
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్‌ను చమురు ధరల సెగ ప్రభావితం చేయనుందని ప్రముఖ ఆర్థిక ఎనలిస్టులు సంస్థలు విశ్లేషిస్తున్నారు. ద్రవ్యోల్బణం, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత, కరెంట్ అకౌంట్ లోటుకు తోడు రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలు దేశీయ ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారనుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదల భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం కానుందని భావిస్తున్నారు. గురువారం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 80 డాలర్ల మార్క్‌ను అధిగమించి,2014 నవంబర్‌నాటి స్థాయిలను తాకిన సంగతి తెలిసిందే.
దేశీ ఇంధన అవసరాలకు సుమారు 80 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన 1,575 మిలియన్ బారెల్స్ ముడి చమురు దిగుమతి చేసుకునే ఇండియాకు సుమారు 1.6 బిలియన్ డాలర్లు (రూ .10 వేల కోట్లు) పెంచుతుందని కేర్ రేటింగ్స్ అంచనావేసింది. అధిక ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరగడంతో గృహాల వాస్తవిక ఆదాయాలు తగ్గిపోవచ్చని, అందువల్ల వినియోగదారుడి డివిజనల్ డిమాండ్ దెబ్బతింటుందని నోమురా విశ్లేషించింది. ఇదే అంశంపై జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వికె విజయకుమార్ మాట్లాడుతూ ఆర్‌బీఐ 2018 సంవత్సరానికి 68డాలర్లుగా అంచనావేయగా ముడి చమురు ధర ఏప్రిల్ నుంచి పది డాలర్ల మేర పెరిగిందన్నారు. బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు 80 డాలర్ల వద్ద ఉందనీ, ముడి చమురు ధరల్లో ప్రతి 10 డాలర్లు పెంపు, దేశంలో ద్రవ్యోల్బణం 10 బీపీఎస్ పాయింట్ల మేర పెరుగుతుందని వ్యాఖ్యానించారు. దీంతో దేశీయ కరెన్సీపై మరింత భారం పడుతుందని పేర్కొన్నారు.
దిగుమతుల బిల్లును డాలర్లలో చెల్లించాల్సి ఉండటంతో రూపాయి మరింత బలహీనపడే అవకాశముంది. మరోవైపు ఎగుమతులకంటే దిగుమతుల బిల్లే ఎక్కువ కావడం కూడా డాలర్లకు డిమాండుకు జోష్‌నిస్తుంది. ప్రధానంగా ముడిచమురు, డాలరు బలపడటం వంటి అంశాలు దేశ ఆర్థిక లోటుకు కారణమవుతుంది. అటు చమురు ధరల పెరుగుదలతో దేశీయంగా పెట్రోల్ ధరలు పెంపు అనివార్యం. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. మరోపక్క ఏప్రిల్ తరువాత డాలరుతో మారంకలో రూపాయి ఏకంగా రూ. 3 పతనం కావడం గమనార్హం. ఏప్రిల్‌లో డాలరుతో మారకంలో రూపాయి 65 స్థాయిలో ట్రేడ్ కాగా... ప్రస్తుతం రూపాయి 68 దిగువకు పతనమైంది.
కార్పొరేట్ లాభాల మార్జిన్లు భారీగా క్షీణించడంతో విమానయాన, పెయింటింగ్ , టైర్లు, ప్లాస్టిక్లు, రసాయనాలు, ఎరువులు, మైనపు, రిఫైనింగ్, పాదరక్షలు, సిమెంట్, లాజిస్టిక్స్ పరిశ్రమలను చమురు ధరల సెగ తాకనుంది. ఇన్‌పుట్ వ్యయాలు పెరగడంతో ఆయా ఉత్పత్తుల ధరలను భారీగా ప్రభావితం చేయనుంది. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతాయని విజయ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment