‘మొండిబకాయిల’ పరిష్కారానికి కొంత సమయం: ఎస్‌అండ్‌పీ
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారం, రుణ వృద్ధికి మరికొంత సమయం పడుతుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ బుధవారం పేర్కొంది. ఈ మేరకు సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ‘ఆర్థికాభివృద్ధి అంశాలు బాగున్నప్పటికీ, బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్య పరిష్కారానికి మరి కొంత సమయం’ అన్న ప్రధాన అంశంపై ఈ నివేదిక రూపొందింది. సంస్థ క్రెడిట్ ఎనలిస్ట్ అమిత్ ఈ అంశాలను వెల్లడించారు. ముఖ్యాంశాలు...
- మైనింగ్, మౌలిక రంగంలో ఇబ్బందులు మొండి బకాయిలు, రుణ వృద్ధి మందగమన సమస్యలకు కారణాలు. ఈ సమస్యల పరిష్కారంతో బ్యాంకుల ‘రుణ’ నాణ్యతా మెరుగుపడుతుంది.
- కీలక రంగాల పురోగతితో కంపెనీల అదాయాలు పెరుగుతాయి. ఇది మొండి బకాయిల సమస్య పరిష్కారానికి దోహదపడుతుంది.
- అయితే మొండిబకాయిల సమస్య దీర్ఘకాలం కొనసాగడం మంచిదికాదు. దీనివల్ల ఆర్థిక రంగంలో ఇబ్బందులు తీవ్రమయ్యే అవకాశం ఉంది.
- అభివృద్ధి, సమర్థవంతమైన పాలన తత్సబంధ అంశాలపై మోడీ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఈ హామీలను నెరవేర్చడం వృద్ధి బాటలో కీలకం.