ట బీమా యోజనలో 9 శాతం వడ్డీ రేటు ఉండగా, తాజా పథకంలో అది 8 శాతంగా మారిపోయింది. ఈ పథకంలో చేరేందుకు 2018 మే 3 వరకు అవకాశం ఉంది. ఇది తక్షణం పెన్షన్‌ను అందించే పాలసీ. పెట్టుబడి పెట్టిన మొత్తంపై 8 శాతం వడ్డీ ప్రకారం ప్రతి నెలా చెల్లింపులు జరుగుతాయి.
ఇన్వెస్ట్ చేసిన మరుసటి నెల నుంచే పెన్షన్ అందుతుంది. 60 ఏళ్లు దాటినవారే ఇందులో చేరేందుకు అర్హులు. కాల వ్యవధి పదేళ్లు. కాల వ్యవధి తీరిన తర్వాత పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. ఒకవేళ పాలసీదారుడు కాల వ్యవధి తీరక ముందే కాలం చేస్తే, పెట్టుబడి మొత్తాన్ని నామినీకి చెల్లించడం జరుగుతుంది. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా పాలసీని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించారు. వడ్డీ రేట్లు తగ్గిపోతున్న పరిస్థితుల్లో పదేళ్ల కాలానికి 8 శాతం వడ్డీ రేటు చెల్లింపు హామీ ఇవ్వడం అన్నది ఆకర్షణీయమైనదేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇందులో గరిష్ట పెట్టుబడికి పరిమితి ఉంది కనుక, ఒకరు పూర్తిగా దీనిపైనే ఆధారపడలేని పరిస్థితి ఉన్నట్టు చెబుతున్నారు.
సదుపాయాలు
ప్రతి నెలా లేదా మూడు నెలలు లేదా ఆరు నెలలు, ఏడాదికోసారి పెన్షన్ అందుకునే సౌలభ్యం ఉంది. ప్రతి నెలా పెన్షన్ కోరుకుంటే 8 శాతం, ఏడాదికోసారి పెన్షన్ ఆశిస్తే 8.3 శాతం వడ్డీ ప్రకారం రాబడి ఉంటుంది. ప్రతి నెలా పెన్షన్ వచ్చే ఆప్షన్ కోరుకుంటే కనీసం రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు దీనిపై రూ.1,000 పెన్షన్‌గా లభిస్తుంది. గరిష్టంగా రూ.7.50 లక్షలే ఇన్వెస్ట్ చేయడానికి వీలుంది.
అప్పుడు నెలవారీ పెన్షన్ రూ.5,000 వస్తుంది. అదే ఏడాదికోసారి పెన్షన్ రావాలనుకుంటే అప్పుడు కనీసం రూ.1,44,578 ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఏడాదికి రూ.12,000 చొప్పున పదేళ్ల పాటు చెల్లిస్తారు. గరిష్టంగా రూ.7,22,892 ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఏటా రూ.60,000 చొప్పున పదేళ్ల పాటు పెన్షన్ వస్తుంది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే... గరిష్ట పరిమితి పాలసీదారుడికి మాత్రమే పరిమితం కాదు. పాలసీదారుడి కుటుంబం మొత్తానికి గరిష్ట పరిమితి వర్తిస్తుంది. అంటే ఇన్వెస్ట్ చేసే వ్యక్తి, జీవిత భాగస్వామి, పిల్లల్ని కలిపి ఒక కుటుంబంగా పరిగణిస్తారు.
రుణం కూడా తీసుకోవచ్చు
ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఉన్న మరో సదుపాయం అవసరమైన సందర్భాల్లో రుణం తీసుకోవటం. కాకపోతే ఇందుకోసం మూడేళ్లు వేచి చూడాల్సి ఉం టుంది. పెట్టుబడి మొత్తంపై గరిష్టంగా 75 శాతం వరకు రుణంగా ఇస్తారు. వడ్డీ రేటు 10 శాతం.
వైదొలగటానికీ అవకాశం!
పథకం కాల వ్యవధి పదేళ్లు కాగా, ఈ లోపే తప్పుకునేందుకు ఒక్క అవకాశం ఉంది. పాలసీదారుడు లేదా వారి జీవిత భాగస్వామి ప్రాణాంతక వ్యాధుల బారినపడితే (ఏవన్నది నిర్వచించలేదు) పెట్టుబడి పెట్టిన మొత్తంలో 98 శాతాన్ని వెనక్కి ఇవ్వడం జరుగుతుంది.
అనుకూలమేనా..?
ఈ పథకంలో ఒక లోపం గరిష్ట పెట్టుబడిని రూ.7,50,000 పరిమితం చేయడమేనంటున్నారు విశ్లేషకులు. గరిష్ట పెట్టుబడిపై వచ్చే పెన్షన్ కేవలం రూ.5,000. రిటైర్ అయిన తర్వాత వృద్ధాప్యంలో ఎదురయ్యే ఖర్చులను ఈ మొత్తం తీర్చలేదు. రిటైర్ అయిన తర్వాత తమపై జీవిత భాగస్వామి, మరెవరైనా ఆధారపడి ఉంటే అధిక మొత్తంలో కావాల్సి ఉంటుంది. పైగా దీని గడువు పదేళ్లతో తీరిపోతుంది. ఆ తర్వాత మరో పథకం చూసుకోవాల్సిందే. ప్రస్తుతం మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వెంటనే తక్షణం పెన్షన్‌ను ఇచ్చే యాన్యుటీ పథకాలపై వడ్డీ రేటు 6–7 శాతం మించి లేదు.
ఆ ప్రకారం చూసుకుంటే వడ్డీ రేటు పరంగా ఈ పథకం మెరుగైనదే. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ రేటు కూడా 7.50 శాతం మించిలేదు. ఇక పోస్టాఫీసు అందించే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒక్కటే కొంచెం ఆశాజనకంగా కనిపిస్తోంది. ఈ పథకంలో ఒకరు గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. వడ్డీ వార్షికంగా 8.3 శాతం ఉంది. కాకపోతే కాల వ్యవధి ఐదేళ్లు మాత్రమే. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంది. నెలవారీ పెన్షన్ సదుపాయం ఇందులో లేదు. మూడు నెలలకోసారి మాత్రమే చెల్లిస్తారు. పైగా వయ వందన యోజనలో పదేళ్లూ వడ్డీ రేటు మారదు.
కానీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పథకంపై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షిస్తుంటుంది. ఇటీవలి కాలంలో ఇది క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో ఐదేళ్ల పాటు వడ్డీ రేటు మారదు. ఇన్వెస్ట్ చేసిన సమయంలో ఉన్న వడ్డీ రేటే అమలవుతుంది. కానీ, ఆ తర్వాత మరో మూడేళ్లకు పొడిగించుకునే సమయంలో అమల్లో ఉన్న వడ్డీ రేటే వర్తిస్తుంది. వయవందన యోజనలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడికి అవకాశం లేదు కనుక పరిమితి మేరకు ఇన్వెస్ట్ చేసుకుని, అదనంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ను ఎంచుకోవడాన్ని పరిశీలించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. లేదు కచ్చితంగా ప్రతీ నెలా ఆదాయం రావాలనుకుంటే వయవందన యోజనతోపాటు బీమా కంపెనీలు ఆఫర్ చేసే యాన్యుటీ పథకాలను పరిశీలించొచ్చు.