హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విక్రయాలు @: 1.5 లక్షలు
న్యూఢిల్లీ: హ్యుందాయ్ ఇలీట్ ఐ20 కారు దేశీయంగా 1.5 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది. హ్యుందాయ్ కార్లపై వినియోగదారులకున్న నమ్మకానికి ఈ ఘనత ఒక నిదర్శనమని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. గత ఏడాది మార్చిలో ఈ కారును మార్కెట్లోకి తెచ్చామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. భారత ప్రీమియం కాంపాక్ట్ సెగ్మెంట్‌లో 66% మార్కెట్ వాటాను సాధించామని వివరించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందిన విశిష్టమైన భారత తయారీ కారు ఇదని పేర్కొన్నారు. ప్రీమియం కాంపాక్ట్ సెగ్మెంట్‌లో మారుతీ సుజుకీ బాలెనో, హోండా జాజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో కార్లకు హ్యుందాయ్ ఇలీట్ ఐ20 కారు గట్టిపోటీనిస్తోంది. హ్యుందాయ్ దేశీయంగా 10 మోడళ్లను విక్రయిస్తోంది.