తొలిసారి 30వేలకు పైన సెన్సెక్స్
Published Wed, Apr 26 2017 4:13 PM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM
వరుసగా మూడో సెషన్ లోనూ ఈక్విటీ బెంచ్ మార్కులు లాభాల జోరు కొనసాగించాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్, ఆటో, ఎఫ్‌ఎమ్సీజీ స్టాక్స్ మద్దతుతో సెన్సెక్స్ మొదటిసారి 30వేల మార్కు పైన ముగిసింది. ఇటు నిఫ్టీ సైతం రికార్డు క్లోజింగ్ నమోదుచేసింది. సెన్సెక్స్ 190.11 పాయింట్ల ర్యాలీ జరిపి 30,133.35 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా.. నిఫ్టీ 45.25 పాయింట్ల లాభంలో 9,351.85 వద్ద ముగిసింది. గ్లోబల్ అవుట్ లుక్ మెరుగ్గా ఉండటం, స్ట్రాంగ్ కార్పొరేట్ ఫలితాలు మార్కెట్ల సెంటిమెంట్ ను బలపర్చాయి. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల తొలి రౌండ్లో సెంట్రిస్ట్ అభ్యర్థి మాక్రన్ విజయం సాధించడంతో సోమవారం ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు జోష్‌వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అటు అమెరికా సహా ఇటు ఆసియా వరకూ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి.
ఆసియన్ స్టాక్స్ వరుసగా ఐదు రోజుల నుంచి లాభాలను ఆర్జించగా.. వాల్ స్ట్రీట్ కూడా కొత్త శిఖరాలను తాకింది. ఇటు దేశీయ మార్కెట్ల లాభాల జోరు, అంతర్జాతీయంగా అనుకూల సంకేతాలతో రూపాయి కూడా మాంచి జోష్ లో కొనసాగింది. డాలర్ తో రూపాయి మారకం విలువ తొలిసారి రూ.64 స్థాయిని బ్రేక్ చేసి 20 నెలల గరిష్టాన్ని తాకింది. అనంతరం మార్కెట్ చివర్లో 18 పైసల లాభంలో 64.09 వద్ద ముగిసింది. మరో ఒక్క రోజులో అక్షయ తృతీయ వేడుక కావడంతో ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కొంత కోలుకున్నాయి. 60 రూపాయల నష్టంతోనే 28,754 రూపాయలుగా నమోదయ్యాయి.
Advertisement
Advertisement