ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పదవీ విరమణ దశకు చేరుకునేవారే. ఆ తర్వాత జీవితం గురించి ప్లాన్ చేసుకునే వారు కొద్ది మందే కనిపిస్తారు. ఇక విశ్రాంత జీవిత అవసరాల పట్ల శద్ధ లేకపోవడం, ప్రస్తుత అవసరాలే ప్రాధాన్యంగా భావించే వారు చాలా మంది ఉన్నారు. కొందరిలో ఆసక్తి ఉన్నా, ఎంత మొత్తం కావాలన్న దానిపై సంశయం ఉండి ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత సాఫీ జీవనం కోసం జీవితంలో వివిధ దశల్లో ఏ మేరకు ఆదా చేయాలో నిపుణుల సూచనల ఆధారంగా తెలియజేసే కథనం ఇది.
రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోవాలి, జీవితంలో ఏ వయసులో ఎంత పొదుపు చేయాలి అన్నది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగానే ఉంటుంది. పలు రకాల వ్యయాలు, తమపై ఆధారపడిన వారి అవసరాలు, లక్ష్యాలు, ఇతర అవసరాలను ఇందుకు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తుల ఆర్థిక క్రమశిక్షణ అన్నది కూడా వేర్వేరుగానే ఉంటుందని తెలిసిందే. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి తన వేతనంలో రిటైర్మెంట్ జీవితం కోసం 5 శాతం కేటాయిస్తుంటే, ఆ తర్వాత పెరుగుతున్న వేతనం స్థాయిలో రిటైర్మెంట్ కోసం కేటాయింపులు పెంచాల్సిన అవసరం లేదని లాడర్7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేష్ సెడగోపన్ సూచించారు. ముందుగానే సేవింగ్స్ ప్రారంభించినందున కాంపౌండింగ్ ప్రయోజనంతో మంచి నిధి సమకూరుతుందని వివరించారు. అదే తొలినాళ్లలో రిటైర్మెంట్ నిధి గురించి పట్టించుకోకుండా చాలా ఆలస్యంగా పొదుపు ప్రారంభిస్తే చాలా పెద్ద మొత్తంలో పొదుపు చేయాల్సి ఉంటుందన్నారు.
చిన్న వయసులో ఉన్న వారి జీవన శైలి నేడు వినియోగమయంగా మారిపోయింది. దీంతో సేవింగ్స్ పట్ల వారిలో శ్రద్ధ తక్కువే. ఖరీదైన గ్యాడ్జెట్లు, రెస్టారెంట్ విందులు, ప్రతీ దానికీ రుణాలు ఇలా ఉంటోంది వారి తీరు. ఇక ఇల్లు కొనుగోలు, లేదా కారు కొనుగోలు లేదా పెళ్లిని వైభవంగా జరుపుకోవాలన్న ఆకాంక్షల కోసంఉద్యోగ తొలి దశలో ఎక్కువ ఖర్చు చేసే వారున్నారు. దీంతో రిటైర్మెంట్ ప్రణాళిక వారి ఎజెండాలో ఉండడం లేదు. అందుకే ఎంతన్న? సందేహాన్ని పక్కన పెట్టేసి వెంటనే వేతనంలో ఎంతో కొంత మొత్తాన్ని రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం ప్రారంభించాలని సురేష్ సెడగోపన్ సూచన. 25 ఏళ్ల వయసులో కనీసం 5 శాతం మేర రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం మొదలు పెట్టాలన్నది ఓ సూత్రం. అయితే, ఈ 5 శాతాన్ని పొదుపు చేయడం కంటే ఇన్వెస్ట్ చేయడం ముఖ్యమైన అంశంగా సెడగోపన్ పేర్కొన్నారు. చిన్న మొత్తమైనా చిన్న వయసులోనే మొదలు పెటాలి. కాంపౌండింగ్ పవర్‌తో రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంగా మారుతుందన్నది వాస్తవం.
మధ్య వయసులో: ఈ వయసులో బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. దీంతో బడ్జెట్‌పై ఒత్తిళ్లు పెరిగిపోతాయి. 35–45ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారు మంచి జీవన శైలిని కొనసాగించాలన్న ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ తరహా ఆలోచనలు, అవసరాల ప్రాధాన్యతలకు ప్రాముఖ్యం ఇవ్వడంతో, రిటైర్మెంట్‌కు ప్రాధాన్యం పక్కకు వెళ్లిపోతుంటుంది. ఆదాయంలో 20 శాతం పొదుపుతో ప్రారంభించి, వారి వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దాన్ని 40–50 శాతానికి క్రమంగా పెంచుకోవడం ఉత్తమం.
వ్యయాలకు తగిన ప్రణాళికలు...
35ఏళ్ల వయసులో ఉన్నవారు తమ రిటైర్మెంట్‌కు కనీసం 10 శాతం కేటాయించుకోవాలని సెడగోపన్ సూచించారు. 25 ఏళ్ల వయసులో 5 శాతంతో మొదలు పెట్టి 35 ఏళ్ల నాటికి 10 శాతానికి పెంచుకుంటే మంచిదని, ఈ పొదుపు శాతాన్ని కనీసం 50 ఏళ్ల వరకు అయిన కొనసాగించడం ద్వారా మంచి నిధిని సమకూర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈపీఎఫ్ చందాలను ఇందులోకి పరిగణనలోకి తీసుకోరాదని, అవి కాకుండానే ఈ మాత్రం రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకోవాలని సూచించారు. నిజానికి మధ్య వయసు నాటికి వేతనంలో గణనీయంగా పెరుగుదల ఉన్నప్పటికీ, ఆ వయసులో గృహ రుణం, పిల్లల విద్యా వ్యయాలు, బీమా ప్రీమియం చెల్లింపుల వంటి ఇతర అవసరాలు కూడా ఉంటాయి. అందుకే పెరిగే వేతనం స్థాయిలో రిటైర్మెంట్ కోసం పెంచుకోకపోయినా కనీసం 10 శాతమైన పక్కన పెట్టుకోవాలి. వేతనంలో రిటైర్మెంట్‌కు కేటాయింపులు పోను మిగిలిన మొత్తంలో 30 శాతాన్ని లక్ష్యాల కోసం పొదుపు చేసి, మిగిలిన మొత్తాన్ని ఇతర అవసరాల కోసం వినియోగించుకోవాలి.
పలు లక్ష్యాల కోసం ఎంత మేర ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకుని లార్జ్‌క్యాప్ లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసుకోవాలని నిపుణుల సూచన. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన అవసరాలు, లక్ష్యాలు ఉంటాయి. ఆ మేరకు వారివారి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు ప్రణాళి కలు రూపొందించుకోవాలి. వేసుకున్న ప్రణాళికకు కట్టుబడి ఉండాలి. ఇక రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్న వారికి వారి పిల్లల విద్యా సంబంధిత బాధ్యతలు కూడా ముగిసిపోవడం లేదా ముగింపులో ఉండడం చూడొచ్చు. దీంతో రిటైర్మెంట్ కోసం కొంచెం ఎక్కువ కేటాయించుకోవచ్చు. ఇది కూడా వ్యక్తులను బట్టి వేర్వేరుగానే ఉంటుంది. 30 చివర్లో లేదా 40కు సమీపంలో పెళ్లయిన వారికి పిల్లల విద్యా బాధ్యతలు ఇంకా ముగిసిపోయి ఉండవు. కొందరిలో రిటైర్మెంట్ తర్వాత బాధ్యతలు కొనసాగొచ్చు. అందుకే 50 ఏళ్లు దాటిన తర్వాత రిటైర్మెంట్ కోసం పొదుపును 15 శాతానికి పెంచుకోవాలని సెడగోపన్ సూచించారు. రిటైర్మెంట్ అయ్యే వరకు దీన్నే కొనసాగించాలన్నారు. దీనివల్ల మంచి నిధి సమకూరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment