న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంబంధించి సోమవారం కేంద్రం గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాలు ఊరట నిచ్చాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి జనవరిలో 7.5 శాతంగా నమోదయ్యింది (డిసెంబర్‌లో 7.1 శాతం). 2017 జనవరిలో 3.5 శాతం.
అయితే పారిశ్రామిక ఉత్పత్తి జనవరిలో భారీగా పెరిగినా, ఆర్థిక సంవత్సరం మొదటి నుంచీ ఇప్పటి వరకూ చూస్తే, నిరాశలోనే ఉంది. వృద్ధి రేటు 5 శాతం నుంచి 4.1 శాతానికి పడిపోయింది. ఇక వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ట స్థాయిలో 4.4 శాతంగా నమోదయ్యింది. మరింత విశ్లేషిస్తే...
పరిశ్రమలకు తయారీ ఊరట...
♦ మొత్తం ఐఐపీలో దాదాపు 78 శాతం వాటా ఉన్న తయారీ రంగం జనవరిలో మంచి పురోగతి చూపించడం మొత్తం గణాంకాలపై సానుకూల ప్రభావం చూపింది. ఈ విభాగంలో వృద్ధి 8.7%గా నమోదయ్యింది. 2017 జనవరిలో ఈ పెరుగుదల శాతం కేవలం 2.5 శాతమే. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకూ చూస్తే, (2017 ఏప్రిల్ నుంచీ) ఈ విభాగంలో వృద్ధి 4.8% నుంచి 4.3%కి పడిపోయింది. జనవరిలో తయారీ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానుకూల వృద్ధిని నమోదచేసుకున్నాయి.
♦ కేపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సూచిక అయిన ఈ విభాగంలో జనవరిలో వృద్ధిరేటు 0.6%(2017 జనవరిలో) భారీగా 14.6%కి ఎగసింది.
♦ మైనింగ్: ఈ రంగంలో మాత్రం జనవరిలో వృద్ధి భారీగా పడిపోయింది. ఈ రేటు 8.6 శాతం నుంచి 0.1 శాతానికి చేరింది. ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో కూడా ఈ రేటు 4.8 శాతం నుంచి 2.5 శాతానికి పడిపోయింది.
♦ విద్యుత్: విద్యుత్ రంగంలో వృద్ధి జనవరిలో 5.1 శాతం నుంచి 7.6 శాతనికి పెరిగినా, ఏప్రిల్ నుంచీ జనవరి మధ్య మాత్రం ఈ రేటు 6.3 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది.
♦ వినియోగ వస్తువులు: సబ్సులు, టూత్ పేస్ట్‌లు వంటి ఎఫ్‌ఎంజీసీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) వస్తువులు ప్రధాన భాగంగా ఉండే కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ వృద్ధి రేటు 9.6 శాతం నుంచి 10.5 శాతానికి పెరిగింది. అయితే ఫ్రిజ్‌లు, ఎయిర్ కండీషన్లు వంటి డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తుల వృద్ధి భారీగా 8 శాతం పెరిగింది. 2017 ఇదే నెలలో ఈ ఉత్పత్తుల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా, మైనస్ 2శాతం క్షీణత నమోదయ్యింది.
రిటైల్ ధరల ఊరట...
రిటైల్ ధరల విషయానికి వస్తే, జనవరిలో 5.07 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 4.44 శాతానికి తగ్గింది. నవంబర్‌లో ఇంత తక్కువగా (4.88) ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఇందులో మొత్తం ఐదు విభాగాలనూ వేర్వేరుగా చూస్తే...
♦ ఆహారం, పానీయల ధరలు 3.38 శాతం పెరిగాయి.
♦ పాన్, పొగాకు, ఇతర హానికారక వినియోగ వస్తువుల ధరలు 7.34 శాతం ఎగశాయి.
♦ దుస్తులు, పాదరక్షల విషయంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల 5 శాతం.
♦ హౌసింగ్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 8.28 శాతం.
♦ ఇంధనం–లైట్ విభాగంలో రేటు 6.80 శాతం.
కూరగాయలు భారమే...
ఆహారం, పానీయల విభాగాన్ని విశ్లేషిస్తే... జనవరిలో కూరగాయల ధరలు భారీగా 17.57 శాతం ఎగశాయి. అయితే డిసెంబర్‌లో ఈ రేటు ఇంకా భారీగా 26.97 శాతంగా ఉంది. గుడ్ల ధరలు 8.51 శాతం ఎగశాయి. పండ్ల ధరలు 4.80 శాతం పెరిగాయి. తక్కువగా ధరలు పెరిగిన వస్తువుల్లో తృణ ధాన్యాలు (2.10 శాతం), మాంసం, చేపలు (3.31 శాతం), పాలు, పాలపదార్థాలు (3.83 శాతం), ఆయిల్స్, ఫ్యాట్స్ (1.09 శాతం) ఉన్నాయి.
ఆల్కాహాల్‌యేతర పానీయాల ధరలు 1.34 శాతం పెరిగితే, ప్రిపేర్డ్ మీల్స్ ధరలు (స్నాక్స్, స్వీట్స్ కాకుండా) 4.47 శాతం పెరిగాయి. ఇక పప్పు ధాన్యాల ధరలు అసలు పెరక్కపోగా, – 17.34 శాతం తగ్గాయి. ధరలు తగ్గిన ఉత్పత్తుల్లో చక్కెర (–0.26 శాతం), సుగంధ ద్రవ్యాలు (–1.01 శాతం) ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment