లండన్: తాను సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా, హిమాచల్ సీఎం వీరభద్రసింగ్‌ల మాదిరి రాజకీయ బాధితుడినని లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా అన్నారు. బ్యాంకులకు వేల కోట్ల రుణాల ఎగవేతకేసులో విచారణ ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్న మాల్యా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా వాద్రా, వీరభద్రసింగ్‌లను టార్గెట్ చేసిందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మాల్యా ప్రస్తావించారు. భారత్‌లో జైళ్ల పరిస్థితి అమానవీయంగా ఉంటుందని కూడా పేర్కొన్నారు.
బ్లూసూట్, టైతో కోర్టు హాల్‌లోకి వచ్చిన మాల్యా ప్రశాంతంగా కనిపించారు. తనకు ఎదురుపడిన మీడియా ప్రతినిధులతో కోర్టులోపలకి వచ్చి విచారణను గమనించండి అని కోరారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని తోసిపుచ్చారు.మరోవైపు మాల్యా ప్రకటనను ఈడీ తోసిపుచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలను దీటుగా ఎదుర్కోలేక కేసును తప్పుదారిపట్టించేలా దృష్టి మరల్చేందుకు మాల్యా ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. రుణాల ఎగవేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాల్యా మార్చి 2016లో భారత్ నుంచి అదృశ్యమై బ్రిటన్‌లో తలదాచుకున్నారు.
మాల్యా అప్పగింత కేసుపై విచారణ జరుగుతున్న క్రమంలో భారత్‌లో జైళ్ల పరిస్థితి దయనీయంగా ఉంటుందనే వాదనను తెరపైకి తీసుకువచ్చారు. మాల్యాపై నమోదైన కేసు వివరాలు, పూర్తి ఆధారాలను సీబీఐ, ఈడీలు కోర్టుకు సమర్పించాయి.
Comments
Please login to add a commentAdd a comment