
ఫండ్స్ ఫేవరెట్ షేరు ఐసీఐసీఐ
రెండో స్థానానికి ఇన్ఫోసిస్
- క్యూ4లో పెట్టుబడుల తీరిది
- ఈ కాలంలో 13% ఎగసిన బ్యాంకు షేరు
న్యూఢిల్లీ: గడిచిన క్వార్టర్(జనవరి-మార్చి)లో దేశీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఐసీఐసీఐ బ్యాంకు షేరును పెట్టుబడులకు అత్యధికంగా ఎంపిక చేసుకున్నాయి. దీంతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ విషయంలో వెనకబడినట్లు ఒక నివేదిక పేర్కొంది. మార్చి చివరికల్లా ఈక్విటీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో చోటుచేసుకున్న ఐసీఐసీఐ బ్యాంకు షేర్ల విలువ రూ. 9,152 కోట్లను తాకింది. ఇదే సమయంలో ఫండ్స్ వద్ద ఉన్న ఇన్ఫోసిస్ స్టాక్స్ విలువ రూ. 7,339 కోట్లకు పరిమితమైంది. పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్ రీసెర్చ్ సంస్థ మార్నింగ్‌స్టార్ రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.
దీని ప్రకారం డిసెంబర్ చివరికి ఈక్విటీ ఫండ్స్ వద్ద ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ల విలువ రూ. 8,194 కోట్లుకాగా, ఇన్ఫోసిస్ షేర్ల ఫోలియో విలువ రూ. 9,262 కోట్లుగా నమోదైంది. వెరసి ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ఫండ్స్ ఫేవరెట్‌గా నిలిచింది. ఇందుకు ఐసీఐసీఐ షేరు విలువ పుంజుకోవడానికి దోహదపడింది. ఈ కాలంలో ఐసీఐసీఐ షేరు 13%పైగా ఎగసిన సంగతిని ఈ సందర్భంగా మార్నింగ్‌స్టార్ ప్రస్తావించింది. నిజానికి ఈ కాలంలో ఈక్విటీ ఫండ్స్ వద్ద ఉన్న ఐసీఐసీఐ షేర్ల సంఖ్య తగ్గినప్పటికీ, మార్కెట్ విలువరీత్యా పెట్టుబడుల విలువలో మొదటి స్థానాన్ని పొందడం విశేషం!
5% జారిన ఇన్ఫీ
క్యూ4లో ఇన్ఫోసిస్ షేరు 5%పైగా క్షీణించింది. కంపెనీని వృద్ధి బాట పట్టించేందుకు గతేడాది జూన్‌లో కంపెనీ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్ నారాయణ మూర్తిని తిరిగి చైర్మన్‌గా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు దేశీ సాఫ్ట్‌వేర్ రంగ వృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చిన ఇన్ఫోసిస్ ప్రస్తుతం అత్యున్నతస్థాయి అధికారుల రాజీనామాలతో సవాళ్లను ఎదుర్కొంటోంది.
గత రెండేళ్లలో కంపెనీ నుంచి 9 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వైదొలగిన విషయం విదితమే. ఇటీవల ఇతర పోటీ కంపెనీలకు మార్కెట్ షేరును సైతం కోల్పోతూ వస్తోంది కూడా. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో డాలర్ల రూపేణా ఆదాయం 7-9% స్థాయిలో పుంజుకోవచ్చునంటూ కంపెనీ అంచనా(గెడైన్స్)ను ప్రకటించింది. అయితే ఇది ఐటీ పరిశ్రమ వృద్ధిపై నాస్కామ్ వేసిన 13-15% అంచనాలకంటే తక్కువే కావడం గమనార్హం.