హెచ్‌యూఎల్ లాభం 18% అప్
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో రూ.1,252 కోట్ల స్టాండెలోన్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.1,062 కోట్లతో పోలిస్తే లాభం 17.87 శాతం పెరిగింది. ప్రధానంగా క్యూ3లో కంపెనీ కొన్ని ఆస్తులను విక్రయించడం, ఉత్పాదక వ్యయాలు తగ్గుముఖం పట్టడం వంటివి లాభాల జోరుకు దోహదం చేశాయి.
ఆస్తుల అమ్మకం రూపంలో రూ.407 కోట్ల అసాధారణ ఆదాయం లభించినట్లు బీఎస్‌ఈకి వెల్లడించిన సమాచారంలో కంపెనీ తెలిపింది. హెచ్‌యూఎల్ మొత్తం ఆదాయం క్యూ3లో 7.69 శాతం ఎగసి రూ.7,037 కోట్ల నుంచి రూ.7,579 కోట్లకు చేరింది.
పట్టణ ప్రాంత అమ్మకాల్లో మందగమనం...
దేశీ మార్కెట్లో డిమాండ్ ఇంకా మందకొడిగానే ఉన్న నేపథ్యంలో మూడో తైమాసికంలో అమ్మకాల వృద్ధి కాస్త తగ్గిందని.. అయితే, ముడి చమురు ధరల భారీ పతనం కారణంగా ఉత్పాదక వ్యయాలు దిగొచ్చినట్లు హెచ్‌యూఎల్ సీఎఫ్‌ఓ పీబీ బాలాజీ చెప్పారు. పట్టణ ప్రాంత అమ్మకాలతో పోలిస్తే.. గ్రామీణ విక్రయాలు జోరందుకున్నాయన్నారు. మరోపక్క, ఈసారి చలికాలం ఆరంభం జాప్యం కావడం కూడా చర్మసంరక్షణ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం చూపినట్లు ఆయన తెలిపారు.
* క్యూ3లో సబ్బులు, డిటర్జెంట్ల విభాగ ఆదాయం 5.95% వృద్ధితో రూ.3,398 కోట్లకు చేరింది.
* పర్సనల్ ప్రొడక్టుల విభాగం నుంచి రూ.2,455 కోట్ల ఆదాయం సమకూరింది. క్రితం క్యూ3తో పోలిస్తే 6.53 శాతం పెరిగింది.
* పానీయాల విభాగం ఆదాయం 8.19 శాతం పెరిగి రూ.920 కోట్లకు చేరింది.
* ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తుల విభాగం 12.64 శాతం వృద్ధిచెంది రూ.420 కోట్లుగా నమోదైంది.
* డిసెంబర్ క్వార్టర్‌లో పన్ను చెల్లింపుల వ్యయాలు రెట్టింపై రూ.519 కోట్లకు ఎగబాకాయి.
5% పైగా పడిన షేరు..
మందకొడి అమ్మకాలు, ఫలితాలు మార్కెట్‌వర్గాల అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో కంపెనీ షేరు ధర సోమవారం బీఎస్‌ఈలో 5.27 శాతం క్షీణించి రూ.892.80 వద్ద ముగిసింది. ఈ ఒక్కరోజులోనే హెచ్‌యూఎల్ మార్కెట్ విలువలో రూ. 10,740 కోట్లు ఆవిరైంది. రూ.1,93,133 కోట్లకు పడిపోయింది. మరోపక్క, ఈ నెలలో ఇప్పటిదాకా 24% షేరు ఎగబా కడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కూడా షేరు పతనానికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు.