సింగపూర్‌పై హైదరాబాదీల ఆసక్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతీయులకు, ముఖ్యంగా హైదరాబాదీయులకు సింగపూర్‌పై అమితాసక్తి ఉందని, ఏటా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యే దీనికి నిదర్శనమని ఆ దేశానికి చెందిన ఛాంగీ ఎయిర్‌పోర్ట్ తెలిపింది. సెప్టెంబర్‌తో ముగిసిన 12 నెలల కాలంలో ఇండియా నుంచి సింగపూర్‌కి వచ్చిన ప్రయాణికుల సంఖ్యలో 7.5 శాతం వృద్ధి నమోదైతే, హైదరాబాద్ నుంచి 10.45 శాతం వృద్ధి నమోదైనట్లు ఛాంగీ ఎయిర్‌పోర్ట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (కార్ప్‌కామ్) రాబిన్ ఘో తెలిపారు.
ఛాంగీ ఎయిర్‌పోర్ట్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాబిన్ మాట్లాడుతూ గత 12 నెలల కాలంలో ఇండియా నుంచి 33.68 లక్షల మంది సింగపూర్‌కి వస్తే, ఒక్క హైదరాబాద్ నుంచే 1.69 లక్షల మంది వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇండియా నుంచి విదేశాలకు ప్రయాణించే నగరాల్లో సింగపూర్ రెండో స్థానంలో ఉంటే, ఛాంగీ ఎయిర్‌పోర్టుకు వస్తున్న విదేశీయుల సంఖ్యలో భారత్ ఏడో స్థానంలో ఉందన్నారు. ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్యలో రెండు నుంచి 3% వృద్ధి అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
భారీ విస్తరణ...: పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని కొత్తగా రెండు టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, పాత టెర్మినల్స్‌ను ఆధునీకరిస్తున్నట్లు రాబిన్ తెలిపారు. ప్రస్తుతం మూడు టెర్మినల్ సామర్థ్యం 6.6 కోట్లుగా ఉండగా, విస్తరణ తర్వాత 2018 నాటికి సామర్థ్యం 8.5 కోట్లకు చేరుతుందన్నారు. 1.6 కోట్ల ప్రయాణికుల సామర్థ్యంతో టెర్మినల్4 ను రూ. 4,680 కోట్లతో (485 మిలియన్ సింగపూర్ డాలర్లు) విస్తరిస్తున్నామని ఇది 2017 కల్లా అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుత టెర్మినల్ 1ను సుమారు రూ. 7,200 కోట్లతో (1.5 బిలియన్ సింగపూర్ డాలర్లు) ఆధునీకరిస్తున్నామని, దీనికి సంబంధించిన పనులు వచ్చే నెలలో ప్రారంభమై 2018 నాటికి పూర్తవుతాయని చెప్పారు. 2020కల్లా టెర్మినల్ 5 పనులు పూర్తి చేయాలనేది లక్ష్యమన్నారు.