రెస్టారెంట్లు, హోటళ్లకు కేంద్రం వార్నింగ్
రెస్టారెంట్లు, హోటళ్లకు కేంద్రం వార్నింగ్
Published Wed, Sep 13 2017 7:02 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM
సాక్షి, న్యూఢిల్లీ : హోటళ్లు, రెస్టారెంట్లు ఎడాపెడా వాయించే సర్వీసు ఛార్జీలను తప్పనిసరిగా కాదని కేంద్రం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రెస్టారెంట్లు, హోటళ్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తూనే ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. సర్వీసు ఛార్జ్‌ను ఆదాయంగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రప్రత్యక్ష పన్నుల బోర్డును ఆదేశించింది. వీటిపై పన్ను వసూలు చేయాలంటూ సీబీడీటీకి పేర్కొంది. సర్వీసు ఛార్జ్‌లను వసూలు చేస్తే.. వాటిపై కూడా పన్ను చెల్లించాలంటూ రెస్టారెంట్లను సైతం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు హెల్ప్‌లైన్, మీడియా ద్వారా ఫిర్యాదులు వచ్చాయని పాశ్వాన్ ట్వీట్ చేశారు. ఇకపై రెస్టారెంట్ల నుంచి పన్నులు తీసుకుంటున్నప్పుడు అందులో సర్వీస్ ఛార్జీని కూడా కలపాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో జారీచేసిన గైడ్‌లైన్స్ ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లలో వసూలు చేసే సర్వీసు ఛార్జ్‌లు తప్పనిసరి కాదని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది ఒక ఆప్షనల్ మాత్రమేనని పేర్కొంది. కానీ తమకందిన ఫిర్యాదుల్లో ఈ ఛార్జీలను బలవంతంగా వసూలు చేస్తున్నట్టు తెలిసిందని పాశ్వాన్ చెప్పారు.
Advertisement