ఐఏఏ చైర్మన్, వరల్డ్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ స్వామి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్స్.. ఇదీ సింపుల్‌గా అడ్వర్టయిజింగ్ మాధ్యమాల వరుస క్రమం! కానీ ఇపుడు ఈ జాబితాలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చేరుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్రాండ్లు ఏఐ ఆధారిత ప్రకటనలపై పరిశోధన చేస్తున్నాయని, కొన్ని సంస్థలు త్వరలోనే దేశంలో మొబైల్ ఆధారిత ఏఐ ప్రకటనల్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించే సంకేతాలున్నాయని ఇంటర్నేషనల్ అడ్వర్టయిజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) చైర్మన్, వరల్డ్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ స్వామి చెప్పారు.
ఏఐతో మొబైల్ అడ్వర్టయిజింగ్ మోసాలకు అడ్డుకట్టపడుతుందని.. అందుకే ఈ విభాగం శరవేగంగా ఏఐ వైపు మళ్లుతోందని చెప్పారాయన. కొచ్చిలో జరగనున్న 44వ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్ వివరాలను గురువారమిక్కడ విలేకరులకు తెలిపారు. ‘‘ఏఐ ప్రకటనలతో వేగం, పారదర్శకతతో పాటు ప్రకటనల కమ్యూనికేషన్‌ను ఎడిట్ చేసుకునే వీలుంటుంది. వీక్షకుల మానసిక స్థితి, ముఖ కవళికలను బట్టి ప్రకటనలను అందించవచ్చు. వయస్సు, లింగ భేదం వంటివి కూడా శోధించి అందుకు తగిన యాడ్స్ వస్తాయి. ఈ ప్రకటనలతో సమయం, డబ్బు వృథా జరగదు’’ అని వివరించారు.
రూ.61,878 కోట్లకు ప్రకటనల పరిశ్రమ..
ప్రస్తుతం దేశీయ ప్రకటనల పరిశ్రమ పరిమాణం రూ.61,878 కోట్లుగా ఉందని.. ఇందులో రూ.14 వేల కోట్లు డిజిటల్ మీడియం వాటా అని తెలియజేశారు. ఏటా 10.62 శాతం వృద్ధి రేటుతో 2021 నాటికి ప్రకటనల పరిశ్రమ 82,250 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. మొత్తం పరిశ్రమలో టెలివిజన్, ప్రింట్ వాటా 70 శాతం, డిజిటల్ వాటా 17 శాతం వరకుంటుంది.
కొచ్చిలో ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్..
ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్‌కు తొలిసారిగా మన దేశం ఆతిథ్యం ఇస్తోంది. ఫిబ్రవరి 20–22 తేదీల్లో కొచ్చిలో జరిగే ఈ సదస్సులో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, యూనీలీవర్ సీఈఓ పాల్ పోలెమన్, క్వాల్‌కామ్ సీఈఓ స్టీవెన్ మోల్లిన్‌కోఫ్, యూఐడీఏఐ మాజీ చైర్మన్ నందన్ నిలేకనీ, సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ సీఈఓ రాజీవ్ మిశ్రా తదితరులు పాల్గొంటారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఏఏకు ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో చాప్టర్లుండగా, ఇండియాలో 300 మంది సభ్యులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment