భారత్తో మరో వెయ్యేళ్ల బంధం మాది..! | In India For Next 1000 Years, Apple's Tim Cook Tells | Sakshi
Sakshi News home page

భారత్తో మరో వెయ్యేళ్ల బంధం మాది..!

Published Sat, May 21 2016 1:33 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

భారత్తో మరో వెయ్యేళ్ల బంధం మాది..! - Sakshi

భారత్తో మరో వెయ్యేళ్ల బంధం మాది..!

నేను ఇక్కడివాడినేనన్న అనుభూతి కలుగుతోంది...
సెకండ్ హ్యాండ్ ఫోన్లను కూడా విక్రయిస్తాం..
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడి

న్యూఢిల్లీ: ‘భారత్‌ను చరిత్రాత్మక దృష్టితో చూస్తున్నా. ఏడాదో లేదంటే కొన్నేళ్ల కోసమో మేం ఆలోచించడం లేదు. వచ్చే వెయ్యేళ్లపాటు మేము (యాపిల్) ఇక్కడ ఉండాలన్నదే మా లక్ష్యం. అసలు నేను ఇక్కడివాడినేనన్న అనుభూతికి లోనవుతున్నా’ అంటూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు. భారత్ పర్యటనలో ఉన్న కుక్ ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ మాకు అత్యంత కీలకమైన మార్కెట్. ఇక్కడ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలనుకుంటున్నాం. మా ఉత్పత్తి ఏదైనా అత్యుత్తమంగానే ఉంటుంది. అంతేకానీ, భారీ సంఖ్యలో విక్రయాల కోసం మేం చూడం. ఏదైనా ఉత్పత్తిని రూపొందించామంటే అది మాకు గర్వకారణంగా నిలవాల్సిందే. అలాకాకుంటే వాటిజోలికే వెళ్లం. ఇక్కడి రిటైల్ మార్కెట్లో యాపిల్‌కు అద్వితీయమైన భవిష్యత్తు ఉంది. చైనాతో పోలిస్తే భారత్ పూర్తిగా భిన్నమైన మార్కెట్’ అని కుక్ చెప్పారు. కొత్త వారంటీతో ప్రీ-ఓన్డ్(సెకండ్ హ్యాండ్) ఫోన్లను కూడా ఇక్కడ విక్రయించనున్నామని ఆయన వెల్లడించారు.

 ఇది ఆరంభం మాత్రమే...
బెంగళూరులో యాప్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు, హైదరాబాద్‌లో మ్యాప్స్ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన విషయాన్ని ఉద్దేశిస్తూ.. ఇది యాపిల్ భారత్ ప్రస్థానంలో ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. కాగా, భారత్‌తో మరో వెయ్యేళ్ల బంధం అని ప్రకటించినందుకు కుక్‌ను కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ కొనియాడారు. తయారీ రంగంలో పెట్టుబడుల వృద్ధి విషయంలో యాపిల్‌తో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శుక్రవారమిక్కడ జరిగిన అసోచామ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని అన్ని మొబైల్ తయారీ కంపెనీలూ భారత్‌కు క్యూ కట్టాయని..

స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ అంతకంతకూ జోరందుకుంటోందని ప్రసాద్ పేర్కొన్నారు. కాగా, తన పర్యటన చివరిరోజైన శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో కుక్ భేటీ కానున్నారు. భారత్‌లో రీఫర్‌బిష్డ్ మొబైల్ ఫోన్‌లను విక్రయించే అంశాన్ని ఈ సందర్భంగా కుక్ ప్రధానితో చర్చించవచ్చని భావిస్తున్నారు. రీఫర్‌బిష్డ్ (సెకండ్ హ్యాండ్) మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్న యాపిల్.. ఇందుకు తగిన అనుమతుల కోసం వేచిచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ముందుగా యాపిల్‌ను ఇక్కడ తయారీని ప్రారంభించేలా చూడాలని... భారత్‌లో ఉత్పత్తి అయిన హ్యాండ్‌సెట్స్‌కు మాత్రమే రీఫర్‌బిష్డ్ విక్రయాలను పరిమితం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

 యాపిల్ పే సేవలనూ అందిస్తాం...
భారత్‌లో 4జీ సేవలు పూర్తిస్థాయిలో వేళ్లూనుకుంటే సిగ్నల్ నాణ్యత కూడా పెరుగుతుందని.. దేశ ప్రగతికి ఇది చాలా కీలకమని కుక్ వ్యాఖ్యానించారు. ఇక్కడ యాపిల్ పే సేవలను ప్రవేశపెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. యాపిల్ డివెజైస్ ద్వారా మొబైల్ పేమెంట్స్‌కు ఉపయోగపడే డిజిటల్ వాలెట్ సేవలు ఇవి.

సునీల్ మిట్టల్‌తో భేటీ...
దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌తో కుక్ శుక్రవారం సమావేశమయ్యారు. దేశంలో తొలిసారిగా 4జీ సేవలు ప్రవేశపెట్టడంతోపాటు దేశవ్యాప్తంగా విస్తరించడంలో ముందున్న నేపథ్యంలో కుక్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలోని ఎయిర్‌టెల్ కార్యాలయంలో గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఎయిల్‌టెల్ ఎండీ, సీఈఓ, గోపాల్ మిట్టల్ ఇతర ఉన్నతాధికారులు హాజరైనట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి.  హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు కెవిన్ మిట్టల్ (సునీల్ మిట్టల్ కుమారుడు) కూడా కుక్‌తో సమావేశంలో పాల్గొన్నారు. హైక్ మెసెంజర్‌కు వస్తున్న ఆదరణ, వృద్ధి గురించి ఆయనకు వివరించారు. శుక్రవారం ఢిల్లీలోని యాపిల్ కార్పొరేట్ ఆఫీస్‌ను సందర్శించిన తర్వాత కుక్.. గుర్గావ్‌లోని డీఎల్‌ఎఫ్ గ్యాలెరియాలో ఉన్న యాపిల్ స్టోర్‌కు వెళ్లారు. యాపిల్ ఉత్పత్తులకు తమ కస్టమర్లే పెద్ద బలమని.. కస్టమర్ల నోటిమాటద్వారా జరిగే మార్కెటింగ్‌ను మించిందిలేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement