16 శాతం తగ్గిన ఐసీఐసీఐ లాభం
న్యూఢిల్లీ: ప్రైవేట్‌రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 16 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.3,122 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.2,611 కోట్లకు తగ్గిందని ఐసీఐసీఐ తెలిపింది. అయితే మొత్తం ఆదాయం రూ.25,585 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.27,876 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
స్టాండోలోన్ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం రూ.3,018 కోట్ల నుంచి 19 శాతం తగ్గి రూ.2,442 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.17,563 కోట్ల నుంచి స్వల్పంగా క్షీణించి రూ.17,556 కోట్లకు పడిపోయిందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.5,453 కోట్ల నుంచి రూ.5,363 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం రూ.4,217 కోట్ల నుంచి రూ.3,939 కోట్లకు తగ్గినట్లు తెలిపింది.
ఫీజు ఆదాయం రూ.2,261 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.2,495 కోట్లకు పెరిగిందని వివరించింది. డిపాజిట్లు 14 శాతం వృద్ధితో రూ.4,65,284 కోట్లకు పెరిగాయని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు ఫలితంగా డిసెంబర్ క్వార్టర్లో కరెంటు, సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లు రూ. 26,705 కోట్ల మేర పెరిగాయని బ్యాంకు తెలిపింది. నికర మొండి బకాయిలు రూ.16,483 కోట్ల నుంచి రూ.20,155 కోట్లకు చేరాయని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 0.6 శాతం తగ్గి రూ.269 వద్ద ముగిసింది.