భాగ్యనగరి నం:1
రియల్టీ పెట్టుబడుల్లో ఆసియా పసిఫిక్ రీజియన్‌లో తొలి స్థానంలో హైదరాబాద్
♦ వాణిజ్య, కార్యాలయాల విభాగాల అభివృద్ధే ఇందుకు కారణం
♦ రెండో స్థానంలో బ్యాంకాక్; 6, 7వ స్థానాల్లో బెంగళూరు, ముంబయి
♦ 2017లో 611 బిలియన్ డాలర్ల పెట్టుబడులొస్తాయని అంచనా
♦ రీట్స్, రెరా, జీఎస్‌టీ, బినామీ చట్టాలతో రియల్టీలో పారదర్శకత
హైదరాబాద్.. రియల్టీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆసియా పసిఫిక్ రీజియన్ (ఏపీఏసీ) లోనే తొలిస్థానం కైవసం చేసుకుంది. ఏపీఏసీ నగరాల జాబితాలో బ్యాంకాక్, మనీలా, గ్యాంగ్‌జూ వంటివి ఉన్నాయ్! మన దేశంలో అయితే బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లూ ఉన్నాయ్!! అయినా సరే భాగ్యనగరమే ప్రపంచ ఇన్వెస్టర్లను కట్టిపడేసిందని.. నగరంలో వాణిజ్య, కార్యాలయాల విభాగాల అభివృద్దే ఇందుకు కారణమని ప్రాపర్టీ కన్సల్టెన్సీ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ‘బెట్టింగ్ ఆన్ ఆసియా పసిఫిక్ నెక్ట్స్ కోర్ సిటీస్’ నివేదిక తెలిపింది.
సాక్షి, హైదరాబాద్:
ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల కారణంగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రాంగూడ, మాదాపూర్, కొండాపూర్ వంటి పశ్చిమ ప్రాంతాల్లో వాణిజ్య, కార్యాలయాల సముదాయాలకు డిమాండ్ బాగుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, ఒరాకిల్, ఉబర్, ఐబీఎం, పొలారిస్, డెలాయిట్ వంటి సంస్థలు తమ కార్యకలాపాల కోసం నగరాన్ని ఎంచుకున్నాయి. కొన్ని సంస్థలు విస్తరణ ప్రణాళికల్లోనూ హైదరాబాద్‌కే ప్రాధాన్యమిస్తున్నాయి. నగరానికి చెందిన నిర్మాణ సంస్థలతో పాటూ పొరుగు రాష్ట్రాల్లోని దివ్య శ్రీ డెవలపర్స్, సాలార్పూరియా సత్వా, ఎంబసీ, ఆర్‌ఎంజీ కార్ప్, ప్రెస్టీజ్, కల్పతరు వంటి సంస్థలు నగరంలో నివాస, వాణిజ్య సముదాయాలకు శ్రీకారం చుట్టాయి.
ప్రధాన నగరంలో నెమ్మది..
ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు కారణంగా తూర్పు ప్రాంతాల్లోనూ వాణిజ్య, ఆఫీసు స్థలాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఉప్పల్, హబ్సిగూడ, రామాంతపూర్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాల్లో స్థానిక డెవలపర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే నగర ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హిమాయత్‌నగర్ వంటి ప్రైమ్ ఏరియాలు కేవలం వాణిజ్య సముదాయాలకే పరిమితమవుతున్నాయి. అవి కూడా రిటైల్, మల్టిప్లెక్స్‌లకే. ఉత్తర, తూర్పు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలో ఆఫీసు సముదాయాల విపణి నెమ్మదించింది.
నెలకు అద్దె చ.అ. రూ.45–60..
తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, ఇతర రాష్ట్రాలతో కనెక్టివిటీ.. ఇవీ పెట్టుబడిదారులను కట్టిపడేస్తున్న ప్రధాన అంశాలు. వీటికి తోడు మెరుగైన మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరలు, అపారమైన మానవ వనరులు, శాంతి భద్రతలు అదనపు అంశాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ట్రెడా) జనరల్ సెక్రటరీ బి. సునీల్ చంద్రారెడ్డి ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ‘‘హైదరాబాద్‌లో గ్రేడ్–ఏ భవన సముదాయంలో నెలకు అద్దె చ.అ. రూ.45–60 మధ్య ఉంటుంది. అదే బెంగళూరు, చెన్నై నగరాల్లో అయితే రూ.85కు పైమాటే. ముంబై, ఎన్‌సీఆర్‌లో అయితే అంతకంటే ఎక్కువే ఉంటుందని’’ వివరించారు. నిర్మాణంలో ఆధునికత వినియోగంతో పాటూ స్థానిక ఆర్కిటెక్ట్‌లు అంతర్జాతీయ డిజైన్లను రూపొందిస్తున్నారు. అందుకే సాధారణ భవనాలతో పాటూ స్టెప్ట్, పిరమిడ్ ఆకారంలోనూ నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి.
వాణిజ్య స్థలం కొనేముందు..
⇔ వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయంన, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి.
⇔ ఒక ప్రాంతంలో కట్టే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశముందా అనే విషయాన్ని బేరీజు వేయాలి.
⇔ భవనాన్ని నిర్మించే డెవలపర్ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది.
⇔ మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగానికి ఆస్కాముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.
⇔ మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.
⇔ వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం భీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి.
ఈ ఏడాది 611 బిలియన్ డాలర్లకు..
2017 తొలి త్రైమాసికంలో ఆసియా పసిఫిక్ రీజియన్‌లో రియల్టీ పెట్టుబడులు 136 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ముగింపు నాటికివి 611 బిలియన్ డాలర్లకు చేరుతాయని కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ నివేదిక అంచనా వేసింది. మన దేశ గణాంకాలను పరిశీలిస్తే.. 2016లో స్థిరాస్తి రంగంలో 6 బిలియన్ డాలర్లు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి. 2015లో ఇవి 4.8 బిలియన్ డాలర్లు. అంటే ఏడాదిలో 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం సంవత్సరంలో వాణిజ్య, ఆఫీసు విభాగాల్లోని డీల్స్, వాటాలు, విలువలను గమనిస్తుంటే.. 2017లోనూ ఇదే తరహా వృద్ధిని సాధిస్తుందని నివేదిక అంటోంది.
అందరి దృష్టీ మన దేశం వైపు ఎందుకంటే?
అయితే ఒక్కసారిగా దేశీయ స్థిరాస్తి రంగం ఆసియా పసిఫిక్ రీజియన్ (ఏపీఏసీ)లో గుర్తింపు రావటానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలేనని నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్స్), రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), బినామీ ట్రాన్సాక్షన్ చట్టం వంటివి స్థిరాస్తి రంగంలో పారదర్శకతను తీసుకొచ్చిందని.. దీంతో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయని కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ రీసెర్చ్ సర్వీస్ సీనియర్ డైరెక్టర్ సిద్దార్థ్ గోయల్ తెలిపారు.
⇔ ఏపీఏసీలో కేవలం ఇండియాలో మాత్రమే కార్యాలయాల సముదాయాలకు డిమాండ్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. గత మూడేళ్లుగా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 32–35 మిలియన్ చ.అ. వాణిజ్య స్థలాలు లీజు, కొనుగోలు లావాదేవీలు జరిగాయి. ఇందులో ఐటీ, బీపీఎం రంగాల వాటా 52–55 శాతం. గతేడాది ఈ రంగాల వాటా 65–70 శాతం. ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు నగరాలతో పాటూ ద్వితీయ శ్రేణి మార్కెట్లయిన చెన్నై, హైదరాబాద్, పుణెల్లోనూ పారిశ్రామిక, ఈ–కామర్స్, గిడ్డంగుల మార్కెట్ అభివృద్ధి చెందుతోంది. ఏపీఏసీలోనే పెట్టుబడుల ఆకర్షణలో హైదరాబాద్ తొలిస్థానంలో నిలవటమే ఇందుకు ఉదాహరణ.
6, 7వ స్థానాల్లో బెంగళూరు, ముంబయి..
ఏపీఏసీలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఈ ఏడాది వాణిజ్య, ఆఫీసు విభాగాల్లో ప్రపంచ పెట్టుబడులు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, హైదరాబాద్, పుణె, ముంబై నగరాలకే ఎక్కువగా వచ్చాయి. అయితే ర్యాంకింగ్‌లను గమనిస్తే మాత్రం.. బెంగళూరు, ముంబైలో 6, 7వ స్థానాల్లో నిలిచాయి. పుణె, చెన్నై, ఢిల్లీ నగరాలైతే వరుసగా 8, 9, 10వ స్థానాలకు పరిమితమయ్యాయి.
⇔ రెండు, మూడో స్థానంలో బ్యాంకాక్, మనీలా నగరాలు నిలవగా.. చైనాకు చెందిన గ్యాంగ్‌జూ, శెన్‌జైన్ నగరాలు వరుసగా 4, 5వ స్థానాల్లో నిలిచాయి.