
దుబాయ్: అరబ్ దేశాల ఆర్ధిక పరిస్థితికి సంబంధించి ఐఎమ్‌ఎఫ్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ క్రమంలో అరబ్ దేశాల ఆర్థిక వృద్ధి మందగమనానికి నిరుద్యోగం, సామాజిక ఉద్రిక్తతలు ఆజ్యం పోస్తున్నాయని ఐఎమ్‌ఎఫ్ సోమవారం తెలిపింది. నివేదిక ప్రకారం ఉత్తర ఆఫ్రికా (మెనా) నెమ్మదిగా వృద్ధి చెందడానికి అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, చమురు ధరల అస్థిరత, బ్రెక్సిట్ ప్రక్రియ ఆలస్యం కావడం ప్రధాన కారణాలని వెల్లడించింది. సౌదీ అరేబియా, ఇరాన్ యూఏఈ లాంటి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. కాగా, ఐఎమ్‌ఎఫ్ డైరెక్టర్ జిహాద్ అజహర్ మాట్లాడుతూ మద్య ఆసియాలో వృద్ధి రేటు తగ్గడానికి నిరుద్యోగమే ప్రధాన కారణమని చెప్పారు. నిరుద్యోగం కారణంగానే సామాజిక ఉద్రిక్తతలు నెలకొన్నాయని నివేదిక స్పష్టం చేసింది.
ఈ ప్రాంతలలో నిరుద్యోగం సగటున 11 శాతం కొనసాగుతుండగా ఇతర అభివృద్ధి ఆర్థిక వ్యవస్థలలో 7 శాతం అని తెలిపింది. 18శాతంగా ఉన్న మహిళలు, యువత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో తోడ్పాటును అందించడం లేదని తెలిపింది. అరబ్ దేశాల రుణ భారం గణనీయమైన స్థాయిలో పెరగగా, ఈ ప్రభావం పెట్టుబడులను ఆకర్షించడంలో అడ్డంకులు సృష్టించవచ్చని పేర్కొంది. ఇరాన్ పై అమెరికా ఆంక్షల కారణంగా తీవ్ర ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటుందని తెలిపింది. ఈ దేశాల ఆర్ధిక వ్యవస్థల బలోపేతానికి చమురు నిల్వలతో పాటు వేగవంతమైన సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మరోవైపు సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ దేశాల వృద్ధి రేటు 2018లో 2శాతం ఉండగా ప్రస్తుత సంవత్సరం ఆయిల్ ధరల తగ్గడం వలన కేవలం 0.7శాతం నమోదవుతుందని తెలిపింది.