తెరపైకి మరో సోషల్ మీడియా ’అణుబాంబ్’!?
పాకిస్థానీ నీలికళ్ల కుర్రాడు రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇస్లామాబాద్‌లో ఓ మూలన టీ అమ్ముకునే అర్షద్ ఖాన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోవడంతో ఒక్కసారిగా అతని దశ తిరిగిపోయింది. అమ్మాయిలు అతని ఫొటోను తెగ షేర్ చేసుకున్నారు. దాంతో నిన్నమొన్నటి వరకు చాయ్ అమ్ముకున్న ఈ 18 ఏళ్ల కుర్రాడిని ఏకంగా మోడలింగ్ చాన్స్ వరించింది. ప్రముఖ దుస్తుల కంపెనీకి మోడలింగ్ బ్రాండ్‌గా నియమించుకుంది.
నీలికళ్ల ఓరచూపుతో చాయ్ కాస్తున్న అర్షద్ ఫొటో తీసి.. జియా అలీ అనే ఫొటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పెట్టగా.. భారత్ చేసిన సర్జికల్ దాడులకు పాకిస్థాన్ బదులు ఇదిగో అంటూ దాయాది దేశపు నెటిజన్లు అతని ఫొటోను భారీగా షేర్ చేసుకున్నారు. పీవోకేలో భారత్ సర్జికల్ దాడులకు ప్రతీకారంగా ఈ నీలికళ్ల ’అణుబాంబ్’ భారతీయ అమ్మాయిలపై సర్జికల్ దాడులు చేస్తాడంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఇప్పుడు.. అచ్చం నీలికళ్ల అర్షద్ రీతిలోనే సింగపూర్‌కు చెందిన ‘అణుబాంబ్’ తెరపైకి వచ్చాడు. పేరు లీ మిన్‌వీ. వయస్సు 22 ఏళ్లు. సింగపూర్‌లోని చాంగీ ఎయిర్‌పోర్ట్ భద్రత వ్యవహారాలను చూసే సెర్టిస్ సిస్కో సంస్థలో సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్నాడు. విమానాశ్రయ భద్రతాధికారిగా పనిచేస్తున్న అతని గుణగణాలను వివరిస్తూ తాజాగా చాంగీ ఎయిర్‌పోర్ట్ తన ఫేస్‌బుక్ పేజీలో అతని ఫొటో పెట్టింది. వెంటనే అతని ఫొటో వైరల్‌గా మారిపోయింది. వందలాది మంది అమ్మాయిలు అతని ఫొటోను షేర్ చేసుకుంటూ... అతని ముగ్ధమోహన అందాన్ని చూసి ఫిదా అయిపోతున్నారు.
సహజంగానే సింగపూర్ పర్యాటక ప్రాంతం. కానీ సింగపూర్‌నే కాదు.. ఈ చూడచక్కని కుర్రాడ్ని చూసేందుకు కూడా తాము సింగపూర్‌కు వస్తామని పలువురు అమ్మాయిలు కామెంట్ పెడుతున్నారు. సోషల్ మీడియాతోపాటు అమ్మాయిల హృదయాలను కూడా మిన్‌వీ తన రామసక్కనిరూపుతో వెలిగించాడని ఓ అమ్మాయి వ్యాఖ్యానించగా.. అమ్మాయిల కోసం చాంగీ ఎయిర్‌పోర్ట్‌లోని అతను ఏ టెర్మినల్‌లో పనిచేస్తాడు? ఏ షిఫ్ట్‌లో ఉంటాడో తెలియజేయాలని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.