ఆసుపత్రిలో క్లెయిమ్ కష్టమేం కాదు!
♦ క్యాష్‌లెస్ చికిత్సకు జాగ్రత్తలు తప్పనిసరి
♦ నెట్‌వర్క్ ఆసుపత్రి కాకుంటే రీయిఇంబర్స్‌మెంటే
♦ క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి బీమా కంపెనీల చర్యలు
♦ 4 గంటల్లోనే పరిష్కరించేలా ఐసీఐసీఐ లాంబార్డ్ సెంట్రల్ వ్యవస్థ
అందరికీ కావాల్సిందిపుడు ఆరోగ్యమే. ఒంట్లో ఏదైనా సమస్య వస్తే దాన్ని తట్టుకోవటం మామూలు మనుషుల వల్ల అయ్యేపని కాదు. కాబట్టి ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకే ఇపుడు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులతో పాటు సొంత వ్యాపారాలు చేసుకునేవారు, వృత్తి నిపుణులు... ఆఖరికి రిటైరైన వారు కూడా ఏదో ఒక ఆరోగ్య బీమా పాలసీని ఆశ్రయించకతప్పటం లేదు. ఇక పాలసీలు తీసుకునేవారు పెరుగుతుండటంతో వారిని ఆకట్టుకోవటానికి బీమా కంపెనీలూ పోటీ పడుతున్నాయి. కొత్త పథకాలతో పాటు మెరుగైన సేవలపైనా దృష్టి సారిస్తున్నాయి.
వీటన్నిటితో పాటు తమ కస్టమర్లకు క్లెయిమ్‌లు సమస్యగా మారకుండా జాగ్రత్త పడుతున్నాయి. గంటల వ్యవధిలోనే క్లెయిమ్స్ పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఐసీఐసీఐ లాంబార్డ్ గరిష్టంగా 4 గంటల్లోనే క్యాష్‌లెస్ క్లెయిమ్‌లను పరిష్కరించేలా హైదరాబాద్‌లో కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం పనితీరును వివరించడంతో పాటు, ఇబ్బందులేవీ లేకుండా వేగంగా క్లెయిమ్స్ ఆమోదం పొందడానికి ఏం చేయాలన్నది ఐసీఐసీఐ లాంబార్డ్ ప్రతినిధులు ‘సాక్షి ప్రాఫిట్ ప్లస్’కి వివరించారు. ఆ వివరాలు మీకోసం...
వైద్య బీమా ఉంటే చాలు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా వైద్య చికిత్స పొందే అవకాశముంది. ఎందుకంటే ఇప్పుడు చాలా బీమా కంపెనీలు వాటి నెట్‌వర్క్ హాస్పిటల్స్ పరిధిలో క్యాష్‌లెస్ చికిత్సను అందిస్తున్నాయి. కీలకమైన సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లెయిమ్ ప్రక్రియ సులువుగా పూర్తి చేయడానికి పలు బీమా కంపెనీలు సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుండగా... మరికొన్ని కంపెనీలు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) ద్వారా క్లెయిమ్స్‌ను పరిష్కరిస్తున్నాయి.
క్లెయిమ్... రెండు రకాలు
ఆరోగ్య బీమాలో క్లెయిమ్స్‌ను ప్రధానంగా రెండు రకాలుగా... అంటే క్యాష్‌లెస్, రీయింబర్స్‌మెంట్‌గా విభజిస్తారు. క్యాష్‌లెస్ విధానమైతే బీమా కంపెనీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న హాస్పిటల్స్‌లో చేరితే ఎటువంటి నగదు లేకుండా చికిత్స పొందవచ్చు. ఒకవేళ అత్యవసర సమయంలో నెట్‌వర్క్ ఆసుపత్రిలో కాకుండా దగ్గర్లోని వేరే ఏదైనా ఆసుపత్రిలో చేరితే ముందుగా చికిత్సా వ్యయాన్ని మనం భరించాల్సి ఉంటుంది. తర్వాత ఈ మొత్తాన్ని రీయింబర్స్‌మెంట్ విధానంలో వెనక్కి తెచ్చుకోవచ్చు. క్లెయిమ్ చేసేటపుడు పాలసీదారులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందీ లేకుండా వేగంగా ఈ ప్రక్రియను ముగించొచ్చుననేది బీమా కంపెనీల మాట. క్యాష్‌లెస్, రీయింబర్స్‌మెంట్ విధానాల్లో ఎలా వ్యవహరించాలో చూస్తే...
క్యాష్‌లెస్: దీన్ని కూడా రెండు రకాలుగా విభజిస్తారు. ముందస్తు ప్రణాళికతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే కేసులు కొన్ని ఉంటే, అప్పటికప్పుడు అత్యవసరంగా చికిత్స కోసం చేరేవి మరికొన్ని.
ముందే తెలిస్తే...
చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరాల్సి ఉంటుందని ముందే తెలిసిన సందర్భాల్లో... అంటే డెలివరీ, కొన్ని శస్త్రచికిత్సల క్లెయిమ్ విషయంలో బీమా కంపెనీని ముందే సంప్రదించడం ఉత్తమం. క్లెయిమ్ కోసం బీమా కంపెనీని సంప్రదించే ముందు మీరు చేయాల్సిందల్లా..
► క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ కోసం నెట్‌వర్క్ హాస్పిటల్‌ను ఎంపిక చేసుకోవడం.
► హాస్పిటల్‌లో చేరాలనుకుంటున్న రోజు కంటే కనీసం రెండు మూడు రోజుల ముందే ఆ హాస్పిటల్‌లో అపాయింట్‌మెంట్ తీసుకోవటం.
► ఇందుకోసం మీ ఇన్సూరెన్స్ వివరాలు, చికిత్స కోసం చేరుతున్న వ్యక్తి ఐడీ కార్డు వంటి వివరాలు ఆసుపత్రికి ఇవ్వటం.
► అప్పుడు హాస్పిటల్ సిబ్బంది ఆ చిక్సితకు ఎంత ఖర్చవుతుందో లెక్కించి క్లెయిమ్ కోసం బీమా కంపెనీ లేదా టీపీఏని సంప్రదిస్తారు.
►హాస్పిటల్ నుంచి రిక్వెస్ట్ వచ్చాక బీమా కంపెనీ అన్ని వివరాలనూ పరిశీలిస్తుంది. ఇదే కీలకమైన ప్రక్రియ. మీరు తీసుకునే చికిత్స బీమా పరిధిలోకి వస్తుందా.. రాదా? వస్తే బీమా పరిహారంపై ఏమైనా పరిమితులున్నాయా? అన్న విషయాలను పరిశీలిస్తుంది.
►సాధారణంగా ఈ పరిశీలన కార్యక్రమాన్ని గరిష్టంగా 2 నుంచి 4 గంటలలోపే కంపెనీలు పూర్తి చేస్తాయి.
►అన్నీ సక్రమంగా ఉంటే క్యాష్‌లెస్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అనుమతిస్తాయి. ఒకవేళ చికిత్సా వ్యయంపై ఏమైనా పరిమితులు ఉంటే... వాటి కారణాలను తెలుపుతూ.. ఎంత మొత్తానికి క్యాష్‌లెస్ చికిత్సను అందిస్తారో తెలియజేస్తాయి.
►బీమా కంపెనీ నుంచి అనుమతి లభించగానే రూపాయి కట్టకుండానే హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందవచ్చు.
►కొన్ని సందర్భాల్లో క్యాష్‌లెస్ ఫెసిలిటీకి తిరస్కరించినట్లయితే... మొత్తం క్లెయిమ్‌నే తిరస్కరించినట్లు భావించనక్కర్లేదు.
►అలాంటి సందర్భాల్లో హాస్పిటల్‌లో సొంత డబ్బుతో చికిత్స చేయించుకొని ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు వెళ్లొచ్చు.
అత్యవసర సమయాల్లో..
ప్రమాదాలు, హార్ట్‌ఎటాక్ వంటి సమయాల్లో అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. ఇలాం టపుడు కూడా క్యాష్‌లెస్ సౌకర్యాన్ని పొందవచ్చు. అదెలాగంటే...
► అత్యవసర చికిత్స కోసం నెట్‌వర్క్ హాస్పిటల్‌కు మాత్రమే వెళ్లాలి.
►చికిత్స అవసరమైన వ్యక్తి బీమా వివరాలు, ఐడీ కార్డు, ఇతర వివరాలు ఇవ్వాలి.
► ఈ వివరాలను హాస్పిటల్ సిబ్బంది వెంటనే బీమా కంపెనీకి తెలియచేస్తారు.
► అవసరమైతే మీరు కూడా బీమా కంపెనీ లేదా టీపీఏను సంప్రదించి అత్యవసర పరిస్థితిని తెలియచేయొచ్చు.
► ఇలాంటి కేసుల్లో బీమా కంపెనీలు సాధ్యమైనంత తొందరగా క్యాష్‌లెస్ చికిత్సకు అనుమతిస్తాయి.
► కొన్ని అత్యవసర కేసుల్లో టీపీఏ అనుమతి రాకుండానే చికిత్సను ప్రారంభిస్తాయి కూడా.
► సాధారణంగా అర్ధరాత్రి సమయాల్లో చేరినప్పుడు అనుమతుల జారీలో ఆలస్యం జరుగుతుంది.
► ఇటువంటి సమయంలో చికిత్స చేయడానికి కంపెనీ అభ్యంతరం పెట్టదు.
► ఒకవేళ క్యాష్‌లెస్ క్లెయిమ్ తిరస్కరిస్తే నగదు చెల్లించి చికిత్స చేయించుకొని ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు దాఖలు చేయొచ్చు.
రీయింబర్స్‌మెంట్..
కొన్నిసార్లు నెట్‌వర్క్ పరిధిలో లేని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. అలాంటి కేసులకు కూడా బీమా పరిహారం లభిస్తుంది. కానీ, క్యాష్‌లెస్ ఫెసిలిటీ లభించదు. ఇలాంటప్పుడు ముందుగా చికిత్సా వ్యయాన్ని మనమే భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రీ-ఇంబర్స్‌మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాంటి కేసుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఏడు రోజుల లోగా క్లెయిమ్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ ఫారంతో పాటు డిశ్చార్జి కాగితాలు, ఆసుపత్రి బిల్లులు, డయాగ్నొస్టిక్ రిపోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది.
గుర్తుంచుకోండి...
► అన్ని వ్యాధుల చికిత్సకూ బీమా రక్షణ ఉండదు. క్లెయిమ్ దరఖాస్తు చేసే ముందు ఆ చికిత్సకు బీమా పరిహారం ఉందో లేదో పరిశీలించండి.
► గ్రూపు ఇన్సూరెన్స్‌లో క్లెయిమ్‌కు దరఖాస్తు చేస్తున్నప్పుడు ప్రధాన పాలసీదారుడి గుర్తింపు కార్డుతో పాటు, చికిత్స తీసుకునే కుటుంబ సభ్యుడి గుర్తింపు కార్డు కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది.
► క్యాష్‌లెస్ క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకునేటప్పుడు చికిత్సకు సంబంధించిన రిపోర్టులను స్కాన్ చేసి పంపిస్తే సరిపోతుంది.
► రీయింబర్స్‌మెంట్ సమయంలో బిల్లులు, డిశ్చార్జి సమ్మరీ ఇవ్వాల్సి ఉంటుంది.
► ఒరిజినల్ పత్రాలు ఇచ్చేటప్పుడు వాటి ఫొటో కాపీలు ఉంచుకోవడం మర్చిపోవద్దు.