ముంబై: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎండీ, సీఈవో చందా కొచర్‌పై విచారణ జరపాలని ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించింది. ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని బ్యాంకు బోర్డు తీర్మానించింది. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై బోర్డు చర్చించి... స్వతంత్ర ఎంక్వైరీకి ఆదేశించినట్లు బుధవారం స్టాక్ ఎక్స్చేంజీలకు ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేసింది. ‘స్వతంత్రమైన, విశ్వసనీయమైన వ్యక్తి సారథ్యంలో ఈ విచారణ జరుగుతుంది‘ అని వివరించింది. వాస్తవాలను పరిశీలించి, అవసరమైతే ఫోరెన్సిక్స్ దర్యాప్తు, ఈమెయిల్స్‌ను సమీక్షించడం, సంబంధిత వ్యక్తుల స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేయడం మొదలైన అంశాలతో విచారణ సమగ్రంగా ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం తగిన వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యతను ఆడిట్ కమిటీకి బోర్డు అప్పగించింది. కొన్నాళ్ల క్రితమే క్విడ్ ప్రో కో ఆరోపణలు వచ్చినప్పుడు కొచర్ ఎలాంటి తప్పూ చేయలేదని, ఆమెపై పూర్తి నమ్మకం ఉందని బాసటగా నిల్చిన ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు... తాజాగా విచారణకు ఆదేశించడం గమనార్హం. తన కుటుంబీకులకు లబ్ధి చేకూర్చేలా కొందరు ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుస్తూ బ్యాంకు సీఈవో హోదాలో చందా కొచర్ క్విడ్ ప్రో కో లావాదేవీలు జరిపారని, బ్యాంకు నైతిక నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు రావడం తెలిసిందే.
వివాదమిదీ..: తన భర్త దీపక్ కొచర్‌కి చెందిన న్యూపవర్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా.. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరు విషయంలో చందా కొచర్ వ్యవహరించినట్లు ఆరోపణలొచ్చాయి. రుణం లభించినందుకు ప్రతిగా వీడియోకాన్ గ్రూప్ అధిపతి వేణుగోపాల్ ధూత్.. న్యూపవర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. వీడియోకాన్ తీసుకున్న ఈ రుణాలు మొండిబాకీలుగా మారాయి. మరోవైపు, ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు రవి రూయా అల్లుడు నిశాంత్ కనోడియాకి చెందిన ఫస్ట్‌ల్యాండ్ హోల్డింగ్స్ నుంచి కూడా 2010లో న్యూపవర్‌లోకి రూ. 325 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అదే ఏడాది ఎస్సార్ స్టీల్ మినెసోటాకి ఐసీఐసీఐ బ్యాంకు సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం 530 మిలియన్ డాలర్ల రుణమిచ్చింది. ఇది కూడా ప్రస్తుతం మొండిబాకీగా మారడం సందేహాలకు తావిస్తోంది. ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్ కార్యకలాపాలపై 2016లో ఆర్‌బీఐ విచారణ కూడా జరిపింది.
చందా కొచర్‌పై ఐసీఐసీఐ యూటర్న్
Published Thu, May 31 2018 1:46 AM | Last Updated on Thu, May 31 2018 8:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment