Changi Airport
-
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్‌గా యుద్ధ విమానాలు
భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోంది.దేశవ్యాప్తంగా మంగళవారం ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యింది. తాజాగా తాజాగా మధురై నుంచి సింగపూర్ వెళ్లిన ఎయిరిండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది.విమానం సింగపూర్‌కు బయలుదేరిన తర్వాత విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు ఈ-మెయిల్ వచ్చింది.ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 684కి ఈ బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని చాంగీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ముందు విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా మళ్లించడానికి సింగపూర్ భద్రతా దళాలకు చెందిన రెండు ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి. ఎయిరిండియా విమానానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించి విమానాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లాయి.కాగా, ఈ బెదిరింపుల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు పౌర విమానయాన భద్రతా సంస్థ భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీల సాయం కోరింది. బాధ్యులను కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎయిరిండియా విమానానికి సింగపూర్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా రావడంపై సింగపూర్ రక్షణ మంత్రి ఎన్జీ ఎంగ్ హెన్ స్పందించారు. ఎయిరిండియా విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లడానికి రెండు ఆర్ఎస్ఏఎఫ్ ఎఫ్-15ఎస్జీలు రంగంలోకి దిగాయని తెలిపారు. విమానాన్ని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లాయని, చివరకు విమానం చాంగీ విమానాశ్రయంలో రాత్రి (మంగళవారం) 10:04 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎక్స్ వేదికగా ప్రకటించారు.కాగా దేశవ్యాప్తంగా మంగళవారం 7 విమానాలకు బాంబు బెదిరింపు ఎదురయ్యింది. ఢిల్లీ నుంచి షికాగో వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని కెనడాలోని ఓ విమానాశ్రయానికి మళ్లించి తనిఖీ చేశారు. అలాగే జైపూర్ నుంచి అయోధ్య మీదుగా బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం, దర్భంగా నుంచి ముంబయి వెళ్లే స్పైస్‌జెట్ విమానం, బాగ్డోగ్రా నుంచి బెంగళూరు వెళ్లే ఆకాశ ఎయిర్ విమానం, దమ్మం(సౌదీ అరేబియా) నుంచి లక్నవూ వెళ్లే ఇండిగో విమానం, అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ అలయన్స్ ఎయిర్ విమానం, మదురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. -
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇదే..
ఆమ్‌స్టర్‌డ్యాం: ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితా 2017లో సింగపూర్‌లోని చాంగీ విమానాశ్రయం మరోసారి టాప్‌లో నిలిచింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ జాబితాలో చాంగీ విమానాశ్రయం వరుసగా ఐదోసారి టాప్‌లో నిలవడం గమనార్హం. లక్షలాది మంది విమాన ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించి రూపొందించిన ఈ జాబితాను ఇటీవల ఆమ్‌స్టర్‌డ్యాంలో విడుదల చేశారు. దీనిపై చాంగీ ఎయిర్పోర్ట్ సీఈవో లి సివో హియాంగ్ స్పందిస్తూ.. స్కైట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డ్‌ను వరుసగా ఐదోసారి గెలుచుకోవడం చాంగీ ఎయిర్పోర్ట్ కమ్యూనిటీకి మరింత ప్రోత్సాహాన్నిస్తుందన్నారు. ఈ జాబితాలో టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండోస్థానంలో నిలిచింది. కాగా, అమెరికా విమానాశ్రయాల్లో సిన్సినాటి(నార్తర్న్ కెంటకీ) విమానాశ్రయం అత్యుత్తమంగా 26వ ర్యాంకులో నిలిచింది. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అందించే సేవలు, పరిశుభ్రత, అహారం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని స్కైట్రాక్స్ రూపొందించిన జాబితాలో టాప్ 10 లో నిలిచినవి ఇవి... 1. సింగపూర్ చాంగీ విమానాశ్రయం 2. టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(జపాన్) 3. ఇంచియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(సియోల్, దక్షిణ కొరియా) 4. మ్యూనిచ్ ఎయిర్పోర్ట్(జర్మనీ) 5. హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 6. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(దోహా, ఖతార్) 7. చుబు సెంట్రెయిర్ నగొయా(జపాన్) 8. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్(స్విట్జర్లాండ్) 9. లండన్ హీత్రూ విమానాశ్రయం 10. ఫ్రాంక్‌ఫర్డ్ ఎయిర్పోర్ట్(జర్మనీ) -
తెరపైకి మరో సోషల్ మీడియా ’అణుబాంబ్’!?
పాకిస్థానీ నీలికళ్ల కుర్రాడు రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇస్లామాబాద్‌లో ఓ మూలన టీ అమ్ముకునే అర్షద్ ఖాన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోవడంతో ఒక్కసారిగా అతని దశ తిరిగిపోయింది. అమ్మాయిలు అతని ఫొటోను తెగ షేర్ చేసుకున్నారు. దాంతో నిన్నమొన్నటి వరకు చాయ్ అమ్ముకున్న ఈ 18 ఏళ్ల కుర్రాడిని ఏకంగా మోడలింగ్ చాన్స్ వరించింది. ప్రముఖ దుస్తుల కంపెనీకి మోడలింగ్ బ్రాండ్‌గా నియమించుకుంది. నీలికళ్ల ఓరచూపుతో చాయ్ కాస్తున్న అర్షద్ ఫొటో తీసి.. జియా అలీ అనే ఫొటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పెట్టగా.. భారత్ చేసిన సర్జికల్ దాడులకు పాకిస్థాన్ బదులు ఇదిగో అంటూ దాయాది దేశపు నెటిజన్లు అతని ఫొటోను భారీగా షేర్ చేసుకున్నారు. పీవోకేలో భారత్ సర్జికల్ దాడులకు ప్రతీకారంగా ఈ నీలికళ్ల ’అణుబాంబ్’ భారతీయ అమ్మాయిలపై సర్జికల్ దాడులు చేస్తాడంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు.. అచ్చం నీలికళ్ల అర్షద్ రీతిలోనే సింగపూర్‌కు చెందిన ‘అణుబాంబ్’ తెరపైకి వచ్చాడు. పేరు లీ మిన్వీ. వయస్సు 22 ఏళ్లు. సింగపూర్‌లోని చాంగీ ఎయిర్పోర్ట్ భద్రత వ్యవహారాలను చూసే సెర్టిస్ సిస్కో సంస్థలో సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్నాడు. విమానాశ్రయ భద్రతాధికారిగా పనిచేస్తున్న అతని గుణగణాలను వివరిస్తూ తాజాగా చాంగీ ఎయిర్పోర్ట్ తన ఫేస్బుక్ పేజీలో అతని ఫొటో పెట్టింది. వెంటనే అతని ఫొటో వైరల్‌గా మారిపోయింది. వందలాది మంది అమ్మాయిలు అతని ఫొటోను షేర్ చేసుకుంటూ... అతని ముగ్ధమోహన అందాన్ని చూసి ఫిదా అయిపోతున్నారు. సహజంగానే సింగపూర్ పర్యాటక ప్రాంతం. కానీ సింగపూర్‌నే కాదు.. ఈ చూడచక్కని కుర్రాడ్ని చూసేందుకు కూడా తాము సింగపూర్‌కు వస్తామని పలువురు అమ్మాయిలు కామెంట్ పెడుతున్నారు. సోషల్ మీడియాతోపాటు అమ్మాయిల హృదయాలను కూడా మిన్వీ తన రామసక్కనిరూపుతో వెలిగించాడని ఓ అమ్మాయి వ్యాఖ్యానించగా.. అమ్మాయిల కోసం చాంగీ ఎయిర్‌పోర్ట్‌లోని అతను ఏ టెర్మినల్‌లో పనిచేస్తాడు? ఏ షిఫ్ట్‌లో ఉంటాడో తెలియజేయాలని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. -
నిజంగానే ‘జ్యువెల్’
ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా పేరుతెచ్చుకున్న సింగపూర్ చాంగీ విమానాశ్రయంలో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ డిజైన్ ఇది. భవిష్యత్తు టెర్మినల్‌గా నిపుణులు అభివర్ణిస్తున్న ఈ ‘జ్యువెల్’ టెర్మినల్ నిర్మాణానికి రూ.7 వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు. పది అంతస్తుల అద్దాల టెర్మినల్‌లో 5 అంతస్తులు భూగర్భంలో ఉంటాయి. మధ్యలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇండోర్ వాటర్‌ఫాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ఎత్తు 130 అడుగులు. రాత్రి సమయంలో ఇది రెయిన్బో తరహాలో రంగుల్లో మెరిసిపోతుందట.. ఇక లోపల ఏ మూల చూసినా ప్రకృతి పరుచుకున్నట్లు కనిపిస్తుంది. భారీ వృక్షాలు, మొక్కలతో అత్యద్భుతమైన పార్కును ఏర్పాటు చేస్తున్నారు. బస నిమిత్తం 130 గదుల హోటల్ కూడా ఉంది. ఇంకా అనేక అత్యాధునిక సదుపాయాలుంటాయని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు. 2018లో ఈ టెర్మినల్ ప్రారంభమవుతుంది. -
సింగపూర్‌పై హైదరాబాదీల ఆసక్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతీయులకు, ముఖ్యంగా హైదరాబాదీయులకు సింగపూర్‌పై అమితాసక్తి ఉందని, ఏటా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యే దీనికి నిదర్శనమని ఆ దేశానికి చెందిన ఛాంగీ ఎయిర్పోర్ట్ తెలిపింది. సెప్టెంబర్‌తో ముగిసిన 12 నెలల కాలంలో ఇండియా నుంచి సింగపూర్‌కి వచ్చిన ప్రయాణికుల సంఖ్యలో 7.5 శాతం వృద్ధి నమోదైతే, హైదరాబాద్ నుంచి 10.45 శాతం వృద్ధి నమోదైనట్లు ఛాంగీ ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (కార్ప్‌కామ్) రాబిన్ ఘో తెలిపారు. ఛాంగీ ఎయిర్పోర్ట్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాబిన్ మాట్లాడుతూ గత 12 నెలల కాలంలో ఇండియా నుంచి 33.68 లక్షల మంది సింగపూర్‌కి వస్తే, ఒక్క హైదరాబాద్ నుంచే 1.69 లక్షల మంది వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇండియా నుంచి విదేశాలకు ప్రయాణించే నగరాల్లో సింగపూర్ రెండో స్థానంలో ఉంటే, ఛాంగీ ఎయిర్‌పోర్టుకు వస్తున్న విదేశీయుల సంఖ్యలో భారత్ ఏడో స్థానంలో ఉందన్నారు. ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్యలో రెండు నుంచి 3% వృద్ధి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భారీ విస్తరణ...: పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని కొత్తగా రెండు టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, పాత టెర్మినల్స్‌ను ఆధునీకరిస్తున్నట్లు రాబిన్ తెలిపారు. ప్రస్తుతం మూడు టెర్మినల్ సామర్థ్యం 6.6 కోట్లుగా ఉండగా, విస్తరణ తర్వాత 2018 నాటికి సామర్థ్యం 8.5 కోట్లకు చేరుతుందన్నారు. 1.6 కోట్ల ప్రయాణికుల సామర్థ్యంతో టెర్మినల్4 ను రూ. 4,680 కోట్లతో (485 మిలియన్ సింగపూర్ డాలర్లు) విస్తరిస్తున్నామని ఇది 2017 కల్లా అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుత టెర్మినల్ 1ను సుమారు రూ. 7,200 కోట్లతో (1.5 బిలియన్ సింగపూర్ డాలర్లు) ఆధునీకరిస్తున్నామని, దీనికి సంబంధించిన పనులు వచ్చే నెలలో ప్రారంభమై 2018 నాటికి పూర్తవుతాయని చెప్పారు. 2020కల్లా టెర్మినల్ 5 పనులు పూర్తి చేయాలనేది లక్ష్యమన్నారు.