విహార యాత్రకు ...సిప్‌ | How to plan investments? | Sakshi
Sakshi News home page

విహార యాత్రకు ...సిప్‌

Published Mon, Feb 11 2019 3:57 AM | Last Updated on Mon, Feb 11 2019 3:57 AM

How to plan investments? - Sakshi

నా వయస్సు 40 సంవత్సరాలు. నాకు బుద్ది మాంద్యం గల ఒక కొడుకున్నాడు. తన భవిష్యత్‌ అవసరాల నిమిత్తం  నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎలా ప్లాన్‌ చేసుకోవాలో సూచించండి?     –అరవింద్, విశాఖపట్టణం బుద్ది మాంద్యం గల బిడ్డ ఉంటే, ఆ బిడ్డ అవసరాల కోసం మీకు భవిష్యత్తులో భారీ మొత్తమే అవసరమవుతుంది. దీనికి గాను మీరు పెద్ద మొత్తంలోనే నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకని వీలైనంత అధికంగా ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేయండి. మార్కెట్‌ పతన సమయాల్లోనూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మీ తదనంతరం మీ బిడ్డ అవసరాలు సజావుగా తీరేలా ఉండాలంటే, మీరు పనిచేస్తున్నంత కాలమూ ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేస్తూనే ఉండండి. మీ తదనంతరం కూడా బిడ్డ బాగోగులు చూసుకోవడం కోసం ట్రస్ట్‌లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. నమ్మకమైన మిత్రులు, బంధువుల్లో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులను ట్రస్టీలుగా నియమించి మీరు ఏర్పాటు చేసిన నిధిని మీ కొడుకు కోసం ఉపయోగపడేలా చూడండి.  

నేను గత పదేళ్లుగా మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ, షేర్లలోనూ ఇన్వెస్ట్‌ చేస్తూ, 30 లక్షల వరకూ కూడబెట్టాను. ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనేది నా కల. గృహ రుణానికి సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వండి.    –సుధీర్, హైదరాబాద్‌  
ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు, పిల్లల ఉన్నత చదువుల కోసం ఒక ఫండ్‌ను నిర్మించుకోవడం... ఇవన్నీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు. ఈ తరహా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీల్లోనూ. మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లోనూ ఒక క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్‌ చేయాలి. ఇల్లు కొనుక్కోవాలనే లక్ష్యం కోసం రూ.30 లక్షలు కూడబెట్టడం మంచి విషయమే. ఇల్లు కొనే విషయంలో మీకు కొన్ని సూచనలు. మీరు ఆ ఇంట్లో నివసించాలనుకుంటేనే ఇల్లు కొనుగోలు చేయండి. ఇలా చేస్తే, మీకు అద్దె డబ్బులు ఆదా అవుతాయి. మీరు గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే రెండు ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది   గృహరుణానికి సంబంధించి మీరు చెల్లించే  నెలవారీ వాయిదా (ఈఎమ్‌ఐ) మీ నెలవారీ వేతనంలో మూడో వంతు దాటకుండా ఉండేలా చూసుకోండి. ఇక రెండో విషయం...మీరు ఇంటికి చెల్లించే డౌన్‌ పేమెంట్‌ మీరు కొనుగోలు చేసే గృహం విలువలో కనీసం 40% ఉండాలి. అంటే మీరు కొనే ఇంటి విలువ రూ.80 లక్షలుంటే, 40% మొత్తాన్ని.. అంటే రూ.32 లక్షల వరకూ డౌన్‌ పేమెంట్‌ చేస్తే, ఈఎమ్‌ఐ తక్కువగా ఉంటుంది.  ఈ రెండు విషయాలు పాటిస్తే,   గృహ రుణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పవచ్చు.

నా వయస్సు 41 సంవత్సరాలు. నేను గత పదేళ్ల నుంచే  ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. లిక్విడ్, ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌లో కలుపుకొని ఇప్పటివరకూ నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ మొత్తం రూ.10 లక్షల వరకూ అయ్యాయి. నాకు మరో ఐదేళ్ల వరకూ ఈ డబ్బులు అవసరం ఉండదు. ఈక్విటీ, డెట్‌ల్లో సరిసమానంగా వెయిటేజ్‌ ఉన్న బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా?  – రవీందర్, విజయవాడ  
మీరు ఇప్పటికే లిక్విడ్, ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉన్నారు. కాబట్టి మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు తగిన అవగాహన వచ్చి ఉంటుంది. బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో కంటే కూడా ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్‌ను ఎంచుకోండి. బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ కంటే కూడా ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్‌ సురక్షితమైనది. ఈ ఫండ్‌ తన కార్పస్‌లో మూడో వంతు వరకూ పూర్తిగా ఈక్విటీలోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. మీరు ఇన్వెస్ట్‌ చేసే మొత్తాన్ని కనీసం 12 సమ భాగాలు చేసి, ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఐదేళ్లలో మీరు ఈ ఫండ్‌ ద్వారా స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసిన దానికంటే అధిక రాబడులను పొందే అవకాశాలున్నాయి.  

కనీసం ఐదేళ్లకొకసారి కుటుంబంతో కలసి విహారయాత్రకు వెళ్లాలనేది నా ఆలోచన. దీనికోసం ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఎలా ప్లాన్‌ చేసుకోవాలో తెలపండి?    –కార్తీక్, బెంగళూరు  
కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లాలనే కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు వచ్చిపడే ఖర్చులతో ఉక్కిరిబిక్కిరి అవుతుండటమే కానీ విహార యాత్ర కోసం డబ్బులు వెచ్చించే వెసులుబాటు అందరికీ ఉండదు. జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తే, ఏదైనా సాధ్యమే. మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో పెట్టుబడులు పెడితే మీరు కోరుకుంటున్నట్లు కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లవచ్చు. విహార యాత్ర నిధిని ఏర్పాటు చేసుకోవడానికి సరళమైన, సులభమైన విధానం ఇది. ఏదైనా ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకుని ఆ ఫండ్‌లో సిప్‌ విధానంలో నెలకు ఎంతో కొంత మొత్తం  ఇన్వెస్ట్‌ చేస్తూ ఉండండి. కనీసం ఐదేళ్ల పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేస్తే, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు మీకు వస్తాయి. స్వల్పకాలంలో స్టాక్‌ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. ఈ ఒడుదుడుకుల కారణంగా మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్‌ ఆశించిన రాబడులు ఇవ్వకపోయినా, ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించండి.
ధీరేంద్ర కుమార్‌
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement