హెచ్‌యూఎల్‌కు గ్రామీణ మార్కెట్ల దెబ్బ
♦ నికర లాభంలో స్వల్ప వృద్ధి
♦ 5 శాతం పెరిగిన అమ్మకాలు
న్యూఢిల్లీ : ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలివర్ నికర లాభంపై గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ లేకపోవడం ప్రభావం చూపించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.1,059 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.1,057 కోట్ల నికర లాభం సాధించామని వివరించింది. గ్రామీణ మార్కెట్లో డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండడం వల్ల నికర లాభంలో పెద్ద మార్పు లేదని పేర్కొంది. అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే 4 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. గత క్యూ1లో రూ.7,571 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు 5 శాతం వృద్ధితో రూ.7,973 కోట్లకు పెరిగాయని వివరించింది.
మందగమనంగా ఉన్న పరిస్థితుల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో అమ్మకాలు ఆరోగ్యకరంగా ఉన్నాయని కంపెనీ చైర్మన్ హరీష్ మన్వాని చెప్పారు. నిర్వహణ మార్జిన్లు మెరుగుపడ్డాయని తెలిపారు. గ్రామీణ మార్కెట్లు పుంజుకోవడం, కమోడిటీ ధరలు ప్రస్తుతమున్న స్థాయిల్లోనే ఉండడం వంటి అంశాలపై భవిష్యత్ అమ్మకాలు ఆధారపడి ఉన్నాయని వివరించారు. లాభదాయకతను కొనసాగించడానికి వ్యయాలను నియంత్రించడం, మార్కెట్ అభివృద్ధి వంటి అంశాలపై దృష్టిసారిస్తున్నామని కంపెనీ సీఎఫ్‌ఓ పి. బి. బాలాజీ పేర్కొన్నారు. తమ మొత్తం అమ్మకాల్లో గ్రామీణ అమ్మకాలు 35 శాతమని వివరించారు. గత నెలలో మార్కెట్ల నుంచి ఉపసంహరించిన నోర్ బ్రాండ్ ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను తగిన ఆమోదాలు పొందిన తర్వాత మళ్లీ మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ 2.3 శాతం క్షీణించి రూ.891 వద్ద ముగిసింది.